Share News

ఈ ఏడాది రేవంత్‌రెడ్డికి తిరుగులేదు

ABN , Publish Date - Mar 20 , 2026 | 05:30 AM

సీఎం రేవంత్‌రెడ్డికి ఈ ఏడాది రాజయోగం బలంగా ఉందని, రాజకీయంగా ఎదురయ్యే అడ్డంకులను, ప్రత్యర్థుల వ్యూహాలను చాకచక్యంతో పటాపంచలు చేస్తారని సిద్ధాంతి బాచంపల్లి సంతోష్‌కుమార్‌ శాస్త్రి వెల్లడించారు.

ఈ ఏడాది రేవంత్‌రెడ్డికి తిరుగులేదు

  • ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేస్తారు

  • జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతారు

  • జూన్‌ నుంచి అక్టోబరు మధ్య మారనున్న రాజకీయ పరిణామాలు

  • బ్రాహ్మణులను నిందిస్తే పరాభవం తప్పదు పంచాగ పఠనంలో సంతోష్‌కుమార్‌ శాస్త్రి

రవీంద్రభారతి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డికి ఈ ఏడాది రాజయోగం బలంగా ఉందని, రాజకీయంగా ఎదురయ్యే అడ్డంకులను, ప్రత్యర్థుల వ్యూహాలను చాకచక్యంతో పటాపంచలు చేస్తారని సిద్ధాంతి బాచంపల్లి సంతోష్‌కుమార్‌ శాస్త్రి వెల్లడించారు. శత్రువులపై పైచేయి సాధిస్తారని వివరించారు. రేవంత్‌రెడ్డి తీసుకునే కొన్ని సంచలన నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తును మారుస్తాయని, పట్టుదలతో అనుకున్నది సాధిస్తారని వెల్లడించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో గురువారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పాల్గొనగా, బాచంపల్లి సంతోష్‌కుమార్‌ శాస్త్రి పంచాంగ పఠనం చేశారు. ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలు, అంతర్గత కలహాలు సృష్టించే శక్తులు యాక్టివ్‌గా ఉంటాయని, సీఎం తన బృందాన్ని(మంత్రులు, అధికారులను) సమన్వయం చేసుకోవడంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకుండా ఈ ఏడాది రేవంత్‌ రెడ్డి జాతీయ స్థాయిలో గుర్తింపు, గౌరవం పొందుతారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో పోరాడి.. విజయం సాధిస్తారని వివరించారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వానికి ఈ ఏడాది ప్రజల మద్దతు పుష్కలంగా లభిస్తుందని తెలిపారు. అయితే, పాలనాపరంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని, అవి దీర్ఘకాలంలో రాష్ట్రానికి మేలు చేస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగే కొన్ని అంతర్గత కుట్రలను ముఖ్యమంత్రి తన చాకచక్యంతో తిప్పికొడతారని, జూన్‌ నుంచి అక్టోబర్‌ మధ్య కాలం రాజకీయంగా అత్యంత కీలకమని, రాజకీయ పరిణామాలు వేగంగా మారుతాయని విశ్లేషించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత అదుబాటులో ఉండాలని, ప్రజా సమస్యల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పారిశ్రామికీకరణ, వ్యవసాయ అవసరాల దృష్ట్యా ఈ ఏడాది విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం అదనపు విద్యుత్‌ కొనుగోలు లేదా కొత్త ఉత్పత్తి కేంద్రాల ద్వారా ఈ డిమాండ్‌ను తట్టుకోవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం పుంజుకుంటుందని, కొత్త పెట్టుబడులు వచ్చే సూచనలు ఉన్నాయని తెలిపారు.


బంగారం, వెండి ధరల్లో ఒడిదొడుకులు ఉంటాయని, నిత్యవసరాల ధరలు సామాన్యులకు కొంత భారంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ పదవులు, ఇతర కీలక రంగాల్లో మహిళలకు ప్రాధాన్యం పెరుగుతుందని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని వివరించారు. రాష్ట్రంలో ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసి జలాశయాలు నిండుతాయని చెప్పారు. ఖరీప్‌, రబీ సీజన్లలో పంటలు సమృద్ధిగా పండుతాయని పేర్కొన్నారు. ధాన్యం, పప్పు దినుసులు, వాణిజ్య పంటలు రైతులకు లాభం చేకూరుస్తాయని అన్నారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందతుందని తెలిపారు. ‘‘మంచి వాళ్లను తిట్టడం, దేవతలను నిందించడం, వేదాలను నిందించడం, బ్రాహ్మణులను నిందించడం, ధర్మాన్ని నిందించడం.. ఇవి ఎవరైతే చేస్తారో వాళ్లకు హింస తప్పదు గాక తప్పదు. వారికి పరాభవం తప్పదు. నాయకులు కూడా మైకు దొరికింది కదా అని ఎక్కువ మాట్లాడడం సరికాదు. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండడమే మంచిది. యూట్యూబ్‌లో పిచ్చి థంబ్‌ నెయిల్స్‌ పెడుతూ సనాతన ధర్మాన్ని నిందించే వాళ్లకు పరాభవం తప్పదు’’ అని స్పష్టం చేశారు.

ఈ ఏడాది ప్రభుత్వానికి అనుకూలం

పరాభవ నామ సంవత్సరం ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని, కాంగ్రెస్‌ మరింత బలోపేతమవుతుందని పండితుడు చిలుకూరు శ్రీనివాసమూర్తి తెలిపారు. గాంధీభవన్‌లో గురువారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా పండితుడు చిలుకూరు శ్రీనివాసమూర్తి పంచాంగ పఠనం చేశారు. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురిసి, పాడి పంటలు వృద్ధి చెందుతాయన్నారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ ఈ ఏడాది ప్రజలకు అన్ని రంగాల్లో మేలు జరగాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.

Updated Date - Mar 20 , 2026 | 05:30 AM