Share News

మహిళా రిజర్వేషన్‌ బిల్లులో..మెలికలు, తిరకాసులు పెట్టొద్దు

ABN , Publish Date - May 22 , 2026 | 04:23 AM

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి శాసనసభ, లోక్‌సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ తక్షణమే అమలయ్యేలా చట్టాన్ని సవరించాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

మహిళా రిజర్వేషన్‌ బిల్లులో..మెలికలు, తిరకాసులు పెట్టొద్దు

  • అలా పెడితే మళ్లీ రాజ్యాంగ సవరణ తప్పదు

  • చట్టసభల్లో మహిళా కోటా తక్షణమే అమలయ్యేలా చట్టాన్ని సవరించండి

  • కాంగ్రెస్‌ పార్టీ, ఇండియా కూటమి సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది

  • రాజీవ్‌గాంధీ వర్ధంతి కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి శాసనసభ, లోక్‌సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ తక్షణమే అమలయ్యేలా చట్టాన్ని సవరించాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళా బిల్లులో మెలికలు, తిరకాసులు పెట్టొద్దని స్పష్టం చేశారు. పార్లమెంటులో 2023లో ప్రవేశపెట్టిన బిల్లుకు అన్ని పార్టీలూ పూర్తి మద్దతు పలికినా.. అందులో మెలికలు, తిరకాసులు పెట్టినందువల్లనే మరోమారు రాజ్యాంగ సవరణ చేయాల్సి వచ్చిందని తప్పుబట్టారు. మహిళల పట్ల ప్రధాని మోదీకి ఏమాత్రం గౌరవం, చిత్తశుద్ధి ఉన్నా.. ఎలాంటి శషబిషలు, చర్చలకు తావు లేకుండా తక్షణమే సవరణ బిల్లు పెట్టాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ, ఇండీ కూటమి నూటికి నూరు శాతం మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్‌గాంధీ విగ్రహానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్‌ తీసుకొచ్చిన నాయకుడు రాజీవ్‌ గాంధీ అని కొనియాడారు. అదే స్ఫూర్తితో చట్టసభల్లోనూ మహిళలకు రిజర్వేషన్‌ కల్పించాలనుకున్న సోనియాగాంధీ.. 2013లోనే రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేశారని గుర్తు చేశారు. రాజీవ్‌ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని సోనియా గాంధీ తీసుకున్నారని చెప్పారు. ఆమె తీసుకున్న సాహసోపేత నిర్ణయం వల్లనే రాష్ట్ర ఏర్పాటు కల నిజమైందన్నారు. ఇందిర, రాజీవ్‌, సోనియాగాంధీల కుటుంబంతో తెలంగాణ ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం వారిని స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, గీతారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తదితరులు పాల్గొన్నారు.


గాంధీభవన్‌లో రాజీవ్‌కు ఘన నివాళి

దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్థంతి సందర్భంగా గురువారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నేతలు ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళిని అర్పించారు. ఖైరతాబాద్‌ డీసీసీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, రాజీవ్‌ ఫొటోల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి అజారుద్దీన్‌, ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జి కార్యదర్శి సచిన్‌ సావంత్‌, ప్రభుత్వ సలహాదారు వి.హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.

నన్ను సీఎం చేస్తానని రాజీవ్‌ హామీ ఇచ్చారు: వీహెచ్‌

రాజీవ్‌గాంధీతో తనకు సన్నిహిత బంధం ఉందని, ఆయన బతికి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు తనను సీఎంను చేస్తానంటూ హామీ కూడా ఇచ్చారని వి.హన్మంతరావు వెల్లడించారు. హామీ ఇచ్చిన ఆయన.. కొద్ది నెలలకే చనిపోవడం తన దురదృష్టమన్నారు. ఇందిర, రాజీవ్‌లా దేశం కోసం ప్రాణాలర్పించిన నాయకులు బీజేపీలో ఒక్కరైనా ఉన్నారా అంటూ ప్రశ్నించారు.

Updated Date - May 22 , 2026 | 04:23 AM