ఔషధ కొనుగోళ్లపై విజిలెన్స్
ABN , Publish Date - Jun 08 , 2026 | 05:48 AM
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆస్పత్రులకు అవసరమైన మందులు, వైద్య సామగ్రి కొనుగోళ్లలో అవకతవకలు, అక్రమాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది.
2022 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు జరిపిన కొనుగోళ్లపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
రూ.3,500 కోట్ల టెండర్లు, పర్చేజ్‌ల తనిఖీలు
టెండర్ల ఖరారులో నిబంధనల ఉల్లంఘనలు
కొందరికి అనుకూలంగా మారిన నిబంధనలు
మార్కెట్ ధర కంటే ఎక్కువ చెల్లించి కొనుగోళ్లు
ఆర్థిక అవకతవకలు.. లోపించిన పారదర్శకత
టీజీఎంఎస్ఐడీసీ ఈడీ, బృందంపై విచారణ
మందుల కొనుగోలు రికార్డులు ఇవ్వాలని ఆదేశిస్తూ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ లేఖ
అరకొరగా సమాచారమిచ్చిన అధికారులు
హైదరాబాద్, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆస్పత్రులకు అవసరమైన మందులు, వైద్య సామగ్రి కొనుగోళ్లలో అవకతవకలు, అక్రమాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. 2022 ఏప్రిల్ నుంచి నేటి వరకు ‘తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ)’ ఆధ్వర్యంలో జరిగిన కొనుగోళ్ల లెక్కలన్నీ తేల్చేందుకు సిద్ధమైంది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. టీజీఎంఎస్ఐడీసీ వేదికగా 2022 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు జరిగిన సుమారు రూ.3,500 కోట్ల విలువైన మందుల కొనుగోళ్లు, టెండర్ల ప్రక్రియపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి సూచించారు. ఈ మేరకు వివరాల కోసం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం రీజనల్ అధికారి తాజాగా టీజీఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) గౌరవ్ ఉప్పల్‌కు రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. 2022లో నాటి సీఎం కార్యాలయంలో పనిచేసే ఓ ఉన్నతాధికారి కుటుంబ సభ్యులొకరు.. ప్రభుత్వ పెద్దల అండదండలతో టీజీఎంఎస్ఐడీసీ లో కీలక పోస్టుకు వచ్చారు. అప్పటి నుంచి సదరు అధికారి పెత్తనమే కొనసాగుతోందని, కార్పొరేషన్ పరిధిలో జరిగే కొనుగోళ్లన్నీ ఆ అధికారి కనుసన్నల్లోనే నడిచేవని అధికార వర్గాలు చెబుతున్నాయి. సదరు అధికారి కొన్ని కంపెనీలకు ప్రయోజనం కల్పించేలా.. మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరతో మందులు, వైద్య సామగ్రి కొనుగోలు చేసి ఏజెన్సీలకు లాభం చేకూర్చేలా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో సీఎంవో అండతో చక్రం తిప్పిన సదరు అధికారి.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అధికార వర్గాలతో మంచి సంబంధాలు కొనసాగించారని, దానితో వారి వ్యవహారాం నిరాఘాటంగా కొనసాగిందని అంటున్నారు. తాజాగా ఈ అక్రమాలపై సీఎంకు ఫిర్యాదులు అందడంతో.. వెంటనే విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో విజిలెన్స్ విభాగం గత నెల 20వ తేదీనే టీజీఎంఎస్ఐడీసీ ఎండీకి లేఖ రాసింది.
ఓ బృందాన్ని సిద్ధం చేసుకుని అవకతవకలు!
టీజీఎంఎస్ఐడీసీ లో అడ్డా వేసిన అధికారి ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని చక్రం తిప్పినట్టు సమాచారం. ఆ బృందంలో ఇద్దరు వైద్యులతోపాటు ఫైనాన్స్ విభాగం ఉద్యోగి ఒకరు, క్వాలిటీ కంట్రోల్ విభాగానికి చెందిన ఒక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి, గతంలో కార్పొరేషన్‌లో పనిచేసి ప్రస్తుతం బయట నుంచి వ్యవహారాలు నడుపుతున్న మరో కీలక ఉద్యోగి ఉన్నట్టు వైద్యవర్గాలు చెబుతున్నాయి. టెండర్ల ఖరారులో నిబంధనల ఉల్లంఘన, ఆర్థిక అవకతవకలు, నిబంధనల ఉల్లంఘన వంటి తీవ్రమైన ఆరోపణలు ఈడీ బృందంపై వచ్చినట్టు విజిలెన్స్ తమ లేఖలో పేర్కొనడం గమనార్హం. వైద్యారోగ్య శాఖ 2022 సెప్టెంబర్ 9న జారీ చేసిన జీవో నం.140 కింద చేసిన కొనుగోళ్లలో భారీగా నిధులు దారి మళ్లినట్టు ఆరోపణలు ఉన్నాయని స్పష్టం చేసింది.
