ఆదివాసీ, గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం
ABN , Publish Date - Apr 14 , 2026 | 05:08 AM
రాష్ట్రంలోని ఆదివాసీ, గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సాగు...
రోడ్ల నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు వచ్చేలా చర్యలు
అంబేద్కర్ ఆశయ సాధనలో ముందుకెళతాం: సీఎం రేవంత్
హైదరాబాద్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఆదివాసీ, గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సాగు, తాగునీటి అవసరాల కోసం చెక్ డ్యామ్‌ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. రహదారుల నిర్మాణం, మరమ్మతులకు అటవీశాఖ అనుమతులు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం మంత్రి సీతక్క నేతృత్వంలో గిరిజన, ఆదివాసీ ఎమ్మెల్యేల బృందం సీఎం రేవంత్‌ను ఆయన నివాసంలో కలిసి ఏజెన్సీ ప్రాంతాల్లోని సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. గిరిజన రైతులు సాగు భూముల్లో బోర్లు వేసుకోవడానికి అనుమతులపై సానుకూలంగా స్పందించారు. ఐటీడీఏలను మరింత బలోపేతం చేస్తామని, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోటా పెంచే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, పాయం వెంకటేశ్వర్లు, డాక్టర్ మురళి నాయక్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా మంగళవారం (ఏప్రిల్ 14) రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. బాబాసాహెబ్ ఆలోచనల స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలుతో పాటు, గురుకులాల్లో మెస్, కాస్మొటిక్ చార్జీలను పెంచామని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 27వ వర్థంతి సందర్భంగా రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. సర్పంచ్ స్థాయి నుంచి స్పీకర్ వరకు అన్ని పదవులకు ఆయన వన్నె తెచ్చారని కొనియాడారు.