3 దాకా గాంధీభవన్‌కు రావొద్దు
ABN , Publish Date - Jul 20 , 2026 | 03:21 AM
సర్ ప్రక్రియకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ గడువును ఎన్నికల సంఘం ఆగస్టు 3 వరకు పొడిగించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు.
నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవులు అడగొద్దు
‘సర్’ ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ పూర్తయ్యేదాకా క్షేత్రస్థాయిలోనే ఉండండి
25 స్థానాల్లో వెనుకబడ్డాం.. బాధ్యులు స్పందించండి
బీఎల్‌వోల రిపోర్టులపైనే ఆధారపడొద్దు
పార్టీ బీఎల్‌ఏలను సమర్థంగా ఉపయోగించుకోండి
సర్‌పై నాయకులు, పార్టీ శ్రేణులకు సీఎం దిశానిర్దేశం
భవిష్యత్ ఫుట్‌బాల్ స్టార్‌ల్లో తెలంగాణ బిడ్డలు
ఇండియా ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ ఆడే రోజూ వస్తుంది
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆశాభావం
హైదరాబాద్, జూలై 19(ఆంధ్రజ్యోతి): సర్ ప్రక్రియకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ గడువును ఎన్నికల సంఘం ఆగస్టు 3 వరకు పొడిగించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. పెరిగిన సమయాన్ని అవకాశంగా తీసుకొని పార్టీ శ్రేణులంతా ఆగస్టు 3వ తేదీ దాకా క్షేత్రస్థాయిలో శ్రమించాలని అన్నారు. ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ పూర్తయ్యేదాకా నామినేటెడ్ పోస్టులని, పార్టీ పదవులని ఎవ్వరూ గాంధీ భవన్‌కు రావొద్దని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా వచ్చినా.. ముఖ్యనాయకులు వారికి అపాయింట్‌మెంట్లు ఇవ్వవద్దని పేర్కొన్నారు. సర్ అంశంలో నియోజకవర్గాల బాధ్యుల పనితీరుపై ఆదివారం ఆయన వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహే్‌షగౌడ్, మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సర్‌కు సంబంధించి నియోజకవర్గ ఇన్‌చార్జులు, సమన్వయ కర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉంటే.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్ ప్రక్రియపై కేవలం 489 సమావేశాలు జరగాయని అన్నారు. సర్ అంశంలో 25 నియోజకవర్గాల్లో పని తీరు బాగోలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో నాలుగు నియోజకవర్గాల్లో అసలు పనే జరగలేదన్నారు. బాగా వెనుకబడిన నియోజకవర్గాల బాధ్యులు ఇప్పటికైనా స్పందించాలన్నారు. కొందరు నాయకులు హైదరాబాద్‌కే పరిమితమయ్యారని, తమ నియోజకవర్గాల్లో పని చేయట్లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం నుంచి ఆగస్టు 3 వరకు నాయకులంతా క్షేత్రస్థాయిలోనే ఉండి సర్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. పది మంది ఇన్‌చార్జి మంత్రులు సోమవారం అన్ని జిల్లాల్లో సర్‌పై సమీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఎంపీలు పార్లమెంటు సమావేశాల్లో ఉన్నా.. వారు ఇన్‌చార్జులుగా ఉన్నచోట్ల ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలన్నారు. సరిగా పనిచేయని పక్షంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
పార్టీ సర్ ఇన్‌చార్జులు ఆయా నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు.. బూత్‌లెవల్ అధికారుల(బీఎల్‌ఓలు) రిపోర్టుల కంటే పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్‌ఏలు) రిపోర్టుల పరిశీలనకే ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. బీఎల్‌ఓల రిపోర్టులపైనే ఆధారపడితే కఠిన చర్యలు తీసుకుంటామని, పార్టీ బీఎల్‌ఏలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని తెలిపారు. బాగా పని చేసిన వంద మంది బీఎల్‌ఏలకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీతో ఫొటో దిగే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నేతలంతా వచ్చే పది రోజులూ ఎన్నికల ప్రచారం తరహాలో నియోజకవర్గంలో పర్యటించాలని స్పష్టం చేశారు. ఈ నెల 30న మరోసారి పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తామని, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నివేదికలు తీసుకుంటామని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరింత బాధ్యత తీసుకుని ఇన్‌చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జ్‌లను సమన్వయం చేయాలని సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. ఇక, టీపీసీసీ చీఫ్ మహే్‌షగౌడ్ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలకు సర్ ప్రక్రియ ఎంతో కీలకమని, నాయకులంతా తమ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు.. బీఎల్‌ఏలకు అవసరమైన సహకారాన్ని అందించాలని సూచించారు. అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా నష్ట పోకూడదని స్పష్టం చేశారు.
