Share News

కేసీఆర్‌ దొంగ పాస్‌పోర్టుల చరిత్ర.. చెరిపేస్తే చెరిగేదా?

ABN , Publish Date - Feb 08 , 2026 | 05:41 AM

‘‘కేసీఆర్‌ చరిత్రను రూపుమాపేందుకు నేను ప్రయత్నిస్తున్నానంటూ హరీశ్‌రావు, కేటీఆర్‌ నన్ను విమర్శిస్తున్నారు. కానీ, కేసీఆర్‌ దొంగ పాస్‌పోర్టుల చరిత్ర నేను చెరిపేస్తే చెరిగేదా?

కేసీఆర్‌ దొంగ పాస్‌పోర్టుల చరిత్ర.. చెరిపేస్తే చెరిగేదా?

  • దళితుడిని సీఎం చేస్తాననే దొంగ హామీల చరిత్ర.. చెరిగిపోకుండా చూసే బాధ్యత నాది

  • ట్యాపింగ్‌ కేసులో నోటీసులిస్తే రాద్ధాంతం.. చిల్లర పనులు చేస్తే నోటీసులివ్వక ఏం చేస్తారు?

  • బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య చీకటి ఒప్పందాలు.. అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నారు

  • బీజేపోళ్లు మోదీ పేరుతో ఓట్లడుగుతున్నారు.. గల్లీలో పనిచేయకపోతే ఢిల్లీకి వెళ్లి అడగాలా?

  • కేసీఆర్‌ నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలి.. చేవెళ్ల-ప్రాణహిత ఎత్తిపోతలను ఆపింది ఎవరు?

  • త్వరలో మక్తల్‌, నారాయణపేట, కొడంగల్‌ నియోజకవర్గాలకు కృష్ణా జలాలు అందిస్తాం

  • వికారాబాద్‌, తాండూరు, పరిగికి గోదావరి నీళ్లు.. పరిగిలో ప్రజాపాలన సభలో సీఎం

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా

ప్రతినిధి/ వికారాబాద్‌)

‘‘కేసీఆర్‌ చరిత్రను రూపుమాపేందుకు నేను ప్రయత్నిస్తున్నానంటూ హరీశ్‌రావు, కేటీఆర్‌ నన్ను విమర్శిస్తున్నారు. కానీ, కేసీఆర్‌ దొంగ పాస్‌పోర్టుల చరిత్ర నేను చెరిపేస్తే చెరిగేదా? అంతేకాదు.. కేసీఆర్‌పై దొంగనోట్ల కేసు నమోదయిందని వారి పక్కనున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు. మీ దొంగనోట్ల చరిత్ర నేను చెరిపేస్తే చెరిగేదా? దళితుడిని సీఎం చేస్తానన్న దొంగ హామీల చరిత్ర నేను చెరిపేస్తే పోతుందా? మీ చరిత్రను ఎవరూ చెరిపేయలేరు. ఆ చరిత్ర చెరిగిపోకుండా చూసే బాధ్యత నాది. అవసరమైతే పరిగిలో గోడల మీద రాయిస్తా’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిగిలో జరిగిన ప్రజాపాలన- ప్రగతిబాట సభలో సీఎం ప్రసంగించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని, ఆ వర్గం వారికి మూడెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చి.. కేసీఆర్‌ మోసం చేశారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే దళితులకు స్పీకర్‌ పదవితోపాటు నాలుగు మంత్రి పదవులు ఇచ్చిందని గుర్తు చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌కు నోటీసులిస్తే.. తెలంగాణ జాతిపితకు నోటీసులిస్తున్నారంటూ పెద్ద రాద్ధాంతం చేశారని సీఎం తప్పుబట్టారు. చిల్లర పనులు చేస్తే నోటీసులివ్వక ఏం చేస్తారని ప్రశ్నించారు.


బీఆర్‌ఎస్‌, బీజేపీ చీకటి ఒప్పందాలు..

తమ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌, బీజేపీ కుట్రపన్ని చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నాయని సీఎం రేవంత్‌ ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలు తమ బీ ఫారాలను బీఆర్‌ఎస్‌ ఆఫీసులో తెచ్చుకుంటున్నారని అన్నారు. పదేళ్లపాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌, పన్నెండేళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏనాడూ స్థానిక సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. ‘‘బీజేపీ నాయకులు మోదీ ఫొటో చూపిస్తూ ఓట్లు అడుగుతున్నారు. ఎవరైనా పెళ్లి పెద్దను చూసి పిల్లనిస్తారా? ప్రధాని మోదీని చూసి ఓటేస్తే.. గల్లీలో ఉండే బోడిగాడు పనిచేయకపోతే ఢిల్లీకి వెళ్లి అడగాలా?’’ అని రేవంత్‌ ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన మక్తల్‌- నారాయణపేట - కొడంగల్‌ ఎత్తిపోతల పథకాల పనులు ముందుకు సాగకుండా గత ఫ్రభుత్వ హయాంలో కేసీఆర్‌, హరీశ్‌రావు కుట్రలు చేసి తొక్కిపెట్టారని సీఎం రేవంత్‌ ధ్వజమెత్తారు. ఇప్పుడు భూసేకరణ, పర్యారవణ అనుమతులు వచ్చాయని, ఈ ప్రాజెక్టులను త్వరలో పూర్తిచేసి ఆ మూడు నియోజకవర్గాల్లోని 1.5 లక్షల ఎకరాలకు కృష్ణా జలాలను తరలిస్తామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 14 లక్షల ఎకరాలకు గోదావరి జలాలను తరలించేందుకు రూ.38 వేల కోట్లతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని తెలిపారు. తాండూరు, వికారాబాద్‌, చేవెళ్ల నియోజకవర్గాలకు గోదావరి జలాలను తరలించి అభివృద్ధి చేయాలని భావించారని పేర్కొన్నారు. ఆ తరువాత ఈ ప్రాంతాల్లో రూ.వందల కోట్ల పనులు జరిగాయని, అండర్‌ గ్రౌండ్‌ టన్నెళ్లు నిర్మించారని చెప్పారు. కానీ, కేసీఆర్‌ సీఎం అయ్యాక ఈ పనులన్నీ ఆగిపోయాయన్నారు. వీటి స్థానంలో మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ, రంగనాయక సాగర్‌ను మెదక్‌ జిల్లాలో నిర్మించి రంగారెడ్డి ప్రాంతాన్ని పడావు పెట్టారని ఆరోపించారు.


