Residents Demand Cyberabad Corporation: హైదరాబాద్‌లో కాదు.. సైబరాబాద్‌లో కలపాలి
ABN , Publish Date - Jan 09 , 2026 | 04:28 AM
హైదరాబాద్ కార్పొరేషన్ వద్దు. మాకు సైబరాబాదే ముద్దు. రాజేంద్రనగర్, ఎల్‌బీనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని అన్ని...
రాజేంద్రనగర్, ఎల్‌బీనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి నియోజకవర్గాలతో సైబరాబాద్ కార్పొరేషన్ ఏర్పాటుచేయాలి
బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆరాంఘర్‌లో రిలే నిరాహార దీక్షలు
రాజేంద్రనగర్/నార్సింగ్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ‘హైదరాబాద్ కార్పొరేషన్ వద్దు. మాకు సైబరాబాదే ముద్దు. రాజేంద్రనగర్, ఎల్‌బీనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని అన్ని డివిజన్లను కలిపి సైబరాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి’ అని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. గురువారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యం లో రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి, అత్తాపూర్ డివిజన్ల నాయకులు ఆరాంఘర్ చౌరస్తాలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి పి. కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఉన్న కొన్ని డివిజన్లను హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లో కలుపుతున్నారని, దానిని ఇక్కడి ప్రజలు, పార్టీల నాయకులు వ్యతిరేకిస్తున్నారన్నారు. ‘హైదరాబాద్ కార్పొరేషన్‌లో 80 నుంచి 90డివిజన్లలో మజ్లిస్ పార్టీ పట్టు ఉంటుంది.. అలాంటి చోట రాజేంద్రనగర్, మహేశ్వరం కలపడం రాజకీయంగానే కాకుండా అభివృద్ధిపరంగానూ ఇబ్బందే.. ఇక్క డ వసూలు చేసిన పన్నులన్నీ మేయర్‌గా మజ్లిస్ నాయకులు గెలిస్తే వారిప్రాంతాల్లో ఖర్చుపెడతారు. ఈ విషయంపై రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ స్పందించి సీఎంతో మాట్లాడాలి. రాజేంద్రనగర్ ప్రాంతాన్ని, రంగారెడ్డి జిల్లాను విచ్ఛిన్నం చేయాలనుకుంటే పెద్దఎత్తున ఉద్యమా లు చేస్తాం’ అని హెచ్చరించారు. ఇటు అఖిల పక్ష ప్రజా వేదిక ప్రతినిధులు నిర్వహించిన సమావేశంలోనూ కార్తీక్‌రెడ్డి మాట్లాడారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అన్ని సర్కిళ్లను, పోలీస్ స్టేషన్లను సైబరాబాద్ కమిషనరేట్‌లోనే ఉంచాలని డిమాండ్ చేశారు.