Share News

అజారుద్దీన్‌, కోదండరాం పేర్లను ఆమోదించండి

ABN , Publish Date - Apr 20 , 2026 | 05:07 AM

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్‌, కోదండరాం పేర్లను ఆమోదించాలని గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.

అజారుద్దీన్‌, కోదండరాం పేర్లను ఆమోదించండి

  • గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా ఓకే చేయండి

  • గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాను కోరిన సీఎం రేవంత్‌రెడ్డి

  • డ్రగ్స్‌ తీసుకోబోమంటూ విద్యార్థుల నుంచి

  • ప్రమాణ పత్రం తీసుకోవాలని గవర్నర్‌ సూచన

  • తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామన్న రేవంత్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్‌, కోదండరాం పేర్లను ఆమోదించాలని గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. గతంలో అప్పటి గవర్నర్‌ వద్దకు ఈ ఫైల్‌ రాగా న్యాయనిపుణుల అభిప్రాయం సైతం తీసుకున్నారని, నియామకానికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ వేం నరేందర్‌ రెడ్డితో కలిసి ఆదివారం లోక్‌భవన్‌కు వెళ్లిన సీఎం రేవంత్‌.. గవర్నర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీల నియామకంతోపాటు విద్యారంగానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న అజారుద్దీన్‌ ఆరు నెలల్లోపు చట్టసభల సభ్యుడు కావాల్సి ఉంది. నెలాఖరుకు ఆ గడువు ముగుస్తున్న నేపథ్యంలో గతంలో జరిగిన పరిణామాలను గవర్నర్‌కు సీఎం వివరించినట్లు తెలిసింది. కాగా, విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రమాణ పత్రం తీసుకోవాలని గవర్నర్‌ సూచించగా.. తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల నిరోధంపై ప్రచారానికి సంబంధించి జూన్‌12న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న అవగాహన కార్యక్రమంపై సీఎంతో గవర్నర్‌ చర్చించారు. కాగా, గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి శనివారం సీఎస్‌ రామకృష్ణారావు, అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌ రెడ్డి గవర్నర్‌ను కలిసి.. ఇప్పటిదాకా జరిగిన ప్రాసె్‌సను వివరించినట్లు సమాచారం.

Updated Date - Apr 20 , 2026 | 05:08 AM