కేంద్రమంత్రి అల్పాహార విందులో సీఎం
ABN , Publish Date - Apr 19 , 2026 | 06:49 AM
కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఆత్మీయ అల్పాహార విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
పలువురు కేంద్రమంత్రులు, ఎన్డీఏ ఎంపీల హాజరు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఆత్మీయ అల్పాహార విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. శనివారం ఉదయం ఢిల్లీలోని కేంద్రమంత్రి అధికారిక నివాసంలో ఈ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి రాకతో కేంద్రమంత్రి నివాసం సందడిగా మారింది. అక్కడికి వచ్చిన కేంద్రమంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుతోపాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో రేవంత్ రెడ్డి ముచ్చటించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, సమన్వయం, కేంద్ర ప్రభుత్వ సహకారం వంటి పలు కీలక విషయాలపై చర్చించారు. కాగా, బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సైతం రేవంత్ రెడ్డితో ఒకే టేబుల్‌పై కనిపించారు. అలాగే, అక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులతో పాటు వారి కుటుంబ సభ్యులు రేవంత్‌తో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. దాదాపు గంటసేపు రేవంత్ కేంద్రమంత్రి నివాసంలో ఉండడం గమనార్హం.