Share News

రాహుల్‌, ప్రియాంకలతో రేవంత్‌ భేటీ

ABN , Publish Date - Mar 19 , 2026 | 04:13 AM

కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలను సీఎం రేవంత్‌ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ఉదయం 11.45 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌తో కలిసి సీఎం .....

రాహుల్‌, ప్రియాంకలతో రేవంత్‌ భేటీ

  • వేంని పరిచయం చేసిన సీఎం

  • మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసులో..సిట్‌ దర్యాప్తుతో నిజాలన్నీ వెలుగులోకి

  • పుట్టా మహేశ్‌కు బెయిల్‌లో మా ప్రమేయం లేదు

  • తెలంగాణలో 2029లోనే అసెంబ్లీ ఎన్నికలు: సీఎం రేవంత్‌రెడ్డి

న్యూఢిల్లీ, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలను సీఎం రేవంత్‌ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ఉదయం 11.45 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌తో కలిసి సీఎం రేవంత్‌ పార్లమెంట్‌కు చేరుకున్నారు. తొలుత.. రాహుల్‌ గాంధీని ఆయన కార్యాలయంలో కలిసి కొత్తగా రాజ్యసభకు ఎంపికైన వేం నరేందర్‌ రెడ్డిని పరిచయం చేశారు. దాదాపు 10 నిమిషాలపాటు సీఎం, పీసీసీ చీఫ్‌ సహా పార్టీ ఎంపీలతో రాహుల్‌ గాంధీ మాట్లాడారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఆ తర్వాత పార్లమెంట్‌ ఆవరణలో ప్రియాంక గాంధీకి వేం నరేందర్‌ రెడ్డిని పరిచయం చేశారు. ఈ సందర్భంగా రాహుల్‌, ప్రియాంకలకు వేం నరేందర్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అగ్రనేతలను కలిసిన వారిలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి, ఎంపీలు మల్లు రవి, సురేశ్‌ షెట్కార్‌, ఆర్‌. రఘురాంరెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌, చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేత రోహిన్‌ రెడ్డి ఉన్నారు. మరోవైపు.. మొయినాబాద్‌ ఫాంహౌస్‌ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి వాస్తవాలన్నీ సిట్‌ దర్యాప్తులో వెలుగులోకి వస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. డ్రగ్స్‌ వ్యవహారంలో ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. బుధవారం పార్లమెంట్‌ ఆవరణలో మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. తెలుగు రాష్ట్రా ల్లో సంచలనం సృష్టించి న మొయినాబాద్‌ డ్రగ్స్‌ వ్యవహారంపై తొలిసారిగా స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. మొయినాబాద్‌ డ్రగ్స్‌ వ్య వహారంలో ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌ సహా మరికొందరు నిందితులు స్టేషన్‌ బెయిల్‌ పొందడంలో తమ ప్రమేయమేమీ లేదని, నిబంధనల మేరకే వారికి బెయిల్‌ లభించిందన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు 2029లోనే జరుగుతాయని, 2028లో ఎన్నికలు జరుగుతాయనే ప్రచారాన్ని కొట్టిపారేశారు. కేంద్రం జాతీయ జనగణన నిర్వహించాల్సి ఉందని, ఆ తర్వాత దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్‌వ్యస్థీకరణ జరుగుతుందని తెలిపారు.

రేవంత్‌ను పలకరించిన రోజా

పార్లమెంట్‌ ఆవరణలో సీఎం రేవంత్‌ రెడ్డిని ఏపీ మాజీ మంత్రి, సినీనటి రోజా మర్యాదపూర్వకంగా పలకరించారు. పార్టీ అగ్రనేతలను కలిసేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి పార్లమెంట్‌కు వచ్చారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసేందుకు వైసీపీ ఎంపీలతో కలిసి రోజా కూడా అక్కడికి వచ్చారు. ఈక్రమంలో రేవంత్‌ రెడ్డి, రోజా ఒకరికొకరు ఎదురుపడడంతో పలకరించుకున్నారు. అయితే, గతంలో రేవంత్‌, రోజా ఇద్దరూ టీడీపీలో కలిసి పనిచేసిన విషయం తెలిసిందే.

Updated Date - Mar 19 , 2026 | 04:13 AM