బయ్యారం ఉక్కు కలను సాకారం చేయండి
ABN , Publish Date - Apr 19 , 2026 | 06:38 AM
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ కలను సాకారం చేయాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రం ఏర్పాటు చేయండి
కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి వినతి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): బయ్యారంలో ఉక్కు పరిశ్రమ కలను సాకారం చేయాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. శనివారం ఢిల్లీలో కేంద్ర మంత్రులతో రేవంత్ భేటీ అయ్యారు. బయ్యారం గ్రీన్ స్టీల్ ప్లాంట్‌తో పాటు వివిధ అంశాలతో కూడిన వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రైజింగ్ - 2047 విజన్‌లో భాగంగా రూపొందించిన పారిశ్రామిక ప్రతిపాదనల గురించి వివరించారు. గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఉక్కు కొరత తగ్గుతుందని, పర్యావరణానికి మేలు జరుగుతుందని చెప్పారు. తెలంగాణలో పాత వాహనాల స్ర్కాప్‌తో ఉక్కును రీసైక్లింగ్ చేసే పరిశ్రమను ఏర్పాటు చేయాలని కోరారు. అందుబాటులో ఉన్న సాంకేతికత, భారీ పరిశ్రమలు, పారిశ్రామిక ఉత్పత్తికి ఉన్న అనుకూలతల వల్ల దేశ పారిశ్రామిక ఉత్పత్తి లక్ష్యాలకు హైదరాబద్ కేంద్రంగా నిలుస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో హైడ్రోజన్ టెక్నాలజీతో గ్రీన్ స్టీల్ క్లస్టర్, ఆటో, రక్షణ రంగాలకు అవసరమైన ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, మెషిన్ టూల్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక పరికరాల తయారీకి ప్రత్యేక పార్క్ ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్‌ను 2034 నాటికి కాలుష్యం లేని నగరంగా మార్చే లక్ష్యంతో వాహనాలను ఈవీలుగా మార్చేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు నేర్పే జాతీయ స్థాయి సంస్థలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని కోరారు.