దక్షిణాదిపై బీజేపీ కుట్ర
ABN , Publish Date - Apr 15 , 2026 | 04:28 AM
నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేలా బీజేపీ కుట్ర పన్నిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
50 శాతం పేరుతో సీట్ల కోటా తగ్గించే యత్నం
అన్యాయంపై అందరం కలిసి పోరాడాలి
గాంధీ, అంబేడ్కర్.. దేశానికి రెండు కళ్లు
అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిస్తున్నాం
దళితులకు అత్యంత ప్రాధాన్యమిచ్చాం
గత పదేళ్లు పాలించిన నాయకులు..ఏనాడైనా అంబేడ్కర్‌కు నివాళులర్పించారా?
స్పీకర్ దళితుడనే అసెంబ్లీకి రావడంలేదు
అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేలా బీజేపీ కుట్ర పన్నిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 50 శాతం ప్రాతిపదికన లోక్‌సభ సీట్లు పెంచుతామంటూనే దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల కోటా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విధానంతో దక్షిణాది రాష్ట్రాల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని, ఈ చిన్న లెక్క కేంద్రమంత్రులుగా ఉన్నవారికి తెలియడంలేదా? అని ప్రశ్నించారు. రాజ్యాధికారం అంతిమ లక్ష్యమని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పారని గుర్తుచేశారు. దక్షిణాదికి జరిగే అన్యాయాన్ని అడ్డుకునేందుకు అందరం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి సీఎం రేవంత్‌రెడ్డి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో పదేళ్లు జరిగిన విధ్వంసాన్ని తాము సరిచేసుకుంటూ మందుకెళ్తున్నామన్నారు. ఈ దిశగా తమ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంటే.. వెనుక నుంచి కొంతమంది కుట్రలు చేస్తూ, గోతులు తవ్వుతున్నారని, వారిని ఆ గోతిలోనే పాతిపెట్టే పనిని ప్రజలు చేయాలని అన్నారు. పదేళ్లలో పెద్ద పెద్ద ప్రసంగాలు చేసిన నాయకులు ఒక్కసారైనా అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారా? అని ప్రశ్నించారు. గత పాలనతో పోల్చితే ప్రజాప్రభుత్వంలో దళితులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామన్నారు. దళిత బిడ్డ స్పీకర్‌గా ఉన్నారనే కారణంతో అసెంబ్లీకి రాకుండా ఆయనను అవమానిస్తున్నారని ప్రతిపక్ష నేత కేసీఆర్‌నుద్దేశించి రేవంత్ అన్నారు. దళిత బిడ్డలు ఆర్థిక మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండొద్దా? అని ప్రశ్నించారు.
ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం..
రాష్ట్రంలో దళితులు, గిరిజనులకు అన్ని రంగాల్లో తగిన ప్రాధాన్యం కల్పిస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. కులాల అంతరం తొలగిపోవాలనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తుండడంతోపాటు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను తీసుకువస్తున్నట్టు చెప్పారు. పేదలకు విద్య అందాలన్న అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. రెండేళ్లలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చామని, అందులో ఎక్కువగా దళితులు, గిరిజనులే ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో 87 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఉద్యోగాలు లభించాయన్నారు. రక్తం చిందించకుండా శాంతితో యుద్ధాన్ని గెలవచ్చని మహాత్మా గాంధీ నిరూపిస్తే, భారత్‌ను ప్రపంచ దేశాలకు ఆదర్శంగా పరిపాలించవచ్చని అంబేడ్కర్ నిరూపించారని సీఎం కొనియాడారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో మహాత్ముడి పాత్ర ఎంత ఉందో.. అంబేడ్కర్ పాత్ర కూడా అంతే ఉందన్నారు. ఇద్దరూ దేశానికి రెండు కళ్లలాంటి వారని అన్నారు. ఇక తెలంగాణ ఉద్యమంలో బడుగు, బలహీనవర్గాలే ముఖ్యపాత్ర పోషించాయని రేవంత్ అన్నారు. తన పాటతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన గద్దర్‌ను ఎలా మరిచిపోతామని, జయ జయహే తెలంగాణ గీతాన్ని రాసిన అందెశ్రీ మనవాడు కాదా? అని ప్రశ్నించారు. మంచి పనికి తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత ప్రజలదేనని పిలుపునిచ్చారు.