CM Revanth Reddy Assures Transparency: నిజమైన అనుభవం ఉన్నోళ్లకే సింగరేణి టెండర్!
ABN , Publish Date - Jan 19 , 2026 | 05:03 AM
సింగరేణిలో జరుగుతున్న బొగ్గు గనుల టెండర్ విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ఉందని, నిజమైన అనుభవజ్ఞులకే ఇస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.
మా ప్రభుత్వంలో అవినీతికి తావు లేదు.. మంత్రులపై వార్తలు రాసేముందు నా వివరణ తీసుకోండి: సీఎం రేవంత్
కొత్తగూడెం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో జరుగుతున్న బొగ్గు గనుల టెండర్ విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ఉందని, నిజమైన అనుభవజ్ఞులకే ఇస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. తమ ప్రభుత్వం అణాపైసా అవినీతికి కూడా అవకాశం ఇవ్వదని స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రులపై వార్తలు రాసేముందు తన వివరణ తీసుకోవాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ రోజు టెండర్ల గురించి కొన్ని పత్రికలు రాస్తున్నాయి. సింగరేణిలో కుంభకోణం జరిగిందని, బొగ్గంతా మాయమైందని పేర్కొంటున్నాయి. నేను ఆ పత్రికలకు, టీవీలకు, సోషల్ మీడియా వాళ్లకు, ఆ రాజకీయ పార్టీ నాయకులకు చెప్పదలుచుకున్నా.. ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావులేదు. తప్పుడు ప్రచారం చేయడం ద్వారా అపోహలు కల్పించి మళ్లీ శుక్రాచార్యుడు, మారీచుడు, సుబాహుడు బలపడడానికి మీరు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరిస్తున్నారు. మీకు, మీకు మీడియా పంచాయితీలుంటే తలుపులు మూసుకొని కొట్టుకోండి. ఒకరిమీద ఒకరు బురద చల్లుకోండి. అంతేకానీ, అందులోకి మమ్మల్ని లాగొద్దు. ఆంబోతులు కొట్లాడితే లేగదూడల కాళ్లు విరిగాయట. ఇద్దరు మీడియా యజమానులు కొట్లాడుకోండి కానీ, మా మంత్రులను బద్నాం చేసే కార్యక్రమం తీసుకోకండి. ఒకసారి ఆలోచన చేసి, వాస్తవాలను తెలుసుకోండి. ముఖ్యమంత్రిగా 365 రోజులూ ప్రజలకు అందుబాటులో ఉన్నా. మీడియాకు కావాల్సిన వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఏదైనా వార్త ఏ టీవీలో, పేపర్‌లో, సోషల్ మీడియాలో వచ్చినా.. నా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, ఎవరి మీద ఆరోపణలు వచ్చినా.. వాళ్లందరికీ నాయకుడిగా, కుటుంబ పెద్దగా అది నా గౌరవానికి భంగం కలిగిస్తుంది. నా నాయకత్వం పట్ల అపోహలు కలిగిస్తుంది. మా మంత్రుల మీద ఏదైనా రాసేముందు నా వివరణ అడగండి. అందరినీ సమన్వయం చేసుకుని ప్రభుత్వాన్ని నడుపుతున్నా. తుమ్మల లాంటివాళ్ల అనుభవాన్ని తీసుకుని ఈ రోజు ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. 24 గంటలు పనిచేయాలంటే, సమ్మక్మ, సారలమ్మ గుడిని 100 రోజుల్లో పూర్తి చేయాలంటే ఆ బాధ్యతను పొంగులేటికి ఇచ్చా. ఢిల్లీలో ఏ అవసరమున్నా, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర శాఖల అనుమతుల కోసం భట్టి విక్రమార్కను ప్రతి మంత్రి దగ్గరకు పంపించి రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నా. ఇది ఉమ్మడిగా మా ప్రభుత్వం పనిచేస్తున్న విధానం. గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఏకపాత్రాభినయం చేసేవాళ్లు. ఇప్పుడు మాత్రం అందరం సమన్వయం చేసుకుని, ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తిస్తూ ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. రెండేళ్లలో ఎలాంటి అవకతవకలు, తప్పులకు అవకాశం ఇవ్వలేదు. దయచేసి నా సహచర మంత్రుల మీద వార్తలు రాసేముందు నా వివరణ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని సీఎం రేవంత్ అన్నారు.