Share News

కిషన్‌రెడ్డే అడ్డుతున్నరు

ABN , Publish Date - Jun 08 , 2026 | 05:41 AM

రెండున్నరేళ్లలో కాలికి బలపం కట్టుకొని 50 సార్లు ఢిల్లీకి వెళ్లా.. ఐదు సార్లు ప్రధాని మోదీని కలిశా. అయినా మెట్రో విస్తరణకు అనుమతి రాలేదు.

కిషన్‌రెడ్డే అడ్డుతున్నరు

  • తుమ్మిడిహెట్టికి అనుమతులివ్వొద్దని మహారాష్ట్ర సీఎంకు చెప్పింది ఆయన కాదా?

  • మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధి, ఆర్‌ఆర్‌ఆర్‌కు కేంద్రం ఎందుకు నిధులు ఇవ్వడం లేదు?

  • అనుమతులు తీసుకొస్తే సభపెట్టి సన్మానిస్తాం

  • కేటీఆర్‌ చెప్పినట్టు కిషన్‌రెడ్డి వింటారని బీజేపీ కార్యకర్తలే చెబుతున్నారు.. ఇదేం బుద్ధి?

  • బీఆర్‌ఎస్ పార్టీతో కలిసి గూడుపుఠాణి: సీఎం

  • నాగోల్‌ నుంచి గౌరెల్లి వరకు మూసీ రెండో దశ అభివృద్ధి పనులు చేపడతామని వెల్లడి

  • 1,511 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

  • పౌర సేవలకు ‘క్యూర్‌ వన్‌’ యాప్‌ ఆవిష్కరణ

మా సార్‌ బీజేపీల ఉంటడు.. కానీ బీఆర్‌ఎస్‌ వాళ్లతో మాట్లాడుకుంటడు. కేటీఆర్‌ చెప్పినట్టే వింటడని మీ సొంత పార్టీ వాళ్లే చెబుతున్నరు. నీకు పార్టీ మారే అవసరం ఏముంది? ఉన్న దాంట్లో ఉంటవు.. పక్క దాంట్లో తింటవు.. దొంగది కాదు.. దొడ్లకు రాదన్నట్టు నీ వ్యవహారం ఉంటుంది.

..కిషన్‌రెడ్డిని ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): ‘‘రెండున్నరేళ్లలో కాలికి బలపం కట్టుకొని 50 సార్లు ఢిల్లీకి వెళ్లా.. ఐదు సార్లు ప్రధాని మోదీని కలిశా. అయినా మెట్రో విస్తరణకు అనుమతి రాలేదు. మూసీ ప్రక్షాళన, ఆర్‌ఆర్‌ఆర్‌కు నిధులు ఇవ్వరు. ఇవన్నీ ఎందుకు ఆగుతున్నాయి? ఎవరు ఆపుతున్నారో రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలి’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. నిజానికి రాష్ట్రానికి ఏవీ దక్కకుండా అడ్డుకుంటున్నది కిషన్‌రెడ్డేఅని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ తో కలిసి ఆయన గూడుపుఠాణి చేస్తున్నారని ఆరోపించారు. కిషన్‌ రెడ్డి బీజేపీలో ఉంటారుగానీ, బీఆర్‌ఎస్‌ వాళ్లతో మాట్లాడుకుంటారని, కేటీఆర్‌ చెప్పినట్టే వింటారని బీజేపీ వాళ్లే చెబుతున్నారని పేర్కొన్నారు. ఆదివారం మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంఎంసీ) పరిధిలోని పలు ప్రాంతాల్లో రూ.1,511 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఉప్పల్‌ భగాయత్‌ వేదికగా సీఎం రేవంత్‌ శంకుస్థాపనలు చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని అన్ని కార్పొరేషన్ల పరిధిలో ప్రభుత్వ సేవలు అందించే ‘క్యూర్‌ వన్‌’ మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించారు. ఉప్పల్‌లో ఖత్రి, వంజరి కుల ఆత్మగౌరవ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సబర్మతి, ఢిల్లీలో యమున, యూపీలో గంగా నది తీర ప్రాంతాలను అభివృద్ధి చేశారని.. మరి తెలంగాణలో మూసీ నది ప్రక్షాళన చేయకుండా ఎందుకు అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి నిలదీశారు. ‘‘గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల మూసీని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తే.. ఆర్థికంగా, పర్యాటకంగా నగరం పురోగతి సాధిస్తుంది. యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయి. న్యూయార్క్‌, న్యూజెర్సీ మధ్య హట్సన్‌ రివర్‌ ఫ్రంట్‌ వద్ద అపార్ట్‌మెంట్ల విలువ రూ.వందల కోట్లు ఉంది. కానీ ఇక్కడ మురికి వల్లే భూమికి విలువ లేదు. అంతేకాదు ఈ మురికి నల్గొండ జిల్లా ప్రజలను కాలుష్యమై కాటేస్తోంది. ఆలేరు, భువనగిరి పరిసర ప్రాంతాల్లో కొత్తగా పెళ్లయిన జంటలను ప్రెగ్నెన్సీ సమస్య ఉందని ఊరి నుంచి హైదరాబాద్‌కు పంపుతున్నారు. నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు మూసీ ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరారు. మూసీ నదిని మనం ఎందుకు ప్రక్షాళన చేయొద్దు? ఇళ్లు పోతే ఇళ్లు.. ఉపాధి పోతే ఉపాధి కల్పిద్దాం.. వాళ్ల పిల్లలకు మంచి చదువులు చెప్పిద్దామంటే వద్దంటారు. అడ్డంపడతారు. నువ్వు ఇక్కడి ఎంపీవి కదా.. మూసీ ప్రాజెక్టుకు నిధులు, అనుమతులు తెస్తావా కిషన్‌రెడ్డీ’’ అని రేవంత్‌ ప్రశ్నించారు.