ఐదు రకాల మందుల కొనుగోళ్లలో తిరకాసు!2022 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు నాలుగేళ్లలో కొనుగోలు చేసిన అత్యవసర మందుల టెండర్లపై విజిలెన్స్ ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. కిడ్నీ, గుండె జబ్బులు, మధుమేహం, తీవ్ర రక్తహీనతకు వాడే.. రిటుక్సిమాబ్ ఇంజెక్షన్స్, టికాగ్రేలర్ టాబ్లెట్స్, ఇన్సులిన్ 50:50, ఇన్సులిన్ 70:30, ఫెర్రిక్ కార్బాక్సిమాల్టోస్ ఇంజెక్షన్లతోపాటు వైద్య పరీక్షల కిట్లు, రీఏజెంట్లు, పరికరాల కొనుగోళ్లకు సంబంధించిన అన్ని వివరాలను అందజేయాలని సూచించింది. వీటి కొనుగోళ్లలో మార్కెట్ ధర కంటే ఎక్కువగా చెల్లించి, రాష్ట్ర ఖజానాకు గండి కొట్టినట్టుగా విజిలెన్స్ ప్రాథమిక పరిశీలనలో గుర్తించినట్టు సమాచారం.
ఈ అక్రమాల వెనుక ఎవరున్నారో తేల్చేందుకు 11 కీలక అంశాల పత్రాలను, ఫైళ్లను తక్షణమే అందజేయాలని టీజీఎంఎస్ఐడీసీని విజిలెన్స్ ఆదేశించింది. ఆస్పత్రుల నుంచి వచ్చిన ఇండెంట్ల దగ్గరి నుంచి బిల్లుల చెల్లింపు వరకు అన్ని అంశాలపై విచారణ చేసేందుకు సిద్ధమైంది. మరోవైపు ఈ వ్యవహారం తాలూకు ఫైళ్లను మాయం చేేసందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే సందేహాల నేపథ్యంలో.. విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. అన్ని ప్రభుత్వ శాఖలు, సెక్రటేరియట్ విభాగాల అధిపతులు, కలెక్టర్లు సహకరించాలని స్పష్టం చేసింది. తనిఖీల సమయంలో రికార్డులు దాచినా, జాప్యం చేసినా చర్యలు తప్పవంటూ అంతర్గత ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం. కాగా, విజిలెన్స్ కోరిన సమాచారంలో కొన్నింటి వివరాలు మాత్రమే.. టీజీఎంఎస్ఐడీసీ అధికారులు పంపినట్టు సమాచారం. కొన్ని రకాల ఔషధాల కొనుగోళ్లు, వైద్య పరీక్షల కిట్లు, పరికరాల కొనుగోళ్లు, బిల్లుల చెల్లింపులు, టెండర్లు, వాటి ధరలు, నిపుణుల నివేదికలను విజిలెన్స్ కోరగా.. కార్పొరేషన్ మాత్రం కేవలం నాలుగు రకాల ఇంజెక్షన్లు, ఒక టాబ్లెట్‌కు సంబంధించి వివరాలనే పంపినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో విజిలెన్స్ నుంచి త్వరలోనే టీజీఎంఎస్ఐడీసీకి మరో సర్క్యులర్ వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.
వైద్య మంత్రికి తెలియకుండానే..
కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత కూడా టీజీఎంఎస్ఐడీసీ లో అవకతవకలు కొనసాగాయని.. ఇద్దరు, ముగ్గురు కాంట్రాక్టర్లకే అన్ని ప్రధాన ఔషధ, ఎక్వి్‌ప్‌మెంట్, రీఏజెంట్స్, ఇతర వైద్య పరీక్షల కిట్ల కొనుగోళ్ల కాంట్రాక్టులు దక్కుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు తెలియకుండా, గుట్టుచప్పుడు కాకుండా ఈ తతంగం నడిపిస్తున్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే ఇటీవల ఈ వ్యవహారం మంత్రి దృష్టికి వెళ్లడంతో కార్పొరేషన్‌లో పాతుకుపోయిన పలువురు అధికారులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని తప్పించాలని తాజాగా శాఖ కార్యదర్శిని ఆదేశించినట్టు సమాచారం.