మావోయిస్టు గణపతి లొంగిపోవాలి: ముఖ్యమంత్రి రేవంత్
ABN , Publish Date - Apr 29 , 2026 | 05:56 AM
కాంగ్రెస్ ప్రభుత్వ పిలుపుతో 814 మంది నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఒకరిద్దరు పెద్దలు మిగిలిపోయారని, వయసు మీద పడిందని ప్రస్తావించారు.
రక్షణ బాధ్యత తీసుకుంటామని హామీ.. మాజీ నక్సల్స్‌కు గిరి దర్శక్‌లుగా ఉపాధి
కాంగ్రెస్ ప్రభుత్వ పిలుపుతో 814 మంది నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఒకరిద్దరు పెద్దలు మిగిలిపోయారని, వయసు మీద పడిందని ప్రస్తావించారు. గణపతి ఆరోగ్యం బాగాలేదనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని చెప్పారు. అవసరమైన వైద్యం, ప్రాణానికి రక్షణ అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అన్నారు. ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలను ప్రస్తావించాలని సూచించారు. వచ్చిన వారికి ఆర్థికంగా సహకరించడంతో పాటు ఇతర సౌకర్యాలను కల్పిస్తామని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో గిరిదర్శక్‌ల పేరుతో పర్యాటక గైడ్‌లను నియమిస్తున్నట్లు సీఎం తెలిపారు. 20 మంది గిరిజన యువతకు నియామక పత్రాలను అందజేశారు. వీరికి స్కిల్ యూనివర్శిటీలో ఆరు నెలల పాటు శిక్షణ ఇస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు జీవనోపాధి కల్పించేందుకు అనేక కార్యక్రమాలు ప్రకటించడంతో 2024 నుంచి ఇప్పటివరకు 814 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. 24 మంది కీలక నేతలు లొంగిపోగా అందులో 19 మంది తెలంగాణ వారేనని చెప్పారు. ఎస్‌ఐబీ ఐజీ సుమతి మాట్లాడుతూ, రాష్ట్రంలో మావోయిస్టు వ్యవస్థ పూర్తిగా అంతమైనట్లు తెలిపారు. లొంగిపోయిన వారిలో యువతకు గిరిదర్శక్ పేరుతో ఉద్యోగ ఉపాధిని కల్పించనున్నట్లు తెలిపారు. తనకు ఆహ్వానం లేకపోవడంపై మాజీ హోంమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. ప్రైవేటు కార్యక్రమంలా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యేని కాదని అక్కడ మాజీ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన వారిని వేదికపై కూర్చోపెట్టారని వ్యాఖ్యానించారు.