Share News

ప్రత్యామ్నాయాలన్నీ పరిశీలించాకే..తుమ్మిడిహెట్టిపై ముందుకెళ్లాలి

ABN , Publish Date - May 14 , 2026 | 04:07 AM

తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీపై నిర్ణయం తీసుకునే ముందు ఇతర ప్రత్యామ్నాయాలన్నీ పరిశీలించాలని తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

ప్రత్యామ్నాయాలన్నీ పరిశీలించాకే..తుమ్మిడిహెట్టిపై ముందుకెళ్లాలి

  • ప్రభుత్వానికి తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం వినతి

హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీపై నిర్ణయం తీసుకునే ముందు ఇతర ప్రత్యామ్నాయాలన్నీ పరిశీలించాలని తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ నీటి పారుదలశాఖ సలహాదారుడు ఆదిత్యనాథ్‌ దాస్‌ను సంఘం అధ్యక్షుడు ఎం.శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి నేతృత్వంలో పలువురు ప్రతినిధులు కలిసి వినతిపత్రాన్ని అందించారు. ప్రస్తుత ప్రతిపాదిత ప్రాంతంలో రెండు నదుల సంగమంలో రెండు బ్యారేజీలు, ఆ బ్యారేజీలకు అనుసంధానంగా ఒక కట్టను ప్రతిపాదించారని తెలిపారు. ఇందులో వార్ధా నుంచి తక్కువగా, వెన్‌గంగా నుంచి భారీ ప్రవాహాలు ఉంటాయని, దీనివల్ల కొత్త సమస్యలు రావొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. బ్యారేజీపై తుది నిర్ణయం తీసుకునే ముందు నమూనా అధ్యయనాలు విధిగా చేపట్టాలని, తగిన ప్రత్యామ్నాయాలు పరిశీలించాలని సూచించారు. ఇక తుమ్మిడిహెట్టికి దిగువన 9 కిలోమీటర్ల దూరంలో బోరేపల్లి వద్ద ఒక ప్రతిపాదనను విశ్రాంత ఇంజనీర్‌ విఠల్‌రావు ఇచ్చారని, దీనిపై ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక(పీఎఫ్ఆర్‌)ను సిద్ధం చేసే బాధ్యతను ఆర్వీ అసోసియేట్స్‌కు ఇచ్చారని గుర్తు చేశారు. బ్యారేజీ కట్టే స్థానంతో పాటు బ్యారేజీ డిజైన్‌లను ఖరారు చేసే ముందు కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) డీపీఆర్‌ తయారీకి ఉద్దేశించిన మార్గదర్శకాల ప్రకారం నమూనా అధ్యయనాలు చేపట్టాలని సూచించారు.

Updated Date - May 14 , 2026 | 04:07 AM