Share News

కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా కర్ణాటకకు

ABN , Publish Date - Jun 05 , 2026 | 04:43 AM

కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను కర్ణాటక కొత్త సీఎం డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బహుమతిగా ఇచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు సంచలన ఆరోపణ చేశారు.

కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా కర్ణాటకకు

  • కొరటకుంట ప్రాజెక్టుకు రాష్ట్ర జలాలను రాసిచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

  • కొత్త సీఎం శివకుమార్‌కు రేవంత్‌ గిఫ్టు

  • బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌ రావు సంచలన ఆరోపణ

హైదరాబాద్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను కర్ణాటక కొత్త సీఎం డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బహుమతిగా ఇచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు సంచలన ఆరోపణ చేశారు. కర్ణాటక ప్రభుత్వం కొరటకుంట వద్ద చేపట్టిన ప్రాజెక్టుకు తెలంగాణ వాటా జలాలు అందించేందుకు రేవంత్‌ అంగీకరించారని, ఇందుకు సంబంధించిన ఒప్పందంపై రాష్ట్ర ప్రభుత్వం సంతకం చేసిందని వెల్లడించారు. కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌, కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ మెప్పు కోసం రేవంత్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ‘‘ప్రధాన మంత్రిని పది సార్లు కలుసుకున్న మీకు.. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ దొరకడం లేదా? సీఎం పదవిలో మీరుంటే కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఎలా అపాయింట్‌మెంట్‌ అడుగుతారు?’’ అని నిలదీశారు. మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌ అపాయింట్‌మెంట్‌ కోరుతూ రాసిన లేఖను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఏర్పాటై 12 ఏళ్లు గడిచినా ఉద్యమకారులను గుర్తించలేని దుస్థితికి బీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌సలే కారణమని ఆరోపించారు. ఎన్నికల్లో పొత్తులపై తమ జాతీయ నాయకత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఏపీ, తెలంగాణల్లో రాజకీయ పరిస్థితులు విభిన్నమైనవని రాంచందర్‌ రావు వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో నాడు రేవంత్‌ను కేసీఆర్‌ కాపాడారని, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో కేసీఆర్‌ను రేవంత్‌ కాపాడుతున్నారని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాన్ని సీబీఐకి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధిని కేటీఆర్‌కు స్వయంగా చూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు రాంచందర్‌రావు ప్రకటించారు. ‘‘రెండు రాష్ట్రాలకు కేటీఆర్‌ను బస్సులోనో, కారులోనో నేనే స్వయంగా తీసుకు వెళతా. తెలంగాణ కంటే ఆ రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధి కచ్చితంగా ఎక్కువ ఉంటుంది. దానిని నిరూపిస్తా. అప్పుడు ఆయన ఎమ్మెల్యే పదవికే కాకుండా మొత్తం రాజకీయాలకే రాజీనామా చేస్తే మంచిది’’ అని వ్యాఖ్యానించారు. పవన్‌ కల్యాణ్‌ సభకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుమతిస్తే సరిపోయేదని రాంచందర్‌రావు అభిప్రాయపడ్డారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని, ఆ రెండు పార్టీలే తెలంగాణ పాలిట అసలైన భూతాలని దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన ఎంఐఎంతో కలిసి ఎలా పని చేస్తారని మండిపడ్డారు.

Updated Date - Jun 05 , 2026 | 04:43 AM