Share News

వ్యాలిడిటీ చట్టాన్ని ఉపసంహరించుకోకుంటే ఉద్యమానికి సిద్ధం

ABN , Publish Date - Mar 26 , 2026 | 05:01 AM

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యాలిడిటీ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే ఉద్యమానికి సిద్ధమని తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు హెచ్చరించారు.

వ్యాలిడిటీ చట్టాన్ని ఉపసంహరించుకోకుంటే ఉద్యమానికి సిద్ధం

  • తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు

హైదరాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యాలిడిటీ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే ఉద్యమానికి సిద్ధమని తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం ఆరోపించింది. పదవీ విరమణ అనంతరం ప్రయోజనాలు అందకుండా అడ్డుకుంటోందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర ప్రతినిధులు బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును పార్టీ కార్యాలయంలో కలిసి వ్యాలిడిటీ చట్టంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ చట్టం ప్రకారం 2026 జనవరి 1 కంటే ముందు పదవీ విరమణ పొందిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు ఎలాంటి అదనపు ప్రయోజనాలు పొందలేరన్నారు. పింఛనర్ల రాజ్యాంగ హక్కులను హరించే విధంగా తెచ్చిన ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 1.80 కోట్ల మంది పింఛనర్లకు నష్టం జరుగుతుందన్నారు.

Updated Date - Mar 26 , 2026 | 05:01 AM