మెట్రోకు అనుమతులు రావడం లేదేం?

ఢిల్లీ తర్వాత హైదరాబాద్‌ మెట్రో రెండో స్థానంలో ఉండేదని.. ఇప్పుడు తొమ్మిదో స్థానానికి పడిపోయిందని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ‘‘122 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించాలని ప్రయత్నిస్తుంటే.. దాదాపు అన్ని అనుమతులు వచ్చాక.. ఇక్కడి నుంచి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న ఆయన అడ్డుపడటంతో అర్ధంతరంగా ఆపే పరిస్థితి వచ్చింది’’ అని కిషన్‌రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. తెలంగాణలో 75 లక్షల టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని... కేంద్రం అందులో 50 లక్షల టన్నులే సేకరిస్తామంటే, మిగతా 25 లక్షల టన్నులు ఏం కావాలని నిలదీశారు. ‘‘పంజాబ్‌లో 86 శాతం కొంటారు. మీ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో 70-80 శాతం వడ్లు కొంటారు. తెలంగాణలో మాత్రం సగానికి సగం తక్కువ కొంటున్నారు. కేంద్రం మొత్తం కొనేలా చూడాల్సిన బాధ్యత కిషన్‌రెడ్డికి లేదా? మెట్రో విస్తరణకు, ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుమతులు ఇవ్వాల్సిందే, మూసీ ప్రక్షాళన జరగాల్సిందే.. రైతుల వడ్లు, మక్కలు కొనాల్సిందే.. వీటన్నింటికి నువ్వు సహకరించకుంటే 15 తరువాత కచ్చితంగా కార్యాచరణ ఉంటుంది. బరాబర్‌ నీ సంగతి చెప్తాం’’ అని రేవంత్‌ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలతో పెట్టుకుని బాగుపడినోడు ఎవరూ లేరన్నారు.


అప్పుడు చేయలేకపోయా.. ఇప్పుడు చేస్తా..

2018లో జరిగిన గందరగోళంలో కొడంగల్‌లో ఓడిపోయిన తనను మల్కాజ్‌గిరి ప్రజలు ఆదరించి గెలిపించారని రేవంత్‌ గుర్తు చేసుకున్నారు. నాడు ప్రభుత్వం నుంచి సహకారం అందకపోవడంతో ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయానని, ఇప్పుడు సీఎంగా మీరు కోరుకున్న స్థాయిలో అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపలి 1.34 కోట్ల మందికి మౌలిక వసతుల ఏర్పాటు, మునిసిపల్‌, పోలీస్‌, విద్యుత్‌ శాఖ, వాటర్‌బోర్డు, మెట్రో తదితర అంశాల్లో పాలనా సమన్వయం కోసమే మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని.. రాజకీయ లబ్ధి కోసం కాదని చెప్పారు. బండారి లక్ష్మారెడ్డి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అయినా.. ఆయన సోదరుడు బండారి రాజిరెడ్డి పేరును ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌కు పెట్టామని.. ఇలాంటి విషయాల్లో రాజకీయాలతో సంబంధం లేదని పేర్కొన్నారు.


