70 ఏళ్ల కేరళంతో మా 28 నెలల పాలనకు పోలికా?
ABN , Publish Date - Apr 07 , 2026 | 05:08 AM
సుస్థిరాభివృద్ధిలో మాది అగ్రస్థానం.. మీది ఆరో స్థానం’’ ..అంటూ కేరళం సీఎం పినరయి విజయన్ ‘ఎక్స్’ వేదికగా చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు.
విజయన్.. మీరు చెప్పిన గణాంకాలన్నీ బీఆర్‌ఎస్ హయాంలోనివి
కాంగ్రెస్ ముఖ్యమంత్రుల కృషిని మీ ఖాతాలో వేసుకోవడం తగదు
పినరయి వ్యాఖ్యలకు.. 6 పేజీల లేఖతో రేవంత్ కౌంటర్
హైదరాబాద్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): ‘‘సుస్థిరాభివృద్ధిలో మాది అగ్రస్థానం.. మీది ఆరో స్థానం’’ ..అంటూ కేరళం సీఎం పినరయి విజయన్ ‘ఎక్స్’ వేదికగా చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. ఆ ఆరోపణలను లిఖితపూర్వకంగా ఖండిస్తూ... వాస్తవాలు, అధికారిక గణాంకాలతో తిప్పికొట్టారు. విజయన్ చెప్పిన తెలంగాణ గణాంకాలన్నీ 2023-24 సంవత్సరం నాటివని, అవి తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన చివరి దశకు సంబంధించినవని సీఎం రేవంత్ గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 28 నెలలు అయ్యిందని, కేరళంలో విజయన్ సర్కారు 120 నెలలుగా అధికారంలో ఉన్నదని.. 70 ఏళ్ల కేరళం ప్రస్థానాన్ని తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు 28 నెలల పాలనతో పోల్చడం... విజయన్ వంటి సీనియర్ లీడర్ స్థాయికి తగదని పేర్కొన్నారు. ఈమేరకు.. ఆరు పేజీల సుదీర్ఘ లేఖను.. తన సంతకంతో సోమవారం విడుదల చేశారు. గత 60 ఏళ్లలో జరిగిన అక్కడి అభివృద్ధికి విజయన్, ఎల్డీఎఫ్ ప్రభుత్వం మాత్రమే కారణమని చెప్పడాన్ని రేవంత్ తప్పుబట్టారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం సాధించిన సమగ్ర, సమ్మిళిత, సంపూర్ణ ప్రగతి గురించి లేఖలో స్పష్టంగా వెల్లడించారు. కేరళంలో పేదరికం రేటు తగ్గడానికి కూడా 60 ఏళ్లుగా అన్ని ప్రభుత్వాలూ చేసిన కృషి, గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన విదేశీ మారక ద్రవ్య ప్రవాహాలే కారణమని స్పష్టం చేశారు. ‘‘తెలంగాణ ఏర్పడి కేవలం 12 సంవత్సరాలే అయ్యింది. అందులోనూ దాదాపు 10 సంవత్సరాల పాటు రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు సంయుక్తంగా సృష్టించిన ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్రంలో 5.88 శాతం పేదిరికం నమోదు అయింది’’ అని గుర్తుచేశారు. తమ ప్రభుత్వ విజయాలు ఏమిటో యావత్ దేశానికి తెలుసని పేర్కొన్నారు. అక్షరాస్యత విషయంలోనూ పోలిక తెచ్చే ముందు.. రెండు రాష్ట్రాల భౌగోళిక, చారిత్రక నేపథ్యాలను, జనాభాను పరిగణనలోకి తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. కేరళంలో సార్వత్రిక అక్షరాస్యతకు కారణం కేవలం విజయన్ సర్కారు మాత్రమే కారణం కాదన్న విషయం గుర్తెరగాలన్నారు.
అలాగే తెలంగాణలో ప్రజారోగ్యానికి సంబంధించి తమ ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి వివరించారు. ‘‘దశాబ్దాలుగా యూడీఎఫ్, ఎల్డీఎఫ్ ప్రభుత్వాల హయాంలో ఆరోగ్యం, అక్షరాస్యత, పర్యాటక రంగాలలో కేరళం సాధించిన విజయాలను నేను ఎల్లప్పుడూ గుర్తించాను. ఒక సీనియర్ నాయకుడిగా నేను మిమ్మల్ని గౌరవిస్తాను. అందుకే 7న తిరువనంతపురానికి వచ్చి, మా ప్రభుత్వ 28 నెలల విజయాలకు సంబంధించిన సమాచారాన్ని మీకు తెలియజేస్తా. అదే సమయంలో కొన్ని విషయాలను స్పష్టంగా చెబుతున్నా. కేరళంలో మేధో వలసలు, పారిశ్రామిక స్తబ్దత, గల్ఫ్ దేశాల నుంచి వచ్చే డబ్బుతో సంక్షేమ పథకాల రూపకల్పనతో ప్రజలు సతమతమవుతున్నారు. మీరు పదేళ్లుగా అధికారంలో ఉండి, కొత్త పరిష్కారాలు కనుకుంటారని ఆశించారు. మీ రాష్ట్ర ప్రజలు సంక్షేమంతో పాటు అవకాశాలను కూడా సమతుల్యం చేసే ప్రభుత్వాన్ని ఆశిస్తున్నారు. పాత ఎల్డీఎఫ్ నమూనా కంటే కాంగ్రెస్ నమూనాను కోరుకుంటున్నారు. కేరళం ప్రజలు అందమైన మలయాళీ భాషలో నాకు నేర్పిన మాటను, ఇప్పుడు నేను పూర్తి ఆప్యాయతతో మీకు చెబుతున్నాను. ‘‘నీ పో, మోనే విజయన్!’’