రంగారెడ్డి జిల్లాకు కేసీఆర్‌ ద్రోహం..

‘‘ప్రతి ఏటా 3వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని, వాటిని శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తరలించవచ్చని ఈ మొనగాడు కేసీఆర్‌.. చంద్రబాబుకు సలహా ఇచ్చాడు. ఇందులో 300 టీఎంసీలను రంగారెడ్డి జిల్లాకు తరలిస్తే 30 లక్షల ఎకరాలు సాగయ్యేవనే విషయం ఈ మొనగాడికి తెలియదా? ఈ ప్రాంతానికి తాగునీరు-సాగునీరు అందేది కాదా? సీమాంధ్ర పాలకులు ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన ఈ ప్రాజెక్టులను ఉద్యమకారునిగా చెప్పుకొనే మీరు ఎందుకు అడ్డుకున్నారు?’’ అని రేవంత్‌ ప్రశ్నించారు. దీనిపై మాజీ మంత్రి సబితారెడ్డి కూడా సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రె్‌సలో అన్ని పదవులు అనుభవించి, కాంగ్రెస్‌ గుర్తుపై గెలిచి, బీఆర్‌ఎ్‌సలో చేరి.. రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసమే పార్టీ మారినట్లు ఆనాడు చెప్పిన సబితా ఇంద్రారెడ్డి చేవెళ్ల- ప్రాణహిత ప్రాజెక్టు కోసం ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో అప్పా జంక్షన్‌ నుంచి మన్నెగూడ రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయకపోవడంతో ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోయారని తెలిపారు. కేసీఆర్‌ నిరక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలైందన్నారు. గోదావరి జలాల ముసుగులో రూ.వేల కోట్లు కొల్లగొట్టారని, కాళేశ్వరంతో కుటుంబం మొత్తం ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారని ధ్వజమెత్తారు.


ఎనిమిదేళ్లు మాదే అధికారం..

రాబోయే ఎన్నికల్లోనూ తామే గెలుస్తామని, వచ్చే ఎనిమిదేళ్లు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యమే ఉంటుందని సీఎం రేవంత్‌ అన్నారు. రీజినల్‌ రింగురోడ్డు నిర్మిస్తామని, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా పరిగి, తాండూరు, వికారాబాద్‌ నియోజకవర్గాలకు గోదావరి జలాలు తరలిస్తామని ప్రకటించారు. లక్ష్మీదేవిపల్లిలో రిజర్వాయర్‌కు భూసేకరణ త్వరలోనే పూర్తిచేస్తామని చెప్పారు. వికారాబాద్‌ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇందిరమ్మ ఇళ్లను నియోజకవర్గానికి 5వేలకు పెంచుతామన్నారు. మునిసిపల్‌ ఎన్నికలు పూర్తయ్యాక రైతు భరోసా వేస్తామని చెప్పారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో రివర్‌ ఫ్రంట్‌లు ఏర్పాటు చేస్తున్నామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని, హైదరాబాద్‌ మహానగర ప్రజలకు అవి అవసరం లేదా? అని ప్రశ్నించారు. అభివృద్ధి కొనసాగాలంటే మునిసిపల్‌ ఎన్నికల్లో కాంగ్రె్‌సకే ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని 6,650 మహిళా గ్రూపులకు రూ.567 కోట్ల బ్యాంకు లింకేజ్‌, స్త్రీనిధి ద్వారా రుణాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, యాదయ్య, మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.

నేడు భూపాలపల్లి జిల్లాకు సీఎం

భూపాలపల్లి/హైదరాబాద్‌, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం జయశంకర్‌ భూపాలపల్లిలో పర్యటించనున్నారు. మునిసిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన పర్యటనలో ఇదే ఆఖరుది. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి మధ్యాహ్నం 12:30కు రేగొండ మండలంలోని కొడవటంచకు చేరుకుంటారు. అక్కడి శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. అక్కడనుంచి గణపురం మండలం చెల్పూరులో ఏర్పాటు చేసిన సభాస్థలికి చేరుకుంటారు.

Updated Date - Feb 08 , 2026 | 06:44 AM