మిడ్జిల్ టూ.. తెలంగాణ సీఎం
ABN , Publish Date - Jun 30 , 2026 | 04:41 AM
వెయ్యి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది! సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం కూడా సరిగ్గా ఇలాగే ప్రారంభమైంది.
ప్రజా ప్రతినిధిగా రేవంత్ రెడ్డి 20 ఏళ్ల ప్రస్థానం
హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): వెయ్యి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది! సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం కూడా సరిగ్గా ఇలాగే ప్రారంభమైంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ జడ్పీటీసీ సభ్యుడిగా ఆయన వేసిన తొలి అడుగు.. నేడు ఆయనను రాష్ట్ర అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టింది. ప్రజాప్రతినిధిగా ఆయన ప్రస్థానం ప్రారంభమై ఈ జూలై 4 నాటికి సరిగ్గా 20 ఏళ్లు పూర్తికానున్నాయి. ఈ చరిత్రాత్మక మైలురాయిని పురుస్కరించుకుని, జూలై 4న సీఎం రేవంత్ రెడ్డి మిడ్జిల్‌లో పర్యటించనున్నారు. తన రాజకీయ జన్మభూమి అయిన మిడ్జిల్ ప్రజల సమక్షంలోనే ప్రజాప్రతినిధిగా 20వ పుట్టిన రోజును జరుపుకోవాలని సీఎం నిర్ణయించారు. అప్పట్లో తన గెలుపునకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అలాగే అక్కడ జరిగే బహిరంగ సభలోనూ పాల్గొననున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రజాప్రతినిధి నుంచి సీఎం పీఠం దాకా సాగిన తన ప్రస్థానానికి పునాదిగా నిలిచిన మిడ్జిల్ ప్రజలకు వరాలూ ప్రకటించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
మిడ్జిల్ జడ్పీటీసీగా తొలి విజయం!
విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేసినా, ప్రత్యక్ష రాజకీయాల్లో రేవంత్ రెడ్డి తొలి అడుగు స్వతంత్రంగానే పడింది. ఉమ్మడి రాష్ట్రంలో 2006 పరిషత్ ఎన్నికల్లో మిడ్జిల్ జడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, జూలై 4న విజయం సాధించారు. మరుసటి ఏడాదే (2007) మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగానే గెలిచి, శాసనమండలిలో అడుగు పెట్టారు. అనంతరం టీడీపీలో చేరిన రేవంత్‌రెడ్డి.. తన వాగ్దాటితో అనతి కాలంలోనే ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అయితే తెలంగాణ శాసనభలో టీడీపీఎల్పీ.. బీఆర్‌ఎ్‌సఎల్పీలో విలీనం కావడం, ఆ పార్టీ మనుగడా ప్రశ్నార్థకం కావడంతో తన లక్ష్య సాధన కోసం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే టీడీపీపై తనకున్న గౌరవాన్ని ప్రకటిస్తూనే.. తాను ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వస్తుందో టీడీపీ అధినేత చంద్రబాబుకు సుదీర్ఘ లేఖ రాశారు. తద్వారా టీడీపీ మద్దతు దారుల్లో తన పట్ల ఉన్న అభిమానాన్ని పదిలపరుచుకోగలిగారు. తదనంతర కాలంలో తనదైన వాగ్దాటి, అధికార పార్టీపై రాజీలేని పోరాటంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని జనాకర్షక నేతగా ఎదిగారు. ప్రజల్లో రేవంత్‌రెడ్డికి వస్తున్న స్పందనను గ్రహించిన అధిష్ఠానం.. 2018 ఎన్నికలకు ముందు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది. అయితే 2018 ఎన్నికల్లో అప్పటి అధికార బీఆర్‌ఎస్ పార్టీ కొడంగల్ పైన ప్రత్యేక దృష్టి సారించడం, ఇతర పరిణామాల నేపథ్యంలో ఆ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. ప్రజాప్రతినిధిగా రేవంత్‌రెడ్డి ప్రస్తానంలో ఈ ఓటమి ఒక రకంగా స్పీడ్ బ్రేకర్‌గానే భావించవచ్చని రాజకీయ వర్గాలు విశ్లేషించాయి. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి స్థానం నుంచి రేవంత్‌రెడ్డిని అధిష్ఠానం బరిలోకి దింపింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న రేవంత్‌రెడ్డి.. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఏకైక ప్రజాకర్షక నేతగా ఉన్న రేవంత్‌రెడ్డిని 2021 జూలై 7న టీపీసీసీ అధ్యక్షుడిగా అధిష్ఠానం నియమించింది. టీపీసీసీ చీఫ్‌గా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అందుకున్న రేవంత్‌రెడ్డి.. 2023 ఎన్నికల్లో పార్టీని విజయతీరానికి చేర్చారు. 2023 డిసెంబర్ 7న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ముఖ్యమంత్రి పీఠం వరకూ సాగిన రేవంత్‌రెడ్డి ప్రస్థానంలో మిడ్జిల్ జడ్పీటీసీ అభ్యర్థిగా ఆయన సాధించిన తొలి విజయం ప్రత్యేకమనే చెప్పవచ్చు. ఆ ప్రత్యేకతను మరోమారు గుర్తు చేసుకునేందుకే.. సీఎం రేవంత్‌రెడ్డి జూలై 4న మిడ్జిల్ పర్యటన పెట్టుకున్నట్లు చెబుతున్నారు.