Share News

కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచుదాం

ABN , Publish Date - Apr 28 , 2026 | 06:15 AM

కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. విచారణ చేపట్టేలా సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాయాలన్నారు.

కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచుదాం

  • సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాయండి.. నేరుగా వినతిపత్రం ఇవ్వండి

  • మంత్రి ఉత్తమ్‌, అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌

  • సీబీఐ విచారణకు చట్టపరమైన అడ్డంకుల్లేవు: న్యాయ నిపుణులు

  • హైకోర్టు తప్పుబట్టింది ఘోష్‌ నివేదికను కాదు, నోటీసుల్ని: సీఎం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. విచారణ చేపట్టేలా సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాయాలన్నారు. అవసరమైతే సీబీఐ డైరెక్టర్‌ను నేరుగా కలిసి వినతిపత్రం సమర్పించాలని మంత్రులకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్‌ పీసీ ఘోష్‌ నివేదిక ఆధారంగా కేసీఆర్‌, హరీ్‌షరావుపై తదుపరి చర్యలు తీసుకోరాదంటూ ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి అధికారులతో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయ నిపుణుడు అభిషేక్‌ సింఘ్వీ, మంత్రి శ్రీధర్‌బాబు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా అభిషేక్‌ సింఘ్వీతో చర్చించి ప్రభుత్వం అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికను సీఎం నిర్దేశించారు. కాళేశ్వరం అంశంపై ప్రస్తుతం ఏ కోర్టులోనూ ఎలాంటి కేసు పెండింగ్‌లో లేదని, దీంతో సీబీఐ విచారణ చేపట్టేందుకు అడ్డంకులు లేవని న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు. కాళే శ్వరం ప్రాజె క్టులోని అక్రమాలపై విచారణ కోరుతూ సీబీఐకి సమ్మతి తెలిపినందున హైకోర్టు తీర్పు దీనికి వర్తించదని అన్నారు. ఇటీవలే ఢిల్లీకి వెళ్లి ఈ అంశంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖను సంప్రదించిన అంశాలు కూడా చర్చకు వచ్చాయి. సీబీఐ విచారణ చేపట్టాలని కేంద్రాన్ని కోరగా... ఏదైనా పోలీస్ స్టేషన్ లో దీనిపై కేసు నమోదు చేశారా? అని కేంద్రం అడిగిన విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, సీఎం సెక్రటరీ మాణిక్‌రాజ్‌ కన్నన్‌, ఇరిగేషన్‌ కార్యదర్శి శ్రీధర్‌, సలహాదారు ఆదిత్యనాథ్‌ దాస్‌, వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


నివేదికను తప్పు పట్టలేదు

కాళేశ్వరంపై పీసీ ఘోష్‌ కమిషన్‌ ఏర్పాటును గానీ, ఆ కమిషన్‌ ఇచ్చిన నివేదికను గానీ హైకోర్టు తప్పుబట్టలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌, హరీశ్‌రావు తదితరులకు నోటీసులు జారీ చేసిన విధానాన్ని మాత్రమే తప్పుబట్టిందన్నారు. మీడియా ప్రతినిధులతో చిట్‌ చాట్‌ సందర్భంగా రేవంత్‌రెడ్డి ఈ అంశంపై మాట్లాడుతూ.. పిటిషన్‌దారులు ఘోష్‌ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారని తెలిపారు. అయితే ఈ కమిషన్‌ ఏర్పాటు రాజ్యాంగ, చట్ట విరుద్ధం కాదంటూ హైకోర్టు స్పష్టం చేసిందని వెల్లడించారు. అలాగే ఘోష్‌ కమిషన్‌ నివేదిక చట్ట విరుద్ధమని, దానిని రద్దు చేయాలని పిటిషన్‌దారులు కోర్టును కోరారని, అయితే కమిషన్‌ ఏర్పాటు చట్టబద్ధమని తేలినందున దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదని అన్నారు. దీంతో నివేదిక యథాతథంగా కొనసాగుతుందన్నారు. పిటిషనర్‌కు నివేదిక ప్రతిని అందించకుండా ప్రచురించడం చట్ట విరుద్దమని, సహజ న్యాయసూత్రాలను ఉల్లంఘించినట్లుగా ప్రకటించాలని హైకోర్టును పిటిషనర్లు కోరారని తెలిపారు. అయితే నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత పిటిషనర్లకు ప్రతులు అందించినందున ఈ అభ్యర్థనపైనా కోర్టు ఎలాంటి నిర్ణయం వెలువరించలేదన్నారు. కాళేశ్వరం డిజైన్‌లో లోపాలున్నాయంటూ కేసీఆర్‌ హయాంలోనే ఎన్డీఎ్‌సఏ నివేదిక ఇచ్చిందని సీఎం గుర్తు చేశారు. విజిలెన్స్‌, ఘోష్‌ కమిషన్‌, ఎన్డీఎ్‌సఏ నివేదికల ఆధారంగానే సీబీఐ విచారణ కోరామని తెలిపారు. కేసును సీబీఐకి అప్పగిస్తే 48గంటల్లో విచారణ చేపడతామని గతంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడారని, ఇప్పటికైనా దాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. తాను, మంత్రి ఉత్తమ్‌ ఢిల్లీకి వెళ్లి.. సీబీఐ డైరెక్టర్‌ను కలిసి ఈ మేరకు కోరతామని చెప్పారు. సీబీఐ విచారణ చేపట్టకపోతే కాంగ్రెస్‌ తరఫున, ప్రభుత్వం తరఫున కార్యాచరణ తీసుకుంటామన్నారు. తాను కాళేశ్వరానికి అధికారిక పర్యటనకు వెళ్లినప్పుడు సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీల అధికారులతోపాటు ఎన్డీఎ్‌సఏ చైర్మన్‌ కూడా పాల్గొన్నారని, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ దీనిని ఎలా తప్పు పడతారని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అధికారులపై తాము చర్యలు తీసుకోవడం సరైంది అవుతుందా?అని ప్రశ్నించారు. బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికే హరీశ్‌ ఢిల్లీ వెళ్లారని, ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే ఎన్డీఎస్ఏ చైర్మన్‌ గురించి సంజయ్‌ మాట్లాడారని తెలిపారు.


నేడు మళ్లీ సీఎం సమీక్ష

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం మరోసారి సమీక్ష చేయనున్నారు. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికతోపాటు తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి, తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లలో ఏ అలైన్‌మెంట్‌కు మొగ్గుచూపాలి? తుమ్మిడిహెట్టి డీపీఆర్‌ పురోగతి, మేడిగడ్డ మరమ్మతులు, రాష్ట్రంలో భూసేకరణ, పునరావాసం, నీటిపారుదల ప్రాజెక్టులకు రుణ సమీకరణ, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌పై ఎన్‌జీఆర్‌ఐ నివేదిక, టన్నెల్‌ తవ్వకం పునఃప్రారంభం వంటి అంశాలపై చర్చించనున్నారు.

Updated Date - Apr 28 , 2026 | 06:16 AM