తప్పిస్తారా.. తప్పుకొంటారా!?
ABN , Publish Date - Oct 09 , 2026 | 05:26 AM
ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు ఇకపై బీజేపీ ప్రభుత్వాన్ని ఎంతమాత్రం రక్షించలేవు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెంటనే సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తప్పించాలి. లేకపోతే, ప్రధాని మోదీ తన గద్దెను ఖాళీ చేయాలి. అలా చేయకపోతే ప్రజలే ఆయనను గద్దె దించుతారు’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు
జ్ఞానేశ్‌ను తప్పించకపోతే ప్రజలే మిమ్మల్ని తప్పిస్తారు
‘ఓట్ బచావో.. దేశ్ బచావో’లో ప్రధాని మోదీకి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరిక
న్యూఢిల్లీ, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ‘‘ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు ఇకపై బీజేపీ ప్రభుత్వాన్ని ఎంతమాత్రం రక్షించలేవు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెంటనే సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తప్పించాలి. లేకపోతే, ప్రధాని మోదీ తన గద్దెను ఖాళీ చేయాలి. అలా చేయకపోతే ప్రజలే ఆయనను గద్దె దించుతారు’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని దొడ్డిదారిన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు. ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ ఉద్యమంలో భాగంగా విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, ఇండియా కూటమి నేతలు గురువారం మహాత్మా గాంధీ సమాధి రాజ్‌ఘాట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అందులో పాల్గొన్న సీఎం రేవంత్.. రాజ్‌ఘాట్ వద్ద నివాళుల అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ ఉద్యమం కాంగ్రెస్ పార్టీ కోసమో, ఇండియా కూటమి కోసమో కాదని, దేశంలోని సామాన్యుల హక్కుల పరిరక్షణ ఉద్యమమని చెప్పారు. ‘‘2014లో మోదీ ప్రధాని అయినప్పుడు దేశంలో 81 కోట్ల ఓట్లు ఉన్నాయి. 2019 నాటికి 91 కోట్లకు, 2024 నాటికి 97 కోట్లకు చేరాయి. కానీ, 2029 ఎన్నికలనాటికి ఏకంగా 13 కోట్ల ఓట్లు తొలగిస్తున్నారు. జనాభా పెరిగితే ఓట్లు పెరగాలి. కానీ, ఇలా తగ్గించడం ఏమిటి?’’ అని నిలదీశారు. ఓటు హక్కు వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించుకున్నామని, ప్రజల సగటు ఆయుర్ధాయం పెరిగిందని, అయినా, దేశవ్యాప్తంగా దాదాపు 13 కోట్ల ఓట్లను తొలగించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఓట్లు ఎందుకు తగ్గాయో ప్రధాని మోదీ దేశ ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే వారి ఓట్లను టార్గెట్ చేసి తొలగిస్తున్నారని, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ వాట్సాప్, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నవారే వారి లక్ష్యమని మండిపడ్డారు. కేవలం మోదీజీకి అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే ఓటు హక్కు ఉండేలా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
ఓటు హక్కును గుంజుకునే కుట్ర
సంపన్నులు, పేదలనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ అంబేడ్కర్ ఓటు హక్కు కల్పించారని, ఇప్పటి వరకూ ఎన్నిసార్లు ‘సర్’ జరిగినా పేదల ఓట్లకు ముప్పు కలగలేదని, ఇప్పుడు అణగారిన వర్గాల నుంచి ఓటు హక్కును గుంజుకునేందుకు ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేష్ కుమార్ ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘‘ఎన్నికల సంఘం తప్పులను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై పోలీసులతో దాడులు చేయించడం, ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన నేతలను ఎన్నికల సంఘం కలవకపోవడం వెనక పెద్ద కుట్ర దాగి ఉంది. కులం, మతం, ప్రాంతం, భాషల పేరుతో దేశ ప్రజలను విభజించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఓటు ఉన్న వాళ్లు, లేనివాళ్లు అనే రెండు వర్గాలుగా దేశ ప్రజలను విభజిస్తున్నారు. బీజేపీకి అనుకూలంగా ఉన్నవాళ్లు ఒకవైపు, వ్యతిరేకంగా ఉన్న పేదలు మరో వైపు అన్నట్లు పరిస్థితులను మోదీ, జ్ఞానేష్ కుమార్ మార్చారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చే దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీ ఓటర్లను లక్ష్యంగా చేసుకొని తొలగిస్తున్నారని ఆరోపించారు.
యూపీఏ పాలనలోనే యూపీఏ సేవలు: సీఎం
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడూ డిజిటైజేషన్, ఆధునికీకరణకు ప్రాధాన్యతనిచ్చాయని సీఎం రేవంత్ తెలిపారు. మొబైల్ ఆధారిత డిజిటల్ చెల్లింపుల మౌలిక వ్యవస్థను 2012-13లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ-2 ప్రభుత్వం తీసుకొ చ్చిందని, ఎక్స్‌లో పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంపై దాడిని సహించేది లేదు: భట్టి
ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాలరాసేందుకు కుట్రలు జరుగుతున్నాయని, నేరుగా ప్రజాస్వామ్యంపైనే దాడి జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహిస్తున్నామనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించడమే ఎన్నికల సంఘం ప్రధాన బాధ్యతని, కానీ, ఇప్పుడు ప్రతి ఓటరూ ఈసీ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తప్పుబట్టారు. లోపాలు జరుగుతున్నాయని సొంత ఎన్నికల సంఘం సభ్యులే అంగీకరిస్తున్నప్పుడు, పారదర్శకతను నిరూపించుకోవాల్సిన బాధ్యత సీఈసీపైనే ఉందని చెప్పారు. లోపాలను సరిదిద్దాల్సింది పోయి ప్రతిపక్షాలు, రాహుల్ గాంధీ అబద్ధాలు చెబుతున్నారంటూ ప్రెస్ నోట్‌లు విడుదల చేయడం సరికాదని మండిపడ్డారు.