టీచర్లు గంట అదనంగా పని చేయాలి
ABN , Publish Date - May 12 , 2026 | 04:21 AM
రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలు రెట్టింపు సంఖ్యలో ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
ప్రైవేటు కన్నా రెట్టింపు సంఖ్యలో ప్రభుత్వ బడులున్నా విద్యార్థులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు
ప్రైవేటులో ఉన్నదేంటి? మనలో లేనిదేంటి?
విద్యా వారోత్సవాల సభలో సీఎం రేవంత్
హైదరాబాద్, మే 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలు రెట్టింపు సంఖ్యలో ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యార్థులు మాత్రం సర్కారు బడుల్లో చాలా తక్కువగా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 19 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా.. 12 వేల ప్రైవేటు స్కూళ్లలో 38 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ బడుల్లో బోధించేందుకు 1.05 లక్షల మంది ఉపాధ్యాయలు ఉన్నారని చెప్పారు. ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలని జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) నిబంధనలు చెబుతుంటే.. మన వద్ద 17 మందికి ఒకరు చొప్పున ఉన్నారని వెల్లడించారు. అయినా.. ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడం వెనుక కారణాలేంటో ఉపాధ్యాయులు ఆలోచించాలన్నారు. ‘ప్రైవేటులో ఉన్న గొప్పతనమేంది? మన బలహీనతలేంటి? అన్నది టీచర్లు సమీక్షించుకోవాలి’ అని సీఎం సూచించారు. పేద విద్యార్థుల తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూడాలంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఒక గంట అదనంగా పనిచేయాలని కోరారు. ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా విద్యా వారోత్సవాలను సోమవారం ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు న్యాయమైన విద్య, సాంకేతిక నైపుణ్యాన్ని అందించడం ప్రభుత్వం బాధ్యత అని తెలిపారు. రాష్ట్రంలోని తండాలు, గూడేలు, గ్రామాల్లోని పేదలు, దళితులు, గిరిజనులకు విద్యనందించాలనే ఉద్దేశంతో విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్నానని చెప్పారు. రాష్ట్రంలో 11 వేల ఉపాధ్యాయ నియామకాలను 60 రోజుల్లో పూర్తిచేశామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 22 వేల మంది టీచర్లకు పదోన్నతులు కల్పించామన్నారు. 36 వేల మంది ఉపాధ్యాయుల బదిలీలు ఎలాంటి వివాదం లేకుండా చేశామని చెప్పారు. విద్యారంగంలో తెలంగాణ సాధించిన విజయాలను నీతి ఆయోగ్ అభినందించిందని గుర్తుచేశారు.
రాష్ట్ర బడ్జెట్‌లో 8 శాతం నిధులను విద్య కోసం కేటాయించామని, వచ్చే ఏడాది ఇంకా ఎక్కువ నిధులు ఇస్తామని తెలిపారు. దీనిని క్రమక్రమంగా 15 శాతానికి పెంచుతామన్నారు. ప్రపంచ అత్యుత్తమ విద్యా విధానాలను తెలంగాణలో అమలు చేస్తామని, ఇందుకోసం 25 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను పరిశీలన కోసం ఫిన్లాండ్ దేశానికి పంపించామని అన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన టీచర్లు 500 మంది ఉన్నా.. వారందరినీ విదేశీ పర్యటనలకు పంపిస్తామన్నారు. ఇక నుంచి రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు జూన్ 2న టీచర్లకు సన్మానం చేస్తామని సీఎం ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి కొన్ని పాఠశాలల్లో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ప్రవేశపెడుతున్నామని, విద్యార్థులెవరూ పది తర్వాత విద్యను ఆపవద్దన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
నేనూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థినే..
సర్కారు బడులను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సీఎం రేవంత్ అన్నారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి వేదికలు అని, వాటి బలోపేతానికి కఠిన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తామని ప్రకటించారు. పుస్తకాలు, నోటు పుస్తకాలు సరైన సమయంలో విద్యార్థులకు చేరాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల ప్రారంభమయ్యే రోజే విద్యార్థులకు ఒక జత స్కూల్ డ్రెస్ అందజేస్తున్నామని, మరో జతను నెలాఖరున ఇస్తామని తెలిపారు. ఎడ్యుకేషన్ కిట్ కోసం రూ.1000 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. నాణ్యమైన వస్తువులు రాకపోతే వెంటనే ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని, అలాంటి వస్తువులు సరఫరా చేసిన కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టి బొక్కలో తోయించే బాధ్యత తనదని చెప్పారు. విద్యాశాఖకు మంత్రి లేడంటూ కొందరు బుర్ర లేకుండా మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి విద్యను అందించి.. బాధ్యత కలిగిన పౌరులను దేశానికి అందించాలన్నదే తన ఉద్దేశమని, అందుకే విద్యాశాఖను తనవద్ద పెట్టుకున్నానని తెలిపారు. సమీక్ష సమయంలో అధికారులు తనను ముఖ్యమంత్రిగా కాకుండా.. విద్యాశాఖ మంత్రిగా చూడాలని సూచించారు. కాగా, క్యూర్ ప్రాంతంలో రూ.1011 కోట్లతో నిర్మించే యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు సీఎం శంకుస్థాపన చేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థులకు నగదు బహుమతి అందజేశారు. ఔటర్ రింగురోడ్డు లోపల విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కోసం1700 కోట్లతో అభివృద్ధి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నామని సీఎం తెలిపారు.