Share News

‘సర్‌’ను నిర్లక్ష్యం చేస్తే సీటు గల్లంతే

ABN , Publish Date - Jun 25 , 2026 | 04:44 AM

రాష్ట్రంలో ఓటర్‌ జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌-సర్‌) ప్రక్రియ పట్ల అవగాహన సదస్సుల నిర్వహణ, దీనికి సంబంధించి పార్టీ ఆదేశాల ....

‘సర్‌’ను నిర్లక్ష్యం చేస్తే సీటు గల్లంతే

  • పది రోజులు సమయమిస్తా.. అయినా మారకుంటే ఆ స్థానంలో కొత్త ఇన్‌చార్జ్‌ని వేస్తాం

  • వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చేది లేదు

  • అవగాహన సదస్సుల నిర్వహణలో బీజేపీ, బీఆర్‌ఎస్‌లే ముందున్నాయి

  • ఓట్లు తీసే బీజేపీనే పరిగెడుతుంటే.. మనమెంత అప్రమత్తంగా ఉండాలి

  • పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌ క్లాస్‌

హైదరాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఓటర్‌ జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌-సర్‌) ప్రక్రియ పట్ల అవగాహన సదస్సుల నిర్వహణ, దీనికి సంబంధించి పార్టీ ఆదేశాల అమల్లో నిర్లక్ష్యంగా ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు సీఎం రేవంత్‌ రెడ్డి గట్టి క్లాస్‌ తీసుకున్నారు. పది రోజులు సమయమిచ్చి చూస్తానని, అయినా మార్పు రాకపోతే ఆయా నియోజకవర్గాలకు కొత్త ఇన్‌చార్జ్‌లను నియమిస్తామన్నారు. నిర్లక్ష్యంగా ఉన్నందుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ కూడా ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. పని చేయకుండా పార్టీకి నష్టం కలిగిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని.. ఏ స్థాయిలో ఉన్నవారైనా పార్టీ ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. గురువారం నుంచి సర్‌ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం ఉదయం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో సీఎం జూమ్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌ సావంత్‌లు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌‌కు సర్‌ ప్రక్రియ చాలా సీరియస్‌ అంశమని, దీని పట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పార్టీ నాయకులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. ముఖ్యంగా సర్‌పై అవగాహన సదస్సుల నిర్వహణ విషయంలో ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్‌ఎస్‌ల కంటే కూడా వెనుకబడ్డామని చెప్పారు.


ఓట్లు తీసేసే బీజేపీ.. అవగాహన సదస్సుల విషయంలో ఉరుకులు పెడుతుంటే, అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ వెనుకపడటమేంటని పార్టీ నేతలను నిలదీశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు ఎక్కడెక్కడ అవగాహన సదస్సులు చురుకుగా నిర్వహిస్తున్నాయో.. కాంగ్రెస్‌ నాయకులు ఏయే నియోజకవర్గాల్లో వెనుకపడ్డారో.. చదవి వినిపించారు. పార్టీ ఉనికే లేని భద్రాచలం వంటి నియోజకవర్గంలో బీజేపీ అవగాహన సదస్సులు పెడుతుంటే.. కాంగ్రెస్‌ బలంగా ఉన్న సూర్యాపేట వంటి నియోజకవర్గాల్లో కూడా ఒక్క సదస్సు నిర్వహించకుంటే ఎలా అని నిలదీశారు. ఏ నియోజకవర్గంలో ఏ ఇన్‌చార్జ్‌ ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించారన్నది జిల్లాల వారీగా నివేదిక తన దగ్గర ఉందని చెప్పారు. కాంగ్రెస్‌ తరఫున మరిన్ని సదస్సులు జరగాల్సిన అవసరముందన్నారు. ఇన్‌చార్జ్‌ మంత్రులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని క్షమించబోమని హెచ్చరించారు. సర్‌ గురించి పార్టీ సర్పంచులతో గ్రామాల్లో ప్రచారం చేయించి అవగాహన కల్పించాలని సూచించారు. కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ తదితర జిల్లాల్లో అవగాహనా సదస్సులు సరిగా జరగట్లేదని, ఆయా జిల్లాల్లోని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు తమ పనితీరును మెరుగుపర్చుకోవాలన్నారు.

ఓటు పోతే.. రేషన్‌ కార్డూ పోయే ప్రమాదం

సర్‌ విషయంలో సరిగా వ్యవహరించకుంటే పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్‌ అన్నారు. ఈ ప్రక్రియను నిర్లక్ష్యం చేసి.. పేదల ఓట్లు పోతే వారి ఆధార్‌, రేషన్‌ కార్డులు.. వారికి వచ్చే సంక్షేమ కార్యక్రమాలూ ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో పేదలకు అన్యాయం జరగనివ్వొద్దని, ఈ ప్రక్రియ పట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

‘సర్‌’ను ఒక ఎన్నికలా తీసుకోండి: మీనాక్షి

పేదలు, నిరక్షరాస్యులకు సర్‌ మీద అవగాహన లేకపోవచ్చని, ఎన్నికల సమయంలో గ్రామాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో.. ఇప్పుడూ అదే అప్రమత్తతతో ఉండాలని మీనాక్షి నటరాజన్‌ సూచించారు. పార్టీ నేతలు, బూత్‌ లెవల్‌ ఏజెంట్లు.. గ్రామాల్లో 2002, 2025 ఓటర్‌ లిస్టులను దగ్గర పెట్టుకుని మ్యాపింగ్‌ చేయాలన్నారు. అర్హత కలిగిన ఏ ఒక్కరి ఓటూ పోకుండా కాపాడాలన్నారు. మహేశ్‌ గౌడ్‌ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ అప్రమత్తంగా లేకపోవడం వల్లే అధికారాన్నే కోల్పోవాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్‌ అనుకూల, లౌకికవాద ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని, ఈ విషయంలో ఎమ్మెల్యేలు, నియోజక వర్గ ఇన్‌చార్జ్‌లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Updated Date - Jun 25 , 2026 | 04:44 AM