ఏడాదిలోనే పనులు పూర్తవ్వాలి
ABN , Publish Date - Oct 10 , 2026 | 05:58 AM
‘‘ముంబై వంటి నగరాల్లో ఏడాదిలోపే పనులు పూర్తవుతున్నాయి. అక్కడ వినియోగిస్తున్న సాంకేతికత, పనుల తీరుపై అధ్యయనం చేయండి. ప్రారంభించిన పనులు ఏడాదిలోపు పూర్తయ్యేలా చూడండి’’ అని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఇతర ప్రాంతాల్లో వినియోగిస్తున్న సాంకేతికతను అధ్యయనం చేయండి
భవిష్యత్తు అవసరాలకు సరిపడేలా
ఎక్కువమంది ప్రయాణించే మార్గాల్లో ప్రజా రవాణాను మెరుగుపరచాలి
పీఆర్టీ.. కేబీఆర్ చుట్టూ సజావుగా ట్రాఫిక్
‘క్యూర్’లో పనుల సమీక్షలో సీఎం రేవంత్
హైదరాబాద్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ‘‘ముంబై వంటి నగరాల్లో ఏడాదిలోపే పనులు పూర్తవుతున్నాయి. అక్కడ వినియోగిస్తున్న సాంకేతికత, పనుల తీరుపై అధ్యయనం చేయండి. ప్రారంభించిన పనులు ఏడాదిలోపు పూర్తయ్యేలా చూడండి’’ అని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్ మార్గానికి సమాంతరంగా రేడియల్ రోడ్డు నిర్మాణంపై అధ్యయనం చేయాలని సూచించారు. క్యూర్ పరిధిలో ప్రజా రవాణా మెరుగు, వివిధ రహదారుల అనుసంధానం, రీ సైకిల్డ్ వాటర్ వినియోగంపై సీఎం రేవంత్ శుక్రవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లో విపరీతమైన రద్దీఉన్న ప్రాంతాల్లో పీఆర్టీ ఏర్పాటుకు అవసరమైన అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. ‘‘భవిష్యత్తు అవసరాలకు తగినట్లు క్యూర్ పరిధిలో ప్రజారవాణా సదుపాయాలు మెరుగుపర్చాలి. ఎక్కువ మంది ప్రయాణించే ప్రదేశాలతోపాటు వివిధ కర్మాగారాల్లో పని చేసే కార్మికులు, ఉద్యోగులు రాకపోకలు సాగించే ప్రదేశాలను మెట్రో, ఎంఎంటీఎస్, బస్ స్టేషన్లతో అనుసంధానించేలా పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (పీఆర్టీ) డిజైన్ చేయాలి. ప్రపంచంలోని అత్యుత్తమ పీఆర్టీలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలి. సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభమయ్యేలా చర్య లు తీసుకోవాలి’’ అని దిశానిర్దేశం చేశారు.
ఇందులో ము ఖ్యమైన కాలనీల ఎంపిక, అత్యాధునిక సాంకేతికత, నిర్వహణకు పెద్దపీట వేయాలన్నారు. క్యూర్ పరిధిలో వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానత పెరిగేలా, రహదారుల్లో సజావుగా రాకపోకలు సాగించేలా ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణం వేగవంతం చేయాలని నిర్దేశించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వేతో రాకపోకలు మరింత సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వేకు వివిధ కాలనీల నుంచి వచ్చే రహదారులు కలిసే చోటుతోపాటు ఫ్రీ లెఫ్ట్, యూ టర్న్‌ల విషయంలో తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీ చెక్‌పోస్టు వైపు ఫ్లై ఓవర్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. శంకర్‌పల్లి-చేవెళ్ల మధ్య ఇప్పుడున్న రహదారుల విస్తరణతోపాటు నూతన రోడ్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. రీ సైకిల్డ్ వాటర్ వినియోగానికి సంబంధించిన పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. భారత్ ఫ్యూచర్ సిటీ, చందన్‌వల్లి, ఆలూరులోని డేటా సెంటర్లు, ఇతర పరిశ్రమలు రీసైకిల్డ్ వాటర్ వినియోగించుకునేలా పనులు చేపట్టాలని ఆదేశించారు. హైరై జ్ బిల్డింగుల నిర్మాణం, ల్యాండ్ స్కేప్స్, పార్కుల్లో రీసైకిల్డ్ వాటర్ వాడేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్యూర్ చట్టం అమలుకు సమన్వయంతో పని చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. సమీక్షలో సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్, హెచ్‌ఎంఆర్‌ఎల్ సలహాదారు ఎన్‌వీఎస్ రెడ్డి, అదనపు ఎండీ అజిత్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల కమిషనర్లు ఆర్.వి.కర్ణన్, సృజన, వినయ్ కృష్ణారెడ్డి, వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి పాల్గొన్నారు.