Share News

ఏడుస్తూనే ఉండండి.. నా పని చేసుకుంటూ పోతా: సీఎం రేవంత్

ABN , Publish Date - Apr 29 , 2026 | 05:50 AM

ఫ్యూచర్‌ సిటీ భవిష్యత్‌ తరాలకు వరమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రపంచంలోని ఆదర్శ నగరాలతో పోటీపడేలా నిర్మిస్తున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులందరూ ఈ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.

ఏడుస్తూనే ఉండండి.. నా పని చేసుకుంటూ పోతా: సీఎం రేవంత్

  • మరో పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుందామనుకున్నారు

  • అధికారం లాక్కున్నానని ఆ కుటుంబం పెడబొబ్బలు

  • శుక్రాచార్యుడు మారీచ, సుబాహులను వదిలాడు

  • ఫ్యూచర్‌ సిటీని సింగపూర్‌, టోక్యోల రేంజ్‌కి తీసుకెళ్తా

  • భూసేకరణలో తప్పులుంటే దిద్దుకుంటాం

  • రైతులూ భూములపై లీగల్‌ చిక్కుల్లోకి వెళ్లొద్దు

  • ఇప్పుడు తీసుకుంటే ఎకరాల్లో కొనుక్కోగలరు

  • పరిహారం ఆలస్యమైతే గజాల్లో కూడా కొనలేరు

  • ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

  • ప్యూచర్‌ సిటీ కమిషనరేట్‌కు శంకుస్థాపన

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)

ఫ్యూచర్‌ సిటీ భవిష్యత్‌ తరాలకు వరమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రపంచంలోని ఆదర్శ నగరాలతో పోటీపడేలా నిర్మిస్తున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులందరూ ఈ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్‌పేట్‌లో ఫ్యూచర్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఇదే సందర్భంగా మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్‌ భవనం, అక్టోపస్‌ అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌, కుత్బుల్లాపూర్‌ డీసీపీ కార్యాలయాలను రిమోట్‌ పద్ధతిలో ప్రారంభించారు. గచ్చిబౌలి ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ భవన నిర్మాణానికీ శంకుస్థాపన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఏ నగరానికీ లేని సదుపాయాలు, మౌలిక వసతులు హైదరాబాద్‌కు ఉన్నాయని దీంతో ఇక్కడ అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని చెప్పారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీని సింగపూర్‌, టోక్యో, న్యూయార్క్‌ల్లా అద్భుతమైన నగరంగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్యూచర్‌ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ఫార్చ్యూన్‌-500 కంపెనీలు భారీ పెట్టుబడులతో ముందుకు వస్తున్నాయని తెలిపారు. ప్యూచర్‌ సిటీని మేడ్చల్‌ లేదా పటాన్‌చెరు వైపు కట్టాలని కూడా కొందరు కోరారని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఈ ప్రాంతం మీదుగానే తాను తన ఊరికి వెళ్తానని, అందుకే ఇక్కడే ఫ్యూచర్‌ సిటీని ఎంపిక చేశానని తెలిపారు. గత ప్రభుత్వం ఇక్కడ కాలుష్య కారక పరిశ్రమలు పెట్టేందుకు నిర్ణయించిందని, ప్రజల జీవితాల్లో చీకట్లు ఉండకూడదనే ఉద్దేశంతో అద్భుత నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు.


పడనోళ్లు, నచ్చనోళ్లు కడుపు నొప్పితో ఎద్దేవా మాటలు మాట్లాడుతున్నారని సీఎం చెప్పారు. మీరు ఏడ్చుకుంటూనే ఉండండి.. నేను చేసుకుంటూనే పోతానే ఉంటా అని విపక్షాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అధికారం పోయిందని కేసీఆర్‌ కుటుంబం పెట్టే పెడబొబ్బలు తన చెవులో సంగీతం వినిపించినట్లు ఉంటుందని చెప్పారు. ఇంకో 10, 20 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకుందామని కలలు కన్నారని, అర్థంతరంగా రైతు బిడ్డ వచ్చి గుంజుకుపోయాడనే బాధ కేసీఆర్‌ కుటుంబంలో ఎక్కువైందని వ్యాఖ్యానించారు. లోక కళ్యాణం కోసం ఎవరైనా యాగాలు చేస్తుంటే శుక్రాచార్యుడు మారీచుడు, సుబాహుడనే రాక్షసులను ఊరి మీదకు వదిలి యాగాల్లో రక్తం, మాంసాలు వేయించి అడ్డుకునే వాడని వ్యాఖ్యానించారు. ఫామ్‌హౌస్‌లో ఉన్న శుక్రాచార్యుడు ఇద్దరిని జనంలోకి వదిలాడని కేటీఆర్‌, హరీశ్‌లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.


