కాళేశ్వరాలయ పునరుద్ధరణకు సీఎం భూమిపూజ
ABN , Publish Date - Apr 21 , 2026 | 04:04 AM
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు, బస్టాండ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి..
ఆలయంలో మంత్రులతో కలిసి ప్రత్యేక పూజలు
కుంగిన మేడిగడ్డ పిల్లర్, బోర్ రింగ్స్ పనుల పరిశీలన
నెలాఖరుకు పరీక్షలన్నీ పూర్తి చేయాలని ఆదేశం
వరంగల్, భూపాలపల్లి/మహదేవపూర్ ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు, బస్టాండ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం భూమిపూజ చేశారు. రూ.198 కోట్లతో ఆలయ పునరుద్ధరణ, రూ.3.94 కోట్లతో బస్టాండ్ నిర్మాణానికి మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్, వివేక్‌లతో కలిసి శంకుస్థాపన చేశారు. అంతకుముందు మంగళ వాయిద్యాలతో వేదమంత్రాల మధ్య సీఎంకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో మహా రుద్రాభిషేకం చేశారు. అనంతరం శుభానంద దేవిని సీఎం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితోపాటు మంత్రులకు ప్రిన్సిపల్ సెక్రటరీ, దేవాదాయ శాఖ కమిషనర్ పట్టు వస్త్రాలు అందజేసి సన్మానం చేశారు.
మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సీఎం
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీని సీఎం రేవంత్ రెడ్డి ఎన్‌డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్‌తో కలిసి సోమవారం పరిశీలించారు. కుంగిన పిల్లర్ల మరమ్మతుకు చేపట్టిన పరీక్షలను పరిశీలించారు. బోర్ రింగ్స్ ద్వారా జియో టెక్నికల్, జియో ఫిజికల్, జీపీఆర్ శాంపిల్ సేకరణను పరిశీలించారు. సాంకేతిక బృందంతో చర్చించారు. మొత్తం 520 బోర్ రింగ్స్ ద్వారా శాంపిల్స్ సేకరించి సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌కు పంపనున్నట్లు ఇంజనీర్లు తెలిపారు. ఆ తర్వాతే బ్యారేజీపై పూర్తి అవగాహన రానుందని చెప్పారు. డ్రోన్ టెస్ట్, సీపీఆర్ టెస్ట్ ద్వారా 20-30 మీటర్ల లోతు వరకు పిల్లర్ల వద్ద నేల స్వభావానికి సంబంధించిన ఫలితాలను తెలుసుకోవచ్చునని వివరించారు. డ్రోన్ టెస్టులను సీఎం పరీక్షించారు. నేల స్వభావానికి సంబంధించిన ఫలితాలు రాగానే మే 30లోగా అన్ని రకాల టెస్టులను పూర్తి చేయాలని సీఎం సూచించారు. నెలాఖరుకు టెస్టులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు.