Share News

KTR: సర్వభ్రష్ట ప్రభుత్వానికి రేవంత్‌ నాయకుడు

ABN , Publish Date - Jan 05 , 2026 | 03:08 AM

సర్వభ్రష్ట కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రేవంత్‌రెడ్డి నాయకుడని, ఆయన తన అజ్ఞానాన్ని కప్పి పుచ్చుకునేందుకే బీఆర్‌ఎస్‌ నేతలను తిడుతున్నారని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు.

KTR: సర్వభ్రష్ట ప్రభుత్వానికి రేవంత్‌ నాయకుడు

  • కాంగ్రెస్‌ నేతలపై నాటి ఎన్‌టీఆర్‌ వ్యాఖ్యలు నిజం: కేటీఆర్‌

హైదరాబాద్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): సర్వభ్రష్ట కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రేవంత్‌రెడ్డి నాయకుడని, ఆయన తన అజ్ఞానాన్ని కప్పి పుచ్చుకునేందుకే బీఆర్‌ఎస్‌ నేతలను తిడుతున్నారని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం నిర్వహించిన నదీజలాలు- కాంగ్రె స్‌ ద్రోహాలు అనే అంశంపై చేపట్టిన పీపీటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పదే పదే కేసీఆర్‌ చావును కోరుకునే రాబందు రేవంత్‌ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వికృతమైన చేష్టలతో కేసీఆర్‌ స్థాయిని తగ్గించలేరన్నారు. సీఎంకు సాగునీటి పారుదల రంగంపై కనీస అవగాహన లేదని, దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఆయనకు ఏమీ తెలియదని విమర్శించారు. కాంగ్రెస్‌ నేతలందరూ కుక్కమూతి పిందెలని... నాడు ఎన్‌టీఆర్‌ చెప్పిన మాట నూరుశాతం నిజమని ప్రస్తుత ప్రభుత్వ చర్యలు రుజువు చేస్తున్నాయన్నారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడుతున్న భాషను చూసిన తర్వాత వినాశకాలే విపరీత బుద్ధి అనే పెద్దలమాట గుర్తుకు వస్తోందన్నారు. 420 హామీలిచ్చి ఎగవేసిన పార్టీని 420 సార్లు ఉరితీయాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, నిరుద్యోగులకు ఏటా రెండు లక్షల ఉద్యోగాలిస్తామని హామీలిచ్చి మోసం చేసిన రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డిని ఎన్నిసార్లు ఉరితీయాలని ప్రశ్నించారు. ఐఐటీకి, త్రిబుల్‌ ఐటీకి, బచావత్‌ ట్రైబ్యునల్‌కు, బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌కు తేడా తెలియని అజ్ఞాని రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. దేవాదుల ఏ బేసిన్‌లో ఉందో అడిగే వ్యక్తి అసెంబ్లీలో ఇరిగేషన్‌పై మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్‌ పోరాటం ఆగదని, కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థ, అహంకార, ద్రోహపూరిత విధానాలను ప్రజల ముందు నిరంతరం ఎండగడతామని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Updated Date - Jan 05 , 2026 | 03:08 AM