Share News

కార్మికుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం

ABN , Publish Date - May 01 , 2026 | 05:22 AM

మే డే సందర్భంగా కార్మిక వర్గానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కార్మిక వర్గ స్ఫూర్తితో ముందుకెళుతున్నామని, తమ ప్రజా ప్రభుత్వ పాలనలో కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందని స్పష్టం చేశారు.

కార్మికుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం

  • ప్రజా ప్రభుత్వంలో వారికి సముచిత గౌరవం

  • కార్మికులకు సీఎం రేవంత్‌ మే డే శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): మే డే సందర్భంగా కార్మిక వర్గానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కార్మిక వర్గ స్ఫూర్తితో ముందుకెళుతున్నామని, తమ ప్రజా ప్రభుత్వ పాలనలో కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందని స్పష్టం చేశారు. కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. తెలంగాణ గిగ్‌, ప్లాట్‌ఫాం వర్కర్ల సంక్షేమ బిల్లు తీసుకొచ్చామని, గిగ్‌ వర్కర్ల కోసం రూ.5 లక్షల ప్రమాద బీమా అమలు చేశామని తెలిపారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోందని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను పూర్తి చేశామన్నారు. రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ దేశానికే తలమానికంగా ఉన్న సింగరేణి కార్మికులకు, దసరా, దీపావళి పండుగలకు ముందే బోనస్‌ చెల్లించామని తెలిపారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్ట్‌ కార్మికులకు రూ.5 వేల చొప్పున బోనస్‌ ఇచ్చామని గుర్తుచేశారు. దాంతోపాటు, పలు బ్యాంకుల సహకారంతో కార్మికులకు కోటి రూపాయల బీమా సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని వివరించారు. గల్ఫ్‌ దేశాల్లో పనిచేసే తెలంగాణ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ కార్మికులు ఆయా దేశాల్లో ఏ కారణంతో మరణించినా వారి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు.

Updated Date - May 01 , 2026 | 05:22 AM