విశ్రాంతి.. పుష్కరమే
ABN , Publish Date - Aug 09 , 2026 | 05:13 AM
జీవితంలో బాధ్యతల చక్రబంధం నుంచి బయటపడి విశ్రాంతి తీసుకునే సమయమే ఉద్యోగ విరమణ. 30-40 ఏళ్లపాటు కష్టపడి పనిచేసి ఉద్యోగం నుంచి నిష్క్రమించాక ప్రశాంతంగా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.
రిటైర్మెంట్ తర్వాత పురుషుల ఆయుర్దాయం 12.6 ఏళ్లే!
భారత్‌లో 60 ఏళ్లకురిటైరయ్యాక సగటున 8.5 ఏళ్లే..
ప్రపంచంలో పురుషుల సగటు రిటైర్మెంట్ వయసు 64.2
35 దేశాల్లో నిర్వహించిన సర్వేలో వెల్లడి
హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): జీవితంలో బాధ్యతల చక్రబంధం నుంచి బయటపడి విశ్రాంతి తీసుకునే సమయమే ఉద్యోగ విరమణ. 30-40 ఏళ్లపాటు కష్టపడి పనిచేసి ఉద్యోగం నుంచి నిష్క్రమించాక ప్రశాంతంగా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే, ఉద్యోగానికి వీడ్కోలు పలికాక పురుషులకు మిగిలే శేష జీవితం ఎన్నాళ్లు? ఇదే అంశంపై ‘మాన్యువల్’ అనే సంస్థ 35 దేశాల్లో నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ప్రపంచవ్యాప్తంగా పురుషుల సగటు రిటైర్మెంట్ వయసు 64.2 సంవత్సరాలని ఆ సర్వేలో తేలింది. అయితే, ఇది ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంది. అతి తక్కువ ఉద్యోగ విరమణ వయసు ఉన్న దేశాల్లో భారత్, చైనా, మలేషియా, తుర్కియే, దక్షిణాఫ్రికా ఉన్నాయి. ఈ దేశాల్లో పురుషుల సగటు ఉద్యోగ విరమణ వయసు 60 ఏళ్లుగా ఉంది. ఇటలీ, గ్రీస్, ఐస్‌లాండ్‌లలో ఇది 67 ఏళ్లు. బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, స్పెయిన్‌లలో 66 ఏళ్లుగా ఉన్నట్లు సర్వేలో తేలింది. ఈ సర్వే ప్రకారం ప్రపంచంలో పురుషుల సగటు ఆయుర్థాయం 76.8 సంవత్సరాలు. అత్యధికంగా స్విట్జర్లాండ్‌లో మగవారి సగటు ఆయుర్థాయం 81.9 ఏళ్లుగా ఉందని సర్వేలో తేలింది. ఆ తర్వాతి స్థానంలో 81.4 ఏళ్లతో జపాన్ ఉంది. స్వీడన్‌లో 81.3 ఏళ్లు.. నార్వే, ఇటలీ, ఐస్‌లాండ్‌లలో 81 ఏళ్లు.. స్పెయిన్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌లో 80 ఏళ్లు ఉంది. మనదేశంలో ఇది 68.5 ఏళ్లుగా ఉంది. దక్షిణాఫ్రికాలో పురుషులు సగటున 60.7 ఏళ్లకే మరణిస్తున్నారు.
రిటైర్మెంట్ తర్వాత పుష్కరకాలమే..
ఈ అధ్యయనంలో అత్యంత కీలకమైన అంశం రిటైర్మెంట్ వయసుకు, మరణించే వయసుకు మధ్య ఉన్న కాలం. రిటైర్మెంట్ తర్వాత పురుషుల ప్రపంచ సగటు జీవితకాలం 12.67 సంవత్సరాలు అని సర్వేలో తేలింది. మనదేశంలో ఇది 8.5 ఏళ్లు మాత్రమే. దక్షిణాఫ్రికాలో రిటైర్‌మెంట్ నాటికే మరణిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. స్విట్జర్లాండ్‌లో మాత్రమే రిటైర్మెంట్ తర్వాత అత్యధికంగా 17 ఏళ్లపాటు పురుషులు బతుకుతున్నారు. మనదేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అధికారిక రిటైర్మెంట్ వయసు సగటున 60 ఏళ్లు. పాశ్చాత్య దేశాల కంటే ఇది తక్కువే అయినప్పటికీ, ఇక్కడ జీవిత సవాళ్లు వేరుగా ఉన్నాయి. భారతీయ పురుషుల్లో గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధులు త్వరగా వస్తున్నాయి. రిటైర్మెంట్ తర్వాత సరైన ఆరోగ్య బీమా, పెన్షన్ ఇతర సదుపాయాలు లేకపోవడం వల్ల శేష జీవితంలో మానసిక ఆందోళన పెరుగుతోంది. ఉద్యోగ జీవితం ముగిశాక జీవన విధానంలో అకస్మాత్తుగా వస్తున్న మార్పు.. ఒంటరితనం కూడా ఆయుర్థాయంపై ప్రభావం చూపుతోంది. అయితే, సరైన ప్రణాళిక ఉంటే రిటైర్మెంట్ తర్వాత కూడా ఎక్కువకాలం ప్రశాంతంగా, ఆరోగ్యంగా జీవించవచ్చని సర్వే తేల్చింది. 40-50 ఏళ్ల వయసు నుంచే ఆహారపు అలవాట్లు, వ్యాయామంపై దృష్టి పెట్టాలని సూచించింది. 60 ఏళ్ల తర్వాత ఎవరిపైనా ఆధారపడకుండా రిటైర్మెంట్ ఫండ్, ఆరోగ్య బీమా సిద్ధం చేసుకోవాలని పేర్కొంది.