కోర్టుకెక్కిన న్యాయమూర్తి
ABN , Publish Date - Jun 16 , 2026 | 05:07 AM
అనేక కేసుల్లో తీర్పులిచ్చి పదవీ విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తే.. తనకు అన్యాయం జరిగిందని అదే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
తమ భూములను నిషేధిత జాబితాలో చేర్చటంపై హైకోర్టులో జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి పిటిషన్
హైదరాబాద్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): అనేక కేసుల్లో తీర్పులిచ్చి పదవీ విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తే.. తనకు అన్యాయం జరిగిందని అదే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనకు, తన సోదరుడికి చెందిన భూములను అధికారులు రిజిస్ట్రేషన్ యాక్ట్-1908 సెక్షన్ 22-ఏ (నిషేధిత జాబితా)లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గుబ్బడి గ్రామంలోని సర్వే నెంబర్ 103/45ఏఏలో తనకు ఉన్న 3.26 ఎకరాలు, సర్వే నెంబర్ 103/45ఈలో తన సోదరుడు అశోక్‌కుమార్ షావిలికి ఉన్న 1.04 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 2025లో ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. 1980లలో చట్టబద్ధంగా ఈ భూములు కొనుగోలు చేశామని, అప్పటి నుంచి తమ ఆధీనంలోనే ఉన్నాయన్నారు. ఎలాంటి రికార్డులు, ఆధారాలు లేకుండా వాటిని అసైన్డ్ భూములుగా గుర్తించటం, తగిన ఆలోచన లేకుండా యాంత్రికంగా నిషేధిత జాబితాలో చేర్చడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఈ పిటిషన్ సోమవారం జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషన్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన విషయం కాబట్టి.. సదరు రోస్టర్ ఉన్న ధర్మాసనం ఎదుట ఉంచాలని పేర్కొంటూ విచారణను ఈ నెల 16కు వాయిదా వేశారు.