ఆ 4 నియోజకవర్గాల్లో పనితీరు దారుణం
సర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించడం, అర్హులైన ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారాలను నింపించడం వంటి కార్యక్రమాల్లో అలంపూర్, ఆర్మూర్, ఆసిఫాబాద్, బహుదూర్ పూర్ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ బాధ్యులు పూర్తిగా వెనుకబడ్డారు. సమావేశంలో వెల్లడించిన నివేదిక ప్రకారం ఈ 4 నియోజకవర్గాల్లో బాధ్యులు అసలు పనే చేయట్లేదు. ఇబ్రహీంపట్నం, కూకట్‌పల్లి, బాల్కొండ, బోధన్, చేవేళ్ల, గజ్వేల్, చార్మినార్, బహుదూర్‌పూర, యాకత్‌పురా, ముథోల్, నిర్మల్, పినపాక, రాజేంద్రనగర్, ఉప్పల్, ఎల్లారెడ్డి, నర్సంపేట, హుజూర్‌నగర్ తదితర 21 నియోజకవర్గాల్లో బాధ్యుల పని తీరు పేలవంగా ఉంది. బాన్సువాడ, చొప్పదండి, ధర్మపురి, కోదాడ, మల్కాజిగిరి, మునుగోడు, ముషీరాబాద్, నారాయణపేపట, నర్సాపేట, పరిగి, కుత్బుల్లాపూర్, సత్తుపల్లి, శేరిలింగంపల్లి, తుంగతుర్తి,సూర్యాపేట, జహీరాబాద్, వరంగల్ తదితర 42 నియోజకవర్గాల్లో పనితీరు ఫర్వాలేదన్నట్లుగా ఉంది. మిగిలిన 52 నియోజకవర్గా ల్లో మాత్రం కాంగ్రెస్ నేతలు బాగా పనిచేస్తున్నారు.
బాగా పని జరుగుతున్న 52 నియోజకవర్గాలు ఇవే
అచ్చంపేట, ఆదిలాబాద్, ఆలేరు, అంబర్ పేట, ఆందోల్, అశ్వారావుపేట, బెల్లంపల్లి, భువనగిరి, భూపాలపల్లి, బోధ్, చెన్నూరు, దేవరకొండ, డోర్నకల్, ేస్టషన్‌ఘన్‌పూర్, గోషామహల్, హుస్నాబాద్, హుజూరాబాద్, జడ్చర్ల, జగిత్యాల, కల్వకుర్తి, కామారెడ్డి, కరీంనగర్, ఖైరతాబాద్, కొడంగల్, ఖమ్మం, కొల్లాపూర్, కొత్తగూడెం, మధిర, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మానకొండూరు, మంచిర్యాల, మంథని, మిర్యాలగూడ, ములుగు, నాగార్జున సాగర్, నకిరేకల్, నల్లగొండ, నారాయణఖేడ్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, పాలకుర్తి, పరకాల, రామగుండం, సంగారెడ్డి, సిర్పూర్, తాండూరు, వేములవాడ, వనపర్తి, వరంగల్ వెస్ట్, వర్ధన్నపేట, ఇల్లందు