రేవంత్, కేసీఆర్ రాహు, కేతువులు
ABN , Publish Date - Apr 22 , 2026 | 04:52 AM
ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ రెడ్డి, కేసీఆర్‌లు ఒకరినొకరు చావాలని తిట్టుకుంటున్నారని, కానీ రేవంత్ రాహు అయితే, కేసీఆర్ కేతువు అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ....
వారిద్దరూ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని
కేసీఆర్ అవినీతిని కప్పిపుచ్చేందుకు రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు
9 వేల కోట్ల అవినీతిపై విచారణకే లేఖ.. దమ్ముంటే లక్ష కోట్లపై కోరాలి
బీఆర్‌ఎస్‌తో మాకు పొత్తు ఉండబోదు: కేంద్ర మంత్రి బండి సంజయ్
మావోయిస్టు ఉద్యమానికి పట్టిన గతే బీఆర్‌ఎస్‌కూ: రఘునందన్
బీఆర్‌ఎస్ చావును కేసీఆర్ చూడాలి: అర్వింద్
కేసీఆర్, రేవంత్ మాటల్లో భయం కనిపిస్తోంది: రాంచందర్‌రావు
కరీంనగర్/హైదరాబాద్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ రెడ్డి, కేసీఆర్‌లు ఒకరినొకరు చావాలని తిట్టుకుంటున్నారని, కానీ రేవంత్ రాహు అయితే, కేసీఆర్ కేతువు అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ధ్వజమెత్తారు. నిజానికి వీరిద్దరూ తెలంగాణకు పట్టిన శని అని, తెలంగాణ ప్రజలను చంపుకు తింటుతున్నారని విమర్శించారు. కరీంనగర్‌లోని రేకుర్తి చెరువు ఆధునికీకరణ పనులకు బండి సంజయ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ కాళేశ్వరంలో చేసిన అవినీతిని కప్పిపుచ్చేందుకు రేవంత్‌రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని గత ఎన్నికల్లో చెప్పిన రేవంత్.. సీఎం అయ్యాక 9 వేల కోట్లకే పరిమితమై మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణాలపైనే విచారణ జరపాలని సీబీఐకి లేఖ రాయడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. రేవంత్‌కు దమ్ముంటే లక్ష కోట్ల అవినీతిపై విచారణ కోరుతూ సీబీఐకి లేఖ రాయాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని జనం విశ్వసించడం లేదని, అందుకే ఆ స్థానాన్ని ఆక్రమించేందుకు రేవంత్‌రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. జీవన్‌రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలను పాటిస్తోందని అన్నారు. జీవన్‌రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం ఇష్టం లేక బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు డిల్లీకి పోయారని, బీజేపీతో బీఆర్‌ఎస్ పొత్తు కోసం పోయారని.. ఈ రెండు మాటలూ వారే అంటున్నారని విమర్శించారు. బీఆర్‌ఎ్‌సతో బీజేపీకి ఎలాంటి పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ తో పొత్తు పెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ దేనని విమర్శించారు. మావోయిస్టు ఉద్యమానికి పట్టిన గతే బీఆర్‌ఎ్‌సకు పడుతుందని బీజేపీ ఎంపీ ఎం. రఘునందన్‌రావు వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొండపల్లి సీతారామయ్య 4 దశాబ్దాల కిందట నిర్వహించిన ‘జగిత్యాల జైత్రయాత్ర’ 2026 మార్చిలో ఎలాగైతే ముగిసిపోయిందో, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన ‘జగిత్యాల జైత్రయాత్ర’కు కూడా అదే గతి పడుతుందని అన్నారు. బీఆర్‌ఎస్ కాంగ్రెస్‌ల మధ్య ఆర్థిక బంధం ఉందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కంపెనీకే మూసీ ప్రాజెక్టును కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు, నిర్మాణం, వ్యయంపై సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెబుతున్న కేసీఆర్ కూతురు కవితను అప్రూవర్‌గా మార్చి, ఆమె వద్ద ఉన్న ఆధారాలను సేకరించాలని సీఎంకు విజ్ణప్తి చేశారు.
బీఆర్‌ఎస్ చావును కేసీఆర్ చూడాలి : అర్వింద్
బీఆర్‌ఎస్ చావును కేసీఆర్ చూడాలన్నదే తమ కోరిక అని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.‘ కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ బతకాలి. బీఆర్‌ఎస్ చావును ఆయన చూడాలి. బిడ్డ జైలుకు వెళ్లడం చూసిన కేసీఆర్.. ఆయన కుమారుడు కూడా జైలుకు వెళ్లేది చూడాలి. అదే మా కోరిక’ అని అన్నారు. ‘ప్రపంచ రాజకీయాల్లో ట్రంప్, రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ వల్లే ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటోంది’ అని ఎద్దేవా చేశారు. దరిద్రం పోయేదాకా కొట్లాడతానంటూ కేసీఆర్ చేసిన ప్రకటనపై స్పందిస్తూ.. ఆయన కుటుంబంలోని కేటీఆర్, కవిత, హరీష్, సంతోష్ రావుకు టిక్కెట్లు ఇచ్చి విదేశాలకు పంపించి వేస్తే తెలంగాణ దరిద్రం పోతుందన్నారు. ఓటీటీలో ఏడాది, రెండేళ్లకోసారి కొత్త సినిమాలు వచ్చినట్లుగానే కేసీఆర్ ఫాంహౌజ్ నుంచి బయటకు వస్తున్నారని, తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ శకం ముగిసిపోయినట్లే అని విమర్శించారు.
మోటార్లకు మీటర్లపై కేసీఆర్‌వి అబద్ధాలు: రాంచందర్‌రావు
కరెంటు మోటార్లకు మీటర్ల ఏర్పాటుపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు మండిపడ్డారు. బీజేపీ లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు బహిరంగసభలు నిర్వహించాయని, కేసీఆర్, రేవంత్ రెడ్డి మాటలను చూస్తుంటే.. వారిలో ఉన్న భయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం రూ.12లక్షల కోట్లు తెలంగాణకు ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో లక్షన్నర కోట్లు ఇచ్చింది. దీనిపై చర్చకు సిద్ధమా?’ అని ఆయన కేసీఆర్, సీఎం రేవంత్‌లకు సవాల్ చేశారు. బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక ఆ రెండు పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని, ఒకరినొకరు విమర్శించుకుంటున్నట్లు నటిస్తూనే లోపల మాత్రం అవినీతి నుంచి ఒకరినొకరు కాపాడుకుంటున్నాయన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై కాంగ్రెస్ తీరును నిరసిస్తూ ‘జన్ ఆక్రోష్’ పేరుతో ఈనెల 23న జీహెచ్‌ఎంసీ కార్యాలయం నుంచి దోమల్‌గూడ, ఇందిరా పార్క్ వరకు బీజేపీ పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.