నాగోల్‌ నుంచి గౌరెల్లి వరకు రెండో విడత

గండిపేట నుంచి గాంధీ సరోవర్‌ వరకు మొదటి విడతలో మూసీ నది ప్రక్షాళన జరుగుతోందని సీఎం చెప్పారు. నాగోల్‌ నుంచి గౌరెల్లి వరకు రెండో విడత పనులు చేపడతామన్నారు. ఈ ప్రాంతంలో భూసమీకరణ సమస్యలను పరిష్కరించాలని స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలను కోరారు. వంద రోజుల్లో ఫేజ్‌-2 పనులు ప్రారంభించేలా అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఎప్పుడు తన కార్యక్రమం ఏర్పాటుచేసినా.. కుడివైపు ఆడబిడ్డలకు కుర్చీలు వేసి, ఎడమ వైపు యువ సోదరులకు కుర్చీలు వేయాలని అధికారులకు రేవంత్‌ సూచించారు. ఉప్పల్‌ భగాయత్‌ కార్యక్రమంలో మహిళలను వెనుక వరుసలో కూర్చోబెట్టి, రాజకీయ నాయకులను ముందు కూర్చొబెట్టడాన్ని ప్రస్తావిస్తూ ఈ సూచన చేశారు. ఆడబిడ్డలు నిండు మనసుతో ఆశీర్వదించినందుకే జెడ్‌పీటీసీ నుంచి సీఎం స్థాయికి ఎదిగానని చెప్పారు.


మీ పార్టీకి ఎప్పుడైనా పనిచేశారా?

తాను పుట్టింది బీజేపీలోనే, చచ్చేది బీజేపీలోనని కిషన్‌రెడ్డి అంటున్నారని రేవంత్‌ గుర్తు చేశారు. ‘‘నిజమే.. అండ్లనే ఉంటవు.. చీకట్ల ఇవతలోని సహకారం తీసుకుంటవు. నువ్వు నీ పార్టీకి ఎప్పుడైనా పనిచేశావా? మా సార్‌ బీజేపీల ఉంటడు.. కానీ బీఆర్‌ఎస్‌ వాళ్లతో మాట్లాడుకుంటడు. కేటీఆర్‌ చెప్పినట్టే వింటడని మీ సొంత పార్టీ వాళ్లే చెబుతున్నరు. నీకు పార్టీ మారే అవసరం ఏముంది? ఉన్న దాంట్లో ఉంటవు.. పక్క దాంట్లో తింటవు.. దొంగది కాదు.. దొడ్లకు రాదన్నట్టు నీ వ్యవహారం ఉంటుంది’’ అని ఎద్దేవా చేశారు. అనుమతి తీసుకుని తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కడదామంటే మహారాష్ట్ర సీఎం తప్పించుకొని తిరుగుతున్నారని రేవంత్‌ చెప్పారు. ఇదేమిటని కనుక్కుంటే అనుమతులు ఇవ్వొద్దని కిషన్‌రెడ్డి చెప్పారని మహారాష్ట్ర సీఎం ఆఫీసు నుంచి సమాచారం వచ్చిందన్నారు. ఇదెక్కడి బుద్ధి కిషన్‌రెడ్డీ అని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి అన్ని ప్రాజెక్టులకు అనుమతి తీసుకువస్తే.. ఎల్‌బీ స్టేడియంలో భారీ సభ పెట్టి సన్మానించి, గండ పెండేరం తొడుగుతామని చెప్పారు. తెలంగాణకు సహకారం అందించాలని, చీకట్లో బీఆర్‌ఎస్ తో కలిసి గూడుపుఠానీ చేయవద్దని సూచించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఆరు నెలలు రాజకీయాలు చేద్దామని.. మిగతా సమయమంతా కష్టపడి నగరాన్ని అభివృద్ధి చేసుకుందామని బీజేపీ, బీఆర్‌ఎస్‌ మిత్రులను కోరుతున్నానని చెప్పారు. తన దగ్గరకు వచ్చే ఎమ్మెల్యేలు ఏ పార్టీ అని చూడకుండా పనులు చేయించే బాధ్యత తనదని, రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేసుకుందామని కోరారు.


మూసీ అభివృద్ధిపై ముందుకే.. అవాంతరాలు ఎదురైనా లెక్కచేయం

ఉప్పల్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): మూసీ సుందరీకరణ పై ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ముందుకే వెళతామని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఉప్పల్‌ భగాయత్‌లో మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ నూతన భవన శంకుస్థాపన సందర్భంగా జరిగిన సభలో సీఎం సమక్షంలో ఆయన మాట్లాడారు. మూసీ అభివృద్ధికి ప్రతిపక్షాలు ఎందుకు అడ్డుపడుతున్నాయో ప్రజలకు తెలుసన్నారు. మూసీతో ఎన్నో ఏళ్ళుగా పరివాహక ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఈ ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో సాగుతోందన్నారు. గత 90 రోజులుగా ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక పేరుతో ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేశామన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్ల బహుళ సేవలను పొందేందుకు వీలుగా క్యూర్‌ ప్యూర్‌ రేర్‌ అనే కొత్త యాప్‌ను ప్రజలుకు అందుబాటులోకి తెచ్చేందుకే సీఎం రేవంత్‌రెడ్డి ఇక్కడకు వచ్చారని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. చెప్పింది చేయడమే ఈ ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించపోయినా.. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దుతూ ముందుకు సాగుతున్నామని మంత్రి పేర్కొన్నారు.

Updated Date - Jun 08 , 2026 | 05:42 AM