Share News

కిషన్‌ రెడ్డీ.. నేను రెడీ!

ABN , Publish Date - Jun 17 , 2026 | 04:16 AM

మెట్రో మొదటి దశకు ఐఆర్‌ఎఫ్‌సీ రుణం; రెండో దశకు అనుమతుల విషయంలో మరింత జాప్యం చేయవద్దు. వీటిపై చర్చించేందుకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో వెంటనే సమావేశం ఏర్పాటు చేయించండి.

కిషన్‌ రెడ్డీ.. నేను రెడీ!

  • మెట్రోపై అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయించండి

  • ఒప్పందాలు, ఆధారాలు పట్టుకొస్తా.. సందేహాలు నివృత్తి చేస్తా

  • మేమేమీ కేంద్రం నుంచి దానం అడగట్లే

  • ఒప్పందం ప్రకారం రుణం విడుదల చేయాలని అడుగుతున్నాం

  • రెండో దశ మెట్రో విస్తరణకు అనుమతులు ఇవ్వాలని కోరుతున్నాం

  • అనుమతులు ఆలస్యమైతే.. సొంత నిధులు, రుణాలతోనే ముందుకు

  • అందుకు అవసరమైన ముందస్తు అనుమతులను వెంటనే ఇప్పించాలి

  • కిషన్‌ రెడ్డికి సీఎం రేవంత్‌ లేఖ

హైదరాబాద్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): ‘‘మెట్రో మొదటి దశకు ఐఆర్‌ఎఫ్‌సీ రుణం; రెండో దశకు అనుమతుల విషయంలో మరింత జాప్యం చేయవద్దు. వీటిపై చర్చించేందుకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో వెంటనే సమావేశం ఏర్పాటు చేయించండి. సంబంధిత ఒప్పందాలు, ఆధార పత్రాలు, అధికారులతో కలిసి ఆ సమావేశానికి హాజరై అన్ని వివరణలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా’’ అంటూ కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి సీఎం రేవంత్‌ రెడ్డి మంగళవారం బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ నుంచి కేంద్రంలో సీనియర్‌ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ఈ విషయంలో బాధ్యత తీసుకుని ఐఆర్‌ఎ్‌ఫసీ ద్వారా మంజూరైన రుణం విడుదలయ్యేలా చూడాలని పేర్కొన్నారు. మెట్రో ఫేజ్‌-2ను కేంద్రం-రాష్ట్రం 50:50 జాయింట్‌ వెంచర్‌గా ఆమోదించాలని కోరుతున్నామని, ఒకవేళ అనుమతులు ఆలస్యమైతే, రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వనరులు, సంస్థాగత రుణాల ద్వారా ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అందుకు అవసరమైన ముందస్తు అనుమతులను ఆలస్యం లేకుండా కేంద్రం నుంచి ఇప్పించాలని కోరారు. ‘‘హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-1 మూడు కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర ప్రయాణికులకు సేవలందిస్తోంది. పెరిగిన జనాభా, నగర విస్తరణకు అనుగుణంగా మెట్రో నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్‌-2 ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించింది. మొత్తం ఏడు కారిడార్లలో 122.9 కిలోమీటర్ల మార్గమిది. సుమారు రూ.38,595 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రతిపాదనలు ఇచ్చింది. అయితే, ఫేజ్‌-1 ప్రైవేటు నిర్వహణలో ఉండటం, ఫేజ్‌-2 వేరే సంస్థాగత విధానంలో అమలు చేయనుండడంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తెలిపిన అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మకంగా స్వీకరించింది. మొత్తం మెట్రో వ్యవస్థ ఒకే నెట్‌వర్క్‌లో నడిచేందుకు వీలుగా ఫేజ్‌-1ను కొనుగోలు చేసే అసాధారణ నిర్ణయం తీసుకున్నాం. ఫేజ్‌-1 స్వాధీన ప్రక్రియలో ఈక్విటీ కొనుగోలుకు రూ.1,461.47 కోట్లు, ప్రాజెక్టు అప్పుల రీఫైనాన్సింగ్‌కు రూ.13,538.53 కోట్లు కలిపి మొత్తం రూ.15,000 కోట్ల లావాదేవీలున్నాయి.


ఈ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ పారదర్శకంగా నిర్వహించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం తన తరఫున యూపీఎంఆర్‌సీఎల్‌ ఎండీ సుశీల్‌కుమార్‌ను సభ్యుడిగా నామినేట్‌ చేసింది. ప్రాజెక్టును పూర్తిగా పరిశీలించి.. ఆడిట్‌ తదితర ప్రక్రియలను పూర్తి చేసి ఐఆర్‌ఎఫ్సీ రుణం మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అందుకు ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చింది. ఆర్‌బీఐ ద్వారా డైరెక్ట్‌ డెబిట్‌కు అంగీకరించింది. ఐఆర్‌ఎఫ్‌సీ షరతుల ప్రకారం మొదటి విడత నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.84.32 కోట్ల అప్‌ఫ్రంట్‌ ఫీజు చెల్లించింది. ఈక్విటీ రూ.1,461.47 కోట్లు ఇప్పటికే ఎస్ర్కో ఖాతాలో జమ చేసింది. ఈ ఒప్పందాలన్నీ పూర్తయ్యాక, అన్ని షరతులు నెరవేర్చాక జూన్‌ 15న రావాల్సిన మొదటి విడత రుణం విడుదల కాలేదు’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం దానం అడగటం లేదని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఐఆర్‌ఎ్‌ఫసీ రుణాన్ని విడుదల చేయించాలని కోరుతున్నామని పేర్కొన్నారు.

Updated Date - Jun 17 , 2026 | 05:43 AM