Share News

త్వరలో మహారాష్ట్ర సీఎంతో రేవంత్‌ భేటీ!

ABN , Publish Date - Jul 16 , 2026 | 06:02 AM

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి త్వరలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీ్‌సతో సమావేశం కానున్నారు. ఈ మేరకు ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీకి..

త్వరలో మహారాష్ట్ర సీఎంతో రేవంత్‌ భేటీ!

  • గోదావరి జలాల వినియోగంపై చర్చించనున్న సీఎంలు

  • తుమ్మిడిహట్టి ఎత్తు పెంపుపైనా చర్చించే అవకాశం

  • మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వెదిరె శ్రీరాం వెల్లడి

హైదరాబాద్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి త్వరలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీ్‌సతో సమావేశం కానున్నారు. ఈ మేరకు ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీకి లైన్‌ క్లియర్‌ అయిందని మహారాష్ట్ర నీటిపారుదల సలహాదారు వెదిరె శ్రీరాం బుధవారం ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారం.. రానున్న వారం, పది రోజుల్లో ఈ కీలక సమావేశం జరగనుంది. తెలంగాణ, మహారాష్ట్రల మధ్య ఉన్న జల వివాదాలు, ముఖ్యంగా గోదావరి జలాల వినియోగానికి సంబంధించి ఈ భేటీలో వీరు చర్చించనున్నట్లు తెలుస్తోంది. తుమ్మిడి హట్టి ప్రాజెక్టుకు సంబందించిన అంశంపై ఇరువురు సీఎంల మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. తుమ్మిడిహట్టి ఎత్తు పెంపు వల్ల మహారాష్ట్ర వైపు ముంపు ప్రభావం చాలా తక్కువగా ఉంటుందంటూ సీఎం రేవంత్‌రెడ్డి నెలన్నర క్రితమే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్‌కు అధికారికంగా లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల నీటి అవసరాలు తీరనున్నాయి. ఇటీవలే తెలంగాణ ఎంపీలతో జరిగిన సమావేశంలో కూడా సీఎం రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించారు. భేటీకి అంతా సిద్ధమైందని, కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు సాధించేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. గోదావరి జలాల మళ్లింపు, తుమ్మిడిహట్టి నిర్మాణానికి కావలసిన దాదాపు 2వేల ఎకరాల భూసేకరణ వంటి అంశాలపై ఈ సమావేశంలో ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు స్పష్టమైన నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Jul 16 , 2026 | 06:04 AM