Share News

రాహుల్‌ను మించిపోయిన రేవంత్‌

ABN , Publish Date - Apr 17 , 2026 | 04:13 AM

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల్లో ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీని మించిపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు ఎద్దేవా చేశారు.

రాహుల్‌ను మించిపోయిన రేవంత్‌

  • కాంగ్రెస్‌ ఎంపీలకు ఆయనే డైరక్షన్‌ ఇస్తున్నారు

  • బీఆర్‌ఎస్‌తోపొత్తు ప్రసక్తే లేదు: రాంచందర్‌రావు

హైదరాబాద్‌, చందానగర్‌, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల్లో ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీని మించిపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు ఎద్దేవా చేశారు. గురువారం పార్లమెంట్‌ గ్యాలరీలో కూడా కూర్చొన్న రేవంత్‌.. రాహుల్‌ గాంధీని మాట్లాడనియ్యలేదని, కాంగ్రెస్‌ ఎంపీలకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారని విమర్శించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ యత్నిస్తోందని ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన రాంచందర్‌రావు.. రాహుల్‌, రేవంత్‌కు సంబంధించిన ఓ కార్టూన్‌ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ..‘‘రాహుల్‌ కుర్చీలో తాను కూర్చున్నట్లు రేవంత్‌ భావిస్తున్నట్లుంది. కాంగ్రెస్‌లో జాతీయనేతగా ఎదిగిపోయానని అనుకుంటున్నారు.. డీలిమిటేషన్‌ ప్రక్రియలో జీఎస్‌డీపీ, దక్షిణాదికి అన్యాయమంటూ కొత్త అంశాలను మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ ఎంపీలకు ఆయనే డైరక్షన్‌ ఇస్తున్నారు. రాహుల్‌ను రేవంత్‌ మాట్లాడనీయడం లేదు. రాహుల్‌కు సబ్జెక్టు తెలియక మాట్లాడడం లేదా? లేక రేవంత్‌కు ఎక్కువ సబ్జెక్టు తెలిసి మాట్లాడుతున్నారో తెలియదు’’ అని ఎద్దేవా చేశారు. జీఎస్‌డీపీ ప్రాతిపదిక సీట్లు పెంచాలన్న సీఎం రేవంత్‌ ప్రతిపాదనను తప్పుబట్టారు. మందుబాబులను పెంచి పోషించి రెవెన్యూ పెంచుకుని, జీఎస్‌డీపీ పెరిగిందంటూ దాని ఆధారంగా సీట్లు పెంచమంటారా? అని రేవంత్‌ను నిలదీశారు. రాష్ట్రంలో కులగుణన ప్రక్రియ అసంపూర్తిగా జరిగిందన్న రాంచందర్‌రావు.. ముస్లింల జనాభాను ప్రభుత్వం తక్కువగా వెల్లడించిందని ఆరోపించారు. ఇక, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ ఎంపీ లక్ష్మణ్‌ లక్ష్యంగా పార్టీలో కొందరు చేస్తున్న ఆరోపణలపైనా రాంచందర్‌రావు స్పందించారు. వారిద్దరిపై ప్రేమ ఉంది కాబట్టే ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో స్థానిక సర్దుబాటు మాత్రమే జరిగిందని, ఆ పార్టీతో పొత్తు ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కాగా, పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెడుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని చందానగర్‌లో నిర్వహించిన నారీశక్తి వందన్‌ పాదయాత్రలో రాంచందర్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2026 | 04:13 AM