Share News

నీ పో మోనే విజయన్‌...

ABN , Publish Date - May 05 , 2026 | 04:12 AM

నీ పో మోనే విజయన్‌.. యువర్‌ టైమ్‌ ఈజ్‌ ఓవర్‌’ (విజయన్‌.. నీ టైమ్‌ అయిపోయింది.. వెళ్లిపో)- కేరళం ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పిన ఓ ...

నీ పో మోనే విజయన్‌...

  • కేరళం ప్రచారంలో రేవంత్‌ డైలాగ్‌.. గెలుపులో కీలక పాత్ర అంటున్న కాంగ్రెస్‌ వర్గాలు

హైదరాబాద్‌, మే 4(ఆంధ్రజ్యోతి): ‘నీ పో మోనే విజయన్‌.. యువర్‌ టైమ్‌ ఈజ్‌ ఓవర్‌’ (విజయన్‌.. నీ టైమ్‌ అయిపోయింది.. వెళ్లిపో)- కేరళం ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పిన ఓ మలయాళ సినిమా డైలాగ్‌ ఇది. ఈ ఒక్క డైలాగ్‌.. దానికి ఆ రాష్ట్ర సీఎం విజయన్‌ స్పందన.. రేవంత్‌ ప్రతిస్పందన.. కేరళ ప్రజలనే కాకుండా దేశం దృష్టినీ ఆకర్షించింది. రేవంత్‌ వాడిన ఆ డైలాగ్‌ ప్రకారమే అక్కడి ప్రజలు ఎల్డీఎఫ్‌ కూటమిని ఓడించి.. విజయన్‌ను గద్దె దించేశారు. కేరళం ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ ఘన విజయంలో రేవంత్‌ కీలకపాత్రే పోషించారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్టార్‌ క్యాంపెయినర్‌గా కేరళంలో పలు రోడ్‌ షోలు, కార్నర్‌ మీటింగ్‌లలో ఆయన పాల్గొన్నారు. కేరళం కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోనూ ఆయనే విడుదల చేశారు. తెలంగాణలో అమలుచేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అక్కడి మ్యానిఫెస్టోలో చేర్చారు. దాంతో మహిళలు పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘కమ్యూనిస్టు విజయన్‌, కమ్యూనలిస్టు మోదీ మధ్య తేడా లేద’ని కేరళం ప్రజలకు రేవంత్‌ వివరించిన తీరు.. మోదీ, విజయన్‌ మధ్య రహస్య స్నేహాన్ని బట్టబయలు చేయడంలో రేవంత్‌ సక్సెస్‌ అయ్యారని, విజయన్‌, మోదీలను బ్రదర్స్‌గా రేవంత్‌ అభివర్ణించడం కూడా కేర ళం ప్రజలు హర్షించార’ని పేర్కొంటున్నాయి. కేరళం మాజీ సీఎంలు ఆంటోనీ, ఊమెన్‌ చాందీ, కరుణాకరన్‌ల గొప్పతనాన్ని, వారి పాలనలో సాధించిన విజయాలను గుర్తు చేశారంటున్నాయి. ఎల్డీఎఫ్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనంటూ కేరళ ప్రజలకు రేవంత్‌ వివరించగలిగారని, దాన్ని విశ్వసించిన ప్రజలు యూడీఎఫ్వైపు మొగ్గారని కాంగ్రెస్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కేరళంలో జాతీయ రహదారులు సహా పలు అభివృద్ధి పనులు నిలిచిపోయినా పినరాయి విజయన్‌ పట్టించుకోకపోవడం.. ఆయన హయాంలో చోటుచేసుకున్న బంగారం స్మగ్లింగ్‌, ఇతర కేసుల్లో ఈడీ, మోదీ పట్టించుకోకపోవడాన్ని రేవంత్‌ లేవనెత్తడం ద్వారా కేరళంలో ఎల్డీఎఫ్‌, ఎన్డీఏల మధ్య పొత్తును బయటపెట్టారని అంటున్నాయి. కాంగ్రెస్‌ గెలిస్తే విద్యావంతులైన కేర ళం యువతకు స్థానికంగానే ఉపాధి కల్పిస్తామని.. వారు విదేశాలకు వెళ్లకుండా చూసే బాధ్యత యూడీఎఫ్‌ తీసుకుంటుందనే రేవంత్‌ మాటలను విశ్వసించబట్టే కాంగ్రెస్‌కు ఇంత భారీ మెజారిటీ దక్కిందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


