మోదీ అసమర్థ పాలనతో ఆర్థిక వ్యవస్థ కుదేలు
ABN , Publish Date - May 17 , 2026 | 06:00 AM
మోదీ ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని సీఎం రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు.
రూపాయి పతనం పరాకాష్ఠకు చేరింది..
ఎన్నికల ఫలితాలొచ్చాక 10 రోజుల్లోనే ఇంధన ధరలు పెంచడం వంచించడమే..
ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
కేంద్రాన్ని డిమాండ్ చేసిన సీఎం రేవంత్
హైదరాబాద్/న్యూఢిల్లీ/కేసముద్రం, మే 16 (ఆంధ్రజ్యోతి): మోదీ ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని సీఎం రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంచుతూ మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయం ఏ మాత్రం సమర్థనీయం కాదన్నారు. దీనివల్ల అనేక రంగాలపై వ్యతిరేక ప్రభావం పడుతుందని.. నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుపాటులా పరిణమిస్తుందని ‘ఎక్స్’ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మనిర్భర్.. కేవలం ఓట్లు రాల్చే నినాదమే తప్ప ఫలితాలు తెచ్చిన పాలసీ కాదు అన్నది తేలిపోయిందని ఎద్దేవా చేశారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయని, యువత ఉపాధికి గ్యారెంటీ లేని పరిస్థితి దాపురించిందని.. రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామన్న హామీ వట్టి మాటగా మిగిలిందన్నారు. ‘గత పదేళ్లుగా రూపాయి విలువ పతనమవుతూ వస్తోంది. ఇప్పుడు ఆ పతనం పరాకాష్ఠకు చేరింది. ఈ పరిస్థితుల్లో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధాన్ని సాకుగా చూపి పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడం సామాన్యుల నడ్డి విరచడమే. ప్రపంచంలో భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపామని ఘనంగా ప్రకటించుకున్న మోదీ సర్కారు.. ఈ నిర్ణయాన్ని ఎలా సమర్థించుకుంటుంది. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచబోమని పదే పదే ప్రకటించింది. ఆ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చి పది రోజులు కూడా గడవకముందే లీటరుకు రూ.3కి పైగా ధరలు పెంచడం ప్రజల నమ్మకాన్ని వంచించడమే. కేవలం ఓట్ల కోసం, ఎన్నికల్లో విజయం కోసం మోదీ అబద్ధాలు చెబుతారని ప్రజలు భావిస్తున్నారు. ఇది విశ్వాస ఘాతుకమే అవుతుంది’ అని ధ్వజమెత్తారు. పెంచిన ఇంధన ధరలను తక్షణమే కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
సీజే కుమారుడి వివాహ విందుకు హాజరైన గవర్నర్, సీఎం
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ కుమారుడి వివాహ విందు శనివారం రాత్రి ఢిల్లీలో ఘనంగా జరిగింది. హోటల్ అశోకలో జరిగిన ఈ వేడుకకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరై నూతన వధూవరులు రేవంత-అనుష్కలను ఆశీర్వదించారు. కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

ఇందిరమ్మ ఇల్లంటే జీవితకాలపు కల!
‘ఇందిరమ్మ ఇల్లు అంటే.. ఇటుకలతో కట్టిన నాలుగు గోడలు కాదు, ఒక జీవితకాలపు కల, ఒక కుటుంబ ఆత్మగౌరవం’ అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లిలో ఇందిరమ్మ పథకంలో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులు భట్టు స్వప్న-మధు దంపతులు తమ కల నెరవేరిందనే సంతోషంలో సీఎం రేవంత్ ఫొటోతో శుక్రవారం గృహప్రవేశం చేయగా.. ‘ఆంధ్రజ్యోతి’ మెయిన్‌లో శనివారం ఈ వార్తను ప్రచురించిన సంగతి తెలిసిందే.. దీనిపై స్పందించిన సీఎం.. ‘ఆంధ్రజ్యోతి’ క్లిప్పింగ్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ గృహప్రవేశ సందర్భంలో.. వారి ముఖాల్లో ఆనందం.. నేను కోరుకున్న మార్పు. ఇందిరమ్మ ఇంట గృహ ప్రవేశం చేసిన లబ్ధిదారులకు నా శుభాకాంక్షలు’ అని ఆయన పేర్కొన్నారు.