Share News

దేహాన్ని చూసి కాదు.. మహిళగా గౌరవించండి

ABN , Publish Date - Jan 26 , 2026 | 03:24 AM

‘‘రాజకీయాల్లోకి మహిళలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. వాళ్లకి ఇంటిపనితోనే సమయం సరిపోతోంది. సమాజం, కుటుంబం అండగా నిలబడితే వారు అద్భుతాలు చేయగలరు.

దేహాన్ని చూసి కాదు.. మహిళగా గౌరవించండి

  • రక్షణ అంటే ఆంక్షలు కాదు.. పురుషుల ఆలోచనా ధోరణి మారాలి

  • వంటింటి సంకెళ్లు తెంచుకుంటేనే మహిళా సాధికారత

  • ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో నటి, రచయిత రోహిణి మొల్లేటి

‘‘రాజకీయాల్లోకి మహిళలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. వాళ్లకి ఇంటిపనితోనే సమయం సరిపోతోంది. సమాజం, కుటుంబం అండగా నిలబడితే వారు అద్భుతాలు చేయగలరు. స్త్రీని కేవలం దేహంగా కాకుండా, ఒక మహిళగా గౌరవించినప్పుడే వారికి నిజమైన రక్షణ లభిస్తుంది’’ అని తేల్చి చెప్పారు ప్రముఖ నటి, రచయిత, రోహిణి మొల్లేటి. తమిళనాడు ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ అండ్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె.. నటనలోనే కాదు సామాజిక అంశాలపైనా తనదైన ముద్ర వేశారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఐద్వా 14వ జాతీయ మహసభల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రోహిణి.. మహిళా సాధికారత, రక్షణ, నేటి సమాజంలో మారుతున్న విలువలు తదితర అంశాలపై ఆమె అభిప్రాయాలను ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు.

ఐద్వా సభల్లో పాల్గొనడం మీకెలా అనిపిస్తోంది ?

గతంలో తమిళనాడులో జరిగిన సభల్లో పాల్గొన్నాను. చెన్నైలో మహిళా హక్కుల కోసం పని చేసే అనేక వేదికల పైన కామ్రేడ్లతో కలిసి నా గళాన్ని వినిపిస్తూనే ఉన్నాను. అయితే, తెలంగాణలో జరుగుతున్న ఐద్వా సభలకు రావడం ఇదే మొదటిసారి. ఇక్కడ ప్రారంభోపన్యాసం చేసే అవకాశం రావడం చాలా గొప్ప బాధ్యతగా భావిస్తున్నాను.

దేశ రాజకీయాల్లో మహిళల పాత్ర పెరుగుతోందని మీరు భావిస్తున్నారా ?

రాజకీయాల్లోకి మహిళలు రావాల్సిన స్థాయిలో ఇంకా రావడం లేదనేది నా అభిప్రాయం. వాళ్లు రాజకీయాల్లో రాణించాలంటే తగినంత సమయం దొరకాలి. రాజకీయాలంటే చిన్న విషయం కాదు కదా ?. ఎన్నో చదవాలి. అర్థం చేసుకోవాలి. కానీ, మహిళలు ఇంట్లో పనులతోనే సతమతమవుతున్నారు. వారికి కుటుంబం నుంచి తగిన మద్దతు, తగిన అవకాశాలు లభించినప్పుడే బయటకు వచ్చి అద్భుతాలు చేయగలరు. అలాగే, మహిళలు కూడా ధైర్యంగా ముందుకు రావాలి, సమస్యల మీద అవగాహన పెంచుకోవాలి. ఈ రెండూ ఉంటే అనుకున్నది సాఽధించవచ్చు.


ఇటీవల స్త్రీల వస్త్రధారణ, జీవనశైలిపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. దీనిపై మీ స్పందన ?

స్త్రీల వస్త్రధారణ అంశాలపై చర్చ ఇప్పటిది కాదు.. ఎప్పటినుంచో ఉంది. అయితే, ఇప్పుడు సోషల్‌మీడియా వల్ల దీనిపై చర్చ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా యువత సహజీవనం, విడిపోవడం వంటి నిర్ణయాలు తీసుకునేముందు.. ఒకరి ఇష్టాలు మరొకరు పూర్తిగా గౌరవించాలి. అప్పుడే వారిద్దరి రిలేషన్‌ సఫలీకృతమవుతుంది. అభిప్రాయాలు కలవకపోతే అక్కడే ఆగిపోవడం మంచిది. అలాగే, పెళ్లికి ముందే ఒకరి గురించి ఒకరు చర్చించుకోవ డం వల్ల అవగాహన పెరుగుతుంది. ఇద్దరికీ ఒక్కటే జీవితం కదా, అందుకే స్పష్టత అవసరం.

స్త్రీ సమానత్వం గురించి మీరు నిరంతరం మాట్లాడుతుంటారు.. ప్రస్తుతం సమాజంలో ఆ మార్పు కనిపిస్తోందా?

మార్పు మొదలైంది కానీ ఇంకా పూర్తిస్థాయిలో లేదు. యువతలో ఈ ధోరణి కొంత మారుతోంది. లింగ భేదం లేకుండా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికీ మహిళలు వంటింటికే పరిమితమవుతున్నారు. వారికి కూడా సొంత ఆశలు, ఆశయాలు ఉంటాయి. వాటిని గుర్తించి, అవి సాధించేలా కుటుంబ సభ్యులు సమయం ఇవ్వాలి. కేవలం ‘తల్లి’గానో, ‘భార్య’గానో ఆమెను చూడకూడదు. ఇంటి పనులను ఆడ, మగ ఇద్దరూ పంచుకోవాలి. అప్పుడే మహిళలు స్వేచ్ఛగా బయటి ప్రపంచంలోకి రాగలుగుతారు.

మహిళా రక్షణ విషయంలో సమాజం ఏవిధంగా మారాలి ?

మహిళలకు రక్షణ అనేది పురుషుల ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుంది. ఒక స్త్రీని కేవలం ఆమె దేహాన్ని చూసి కాకుండా, ఒక మనిషిగా, మహిళగా గౌరవించడం నేర్చుకోవాలి. ఆడపిల్లలకు ‘జాగ్రత్తగా ఉండాలి’ అని చెప్పడం కంటే మగపిల్లలకు ‘మహిళలతో ఎలా ప్రవర్తించాలో’ నేర్పించాలి. సమాజం కూడా ఇందులో పేరెంటింగ్‌ పాత్ర పోషించాలి. అప్పుడే దాడులు ఆగుతాయి, మహిళలకునిజమైన రక్షణ కలుగుతుంది.

- ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌

యువతకు మీరిచ్చే సందేశం?

ప్రస్తుత యువత మొదటగా వారికున్న హక్కులేంటో తెలుసుకోవాలి. ఎవరైనా సరే ఇతరులకు హాని కలిగించకూడదు. ఒకవేళ ఎక్కడైనా అన్యాయం జరుగుతుందనుకుంటే దాన్ని అడ్డుకునే బాధ్యత కూడా తీసుకోవాలి. భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహనతో, లక్ష్యంతో ముందుకు వెళ్తే కచ్చితంగా విజయం లభిస్తుంది.

Updated Date - Jan 26 , 2026 | 03:24 AM