revanth.jpg

రైతులకు న్యాయం చేస్తాం

ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధిలో భాగంగా నష్టపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం తెలిపారు. మంత్రి శ్రీధర్‌ బాబు ఎప్పుడూ రైతులకు అందుబాటులో ఉంటారని చెప్పారు. మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని అధికారులకు సూచించారు. రైతులు సహకరిస్తే ప్రపంచంలోనే అద్భుతమైన నగర నిర్మాణానికి వేగంగా అడుగులు పడతాయని చెప్పారు. న్యాయపరమైన వివాదాలకు వెళ్లొద్దని రైతులను కోరారు. రైతులకు మర్యాద ఇచ్చి గౌరవించాలని అధికారులకు చెప్పారు. సమస్య తెగని పరిస్థితి వస్తే తన దృష్టికి తేవాలని ఆదేశించారు. భూసేకరణలో నాడు దేవేందర్‌గౌడ్‌ చొరవవల్లే రంగారెడ్డి జిల్లాకు ఇన్ని ప్రాజెక్టులు వచ్చాయని గుర్తు చేసుకున్నారు. ఏనాటికైనా భూమి ప్రభుత్వపరం అవుతుందని, భూసేకరణ వాయిదా వేయడం వల్ల రైతులే నష్టపోతారని చెప్పారు. పరిహారం తీసుకుని వేరే ప్రాంతాల్లో భూములు కొంటే రైతులకు ఎలాంటి నష్టం ఉండదని అన్నారు. వాయిదా వేస్తే ఎకరాల్లో కొనాల్సిన వాళ్లు గజాల్లో కూడా కొనలేని స్థితి ఎదురవుతుందని హితవు చెప్పారు. ప్యూచర్‌ సిటీ ప్రకటనకు ముందు ఇక్కడ ఎకరా రూ.3 కోట్లు ఉంటే ఇపుడు రూ.6 కోట్లకు చేరిందని ప్రస్తావించారు. తమ గ్రామాలను కూడా ఫ్యూచర్‌ సిటీలో కలపాలని కొంతమంది అడుగుతున్నారని, గ్రామసభలు నిర్వహించి తీర్మానం చేయిస్తే సిద్ధమని స్థానిక నేతలకు చెప్పారు.

రక్షణ ఎగుమతులు రెట్టింపు

హైదరాబాద్‌ రక్షణ ఉత్పత్తుల కేంద్రంగా మారిందని సీఎం అన్నారు. రఫేల్‌ యుద్ద విమానాల సర్వీసు సెంటర్‌ ఫ్రాన్స్‌లో మాత్రమే ఉండేదని, ఇప్పుడు హైదరాబాద్‌కు వచ్చిందని సీఎం ప్రస్తావించారు. గత రెండేళ్లలో రక్షణ ఎగుమతులు రెండింతలు పెరిగాయని చెప్పారు. ఈ ఏడాది రూ.7,500 కోట్ల ఎగుమతులు జరిగాయని వెల్లడించారు.


జూన్‌ 2 లోగా ఎఫ్‌సీడీసీ కార్యాలయం ప్రారంభం

ఫ్యూచర్‌ సిటీ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ కార్యాలయాన్ని జూన్‌ 2లోగా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇక్కడి నుంచే సమీక్షలు నిర్వహించి పెట్టుబడులను ఆహ్వానిస్తామన్నారు. మూసీ తదితర ప్రాజెక్టుల భూసేకరణలో చిన్న చిన్న తప్పిదాలు జరిగాయని ముఖ్యమంత్రి అంగీకరించారు. ఉద్దేశపూర్వకంగా చేసే నిర్ణయాలు కాదన్నారు. పనులు వేగంగా చేసే ప్రయత్నంలో తప్పిదాలని చెప్పారు. వాటిని సరిదిద్దుకుంటామని తెలిపారు. హైటెక్‌ సిటీ, ఔటర్‌ రింగురోడ్డు, విమానాశ్రయం... ఇవన్నీ ఊహాచిత్రాలతోనే మొదలయ్యాయని, అవి చూపించిన నేతలను అవహేళన చేశారని రేవంత్‌ గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు అవన్నీ మనముందు సాక్షాత్కరించాయని చెప్పారు. మూడు కొవిడ్‌ వ్యాక్సిన్లు తెలంగాణలోనే ఉత్పత్తి అయ్యాయని గుర్తు చేశారు.

శంషాబాద్‌లో బుల్లెట్‌ రైళ్ల హబ్‌

శంషాబాద్‌లో బుల్లెట్‌ రైల్‌ హబ్‌ వస్తోందని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద బస్‌ టర్మినల్‌ నిర్మిస్తున్నామని తెలిపారు. ఎయిర్‌పోర్టుకు అనుసంధానంగా మెట్రోరైల్‌, బుల్లెట్‌ రైల్‌ హబ్‌, బస్‌ టర్మినల్‌ ఉంటాయని వెల్లడించారు. దేశంలో 8 హైస్పీడ్‌ రైళ్లు మంజూరు చేస్తే 3 మన రాష్ట్రానికే వచ్చాయని వివరించారు. ఇవన్నీ వస్తే ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయన్నారు.

Updated Date - Apr 29 , 2026 | 06:30 AM