కవిత పార్టీతో బీఆర్‌ఎస్ భూ స్థాపితం
ABN , Publish Date - Feb 20 , 2026 | 02:05 AM
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే బీఆర్‌ఎస్ భూస్థాపితం అవుతుందని అనబోయి పొరపాటున బీజేపీ అని అన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు.
ఆమెను ఎవరు ఓడించిందో గుర్తుంచుకోవాలి
పాలనను గాలికొదిలేసిన రేవంత్: రాంచందర్‌రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే బీఆర్‌ఎస్ భూస్థాపితం అవుతుందని అనబోయి పొరపాటున బీజేపీ అని అన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ భూస్థాపితం కాకుండా చూసుకోవాలని చెప్పారు. ఆమెను ఏ పార్టీ ఓడించిందో గుర్తుంచుకోవాలని అన్నారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా సొంతంగా కరీంనగర్‌లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని అభినందించారు. సంజయ్‌తో పాటు మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు కృషి చేసిన డిప్యూటీ మేయర్ సునీల్ రావు, ఎన్నికల ఇన్‌చార్జ్ మనోహర్ రెడ్డికి, ఎన్నికైన కార్పొరేటర్లకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరుగుతోందనడానికి మునిసిపల్ ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయమే సంకేతమని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మేధావులు త్వరలో బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు, చిట్‌చాట్‌లతో పబ్బం గడుపుతూ పరిపాలన గాలికొదిలేశారని విమర్శించారు. తెలంగాణలో విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, రిటర్మెంట్ బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు.
మేమంటే కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సకు భయం: అర్వింద్
ఎవరి వల్ల ఎవరు భూస్థాపితం అయ్యారో మాజీ ఎమ్మెల్సీ కవితకు తెలుసు అని ఎంపీ అర్వింద్ అన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సకు మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు బీజేపీకి భయపడుతున్నాయని వ్యాఖ్యానించారు.