Share News

కంచి పీఠానికి 14కోట్ల విలువైన ఆస్తి దానం

ABN , Publish Date - Mar 08 , 2026 | 05:06 AM

ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు కిలారు రామకోటేశ్వరరావు(85) తన యావదాస్తిని తమిళనాడులోని కంచి పీఠానికి చెందేలా రిజిస్ట్రేషన్‌ చేశారు.

కంచి పీఠానికి 14కోట్ల విలువైన ఆస్తి దానం

  • ఖమ్మం జిల్లా రిటైర్డ్‌ టీచర్‌ రామకోటేశ్వరరావు భక్తి తత్పరత

బోనకల్‌, మార్చి 7(ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు కిలారు రామకోటేశ్వరరావు(85) తన యావదాస్తిని తమిళనాడులోని కంచి పీఠానికి చెందేలా రిజిస్ట్రేషన్‌ చేశారు. రూ.14కోట్ల విలువ చేసే 14ఎకరాల వ్యవసాయ భూమి, రెండు ఇళ్లు, ఒక ఫంక్షన్‌హాల్‌ను కంచి పీఠానికి చెందిన ప్రత్యక్ష ట్రస్టుకు రిజిస్ట్రేషన్‌ చేశారు. అయితే ప్రస్తుతం ఆయన భార్య సైదమ్మ జీవించే ఉన్నందున ఓ ఇంటితో పాటు రూ.20లక్షల నగదును ఆమె వినియోగించుకునేలా రాశారు. తదనంతరం ఆ ఇల్లు కూడా కంచి పీఠానికే చెందనుంది. ఇక మిగిలిన ఆస్తులను వారం క్రితం కంచి పీఠానికి చెందిన ప్రత్యక్ష ట్రస్టు పేరిట రిజిస్ట్రేషన్‌ కూడా పూర్తి చేసి పత్రాలను ట్రస్టుకు అందజేశారు. జీవితాంతం దేశభక్తి, ఆధ్యాత్మిక చింతనతో ఆదర్శవంతమైన జీవనాన్ని సాగించిన ఆయన తన స్వగ్రామం లక్ష్మీపురంలో శుక్రవారం అనారోగ్యంతో కన్నుముశారు. సంతానం లేని రామకోటేశ్వరరావు, సైదమ్మ దంపతులు గ్రామంలో పాఠశాల, కమ్యూనిటీహాల్‌, గ్రంథాలయాల నిర్మాణాలకు స్థలాలు ఇచ్చారు. గ్రామంలో రామాలయ నిర్మాణం, పురాతన శివాలయ పునర్నిర్మాణం, శ్రీ హనుమంతుడి వేద గాయత్రి ఆలయాలను నిర్మించి గ్రామానికి అప్పగించారు. పేద విద్యార్థులకు చేయూతతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. రామకోటేశ్వరరావు అంత్యక్రియలు శనివారం బంధుమిత్రులు, గ్రామస్థుల ఆశ్రునయనాల మధ్య జరిగాయి.

Updated Date - Mar 08 , 2026 | 05:06 AM