విజయన్‌ ప్రభుత్వ వైఫల్యాలపై ఎన్నికలకు ముందు రేవంత్‌ రాసిన లేఖలు కేరళంలో చర్చనీయాంశమయ్యాయి. అవి యూడీఎఫ్‌ విజయానికి ఎంతో దోహదపడ్డాయని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అక్కడి ప్రజలకు రేవంత్‌ రెడ్డి వివరించడంతో వారికి పార్టీపై మరింత విశ్వాసం కలిగిందంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సీఎం రేవంత్‌ రెడ్డి ప్రచారం ఇవన్నీ కాంగ్రెస్‌ గెలుపులో కీలకపాత్ర పోషించాయని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. రేవంత్‌ ఒక్క డైలాగ్‌తో కేరళం ఎన్నికల దిశనే మార్చేశారని ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్‌, విజయరమణారావు, బల్మూర్‌ వెంక ట్‌, అద్దంకి దయాకర్‌ వేర్వేరు ప్రకటనల్లో కొనియాడారు. ఏఐసీ సీ అగ్రనేతలు సోనియా, రాహు ల్‌, ప్రియాంక గాంధీల తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగిన నే తగా రేవంత్‌ ఎదిగారని, ఆయన నాయకత్వాన్ని దక్షిణాది రాష్ట్రాలు బలపరుస్తున్నాయని వారు పేర్కొ న్నారు. గుజరాత్‌, యూపీ, పంజాబ్‌ ఎన్నికల్లోనూ రేవంత్‌ పాత్ర కీలకంగా మారబోతోందని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నా రు. దేశంలో కాంగ్రెస్‌ ను బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

తెలంగాణలో మళ్లీ గెలుస్తాం: మహేశ్‌

కేరళంలో విజయం.. తెలంగాణలో కాంగ్రెస్‌ మరోమారు విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని కలిగించిందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు.. పలువురు పార్టీ తెలంగాణ నాయకులు కేరళం ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇక్కడ పాలన చూసి ఓట్లేయాలని కోరిన సంగతి గుర్తు చేశారు. టీవీకే అధినేత విజయ్‌కు అభినందనలు తెలిపారు.

కేరళంలో అసాధారణ విజయం

  • కాంగ్రెస్‌ శ్రేణులకు రేవంత్‌ అభినందన

కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు అసాధారణ, ప్రేరణాత్మక విజయాన్ని సాధించిపెట్టిన పార్టీ కేరళ నాయకులు, కార్యకర్తలకు సీఎం రేవంత్‌ రెడ్డి ‘ఎక్స్‌’ వేదికగా అభినందనలు తెలిపారు. ఈ చరిత్రాత్మక విజయానికి రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌, దీపాదాస్‌ మున్షీ నాయకత్వం వహించారన్నారు. కేరళం ఎన్నికల ప్రచార సమయంలో తనపై అపారమైన ప్రేమను కురిపించిన యూడీఎఫ్‌ మద్దతుదారులు, కేరళ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కేరళం, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు ప్రగతి, అభివృద్ధిని కోరుకునే వారని, ప్రజాస్వామ్య విలువలపై అపారమైన నమ్మకం కలిగినవారని పేర్కొన్నారు. దశాబ్దం పాటు నిరాశ, మోసానికి గురైన రెండు రాష్ట్రాల ప్రజలకు కాంగ్రెస్‌ ప్రభుత్వాల పాలనలో గొప్ప భవిష్యత్తు ఉంటుందన్నారు.

Updated Date - May 05 , 2026 | 04:12 AM