Share News

పెట్టుబడుల పరిస్థితేంటి?

ABN , Publish Date - Apr 23 , 2026 | 04:12 AM

వివిధ వేదికలపై ప్రముఖ కంపెనీలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) వేగంగా అమల్లోకి వచ్చేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.

పెట్టుబడుల పరిస్థితేంటి?

  • కంపెనీలతో ఎంవోయూలువేగంగా అమల్లోకి రావాలి

  • ఆటంకాలుంటే తక్షణమే తొలగించండి

  • పెట్టుబడులపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): వివిధ వేదికలపై ప్రముఖ కంపెనీలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) వేగంగా అమల్లోకి వచ్చేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే భూముల కేటాయింపుతో పాటు ఇతర అనుమతులు పొందిన కంపెనీలు త్వరగా పనులు ప్రారంభించేలా చూడాలని తెలిపారు. దావోస్‌, తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌తో పాటు ఇతర వేదికలపై వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఎంవోయూల పురోగతిపై ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన బుధవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ఫ్యూచర్‌ సిటీతోపాటు వివిధ ప్రాంతాల్లో ఆయా సంస్థలకు కేటాయించిన భూములు, అక్కడి మార్కెట్‌ ధరలు... కంపెనీలు చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్న మొత్తాన్ని అధికారులు సీఎంకు వివరించారు. ప్రభుత్వ విధానం ప్రకారం.. క్యూర్‌, ఫ్యూర్‌, రేర్‌ ప్రాంతాల్లో సంస్థలకు భూములు కేటాయించాలని సీఎం సూచించారు. పెట్టుబడుల కోసం అనుమతులు వేగంగా ఇవ్వాలని, కంపెనీలు పనులు త్వరగా ప్రారంభించేలా చూడాలని ఆదేశించారు. ఎంవోయూలు కుదుర్చుకున్న కంపెనీలకు కేటాయించాల్సిన భూములకు సంబంధించి పెండింగ్‌ భూసేకరణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు. డాటా సెంటర్లకు ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని వినియోగించుకునే అవకాశం ఉన్నందున.. అందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.


మూడు కేటగిరీలుగా కంపెనీలు

పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించాలని సీఎం సూచించారు. మల్టీనేషనల్‌, మార్కెట్‌లోపేరు ప్రతిష్టలున్న కంపెనీలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి.. ఆయా సంస్థలు త్వరగా పనులు ప్రారంభించేలా చూడాలని కోరారు. వేగంగా ఎదుగుతున్న కంపెనీలు, భవిష్యత్‌లో మంచి ప్రతిభ కన బరుస్తాయనుకునే వాటికి రెండో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మిగతా కంపెనీలను మూడో ప్రాధాన్యంగా ఎంచుకొని వాటి పెట్టుబడులు పట్టాలెక్కేలా ప్రేరణ కల్పించాలని కోరారు. పెట్టుబడుల సాధనకు రాష్ర్టాల మధ్య ఉన్న పోటీతత్వాన్ని అధికారులు గుర్తించాని సీఎం అన్నారు. ఫ్యూచర్‌ సిటీలో కార్యాలయం పనులు త్వరగా పూర్తిచేసి అక్కడే ఎంవోయూల అమలు, పురోగతిపై నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయిన కంపెనీల ప్రతినిధులతో చర్చించి, వాటి ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎప్పుడెప్పుడు ఏయే ఎంవోయూలు కుదుర్చుకున్నాం? అవి ఏ స్థితిలో ఉన్నాయి? అమలుకు ఉన్న ఆటంకాలేంటి? వాటి పెట్టుబడి ఎంత? అవి కల్పించే ఉద్యోగాలెన్ని?.. ఇలా ప్రతి అంశం సీఎంవో, ఆయా శాఖల మంత్రులు తెలుసుకునేలా డ్యాష్‌ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దానిలో రియల్‌ టైం అప్‌డేట్‌ ఉండాలని తెలిపారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఆధ్వర్యంలో పూర్తిస్థాయి మానిటరింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టైర్‌ 2, టైర్‌ 3 సిటీల్లో ఏర్పాటు చేసిన ఐటీ టవర్లను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.

పాతబస్తీ మెట్రోకు భూసేకరణ పూర్తిచేయండి

హైదరాబాద్‌ పాతబస్తీలో మెట్రో రైలు పనులకు సంబంధించి మిగిలిన భూ సేకరణను వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్‌ మెట్రో రైలు పనులపై సమీక్ష సందర్భంగా రెండేళ్లలోనే చాంద్రాయణగుట్ట వరకు మెట్రో రైలు పనులు పూర్తి కావాలని స్పష్టంచేశారు. రెండో దశ మెట్రో అనుమతులు, బహదూర్‌గూడ వద్ద హైస్పీడ్‌ కారిడార్‌ వరకు మెట్రో విస్తరణ అంశాలపైనా చర్చించారు.

Updated Date - Apr 23 , 2026 | 04:12 AM