Share News

జలాశయాలు వెలవెల!

ABN , Publish Date - Jun 21 , 2026 | 04:54 AM

దేశంలోని ప్రధాన జలాశయాల్లోని నీటి నిల్వలు అడుగంటిపోతున్నాయి. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో కొద్ది రోజులుగా నైరుతి రుతుపవనాల విస్తరణ నిలిచిపోయింది.

జలాశయాలు వెలవెల!

  • 166 ప్రధాన రిజర్వాయర్లలో అడుగంటిన నిల్వలు

  • 27.5 శాతానికి పడిపోయిన నీటి నిల్వ సామర్థ్యం

న్యూఢిల్లీ, జూన్‌ 20: దేశంలోని ప్రధాన జలాశయాల్లోని నీటి నిల్వలు అడుగంటిపోతున్నాయి. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో కొద్ది రోజులుగా నైరుతి రుతుపవనాల విస్తరణ నిలిచిపోయింది. చాలా ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతునే ఉంది. నైరుతి సీజన్‌లో దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ (జూన్‌ 1 నుంచి 18వ తేదీ వరకూ) కురవాల్సిన వర్షపాతంలో దాదాపు 40 శాతం లోటు నమోదైంది. దీంతో 166 ప్రధాన రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న జల మట్టాలు గణనీయంగా తగ్గి వాటి మొత్తం నిల్వ సామర్థ్యంలో దాదాపు 27.5 శాతానికి పడిపోయాయి. గత పదేళ్ల సగటుతో పోలిస్తే ప్రస్తుత నిల్వలు కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ ఎల్‌నినో ప్రభావంతో పాటు రుతుపవనాల కదలికల్లో మందగమనం కారణంగా ఈ నిల్వలు మరింత తగ్గిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ 166 జలాశయాల్లో జల విద్యుత్తు ప్రాజెక్టులకు సంబంధించిన డ్యామ్‌లు 20 వరకూ ఉన్నాయి. కేంద్ర జల సంఘం గణాంకాల ప్రకారం.. గతేడాది ఇదే సమయానికి ఉన్న నిల్వలతో పోలిస్తే ఉత్తరాదిన 11, మధ్య భారతంలోని 28 రిజర్వాయర్లలోని నీటి నిల్వలు ప్రస్తుతానికి మెరుగ్గానే ఉన్నాయి. అయితే తూర్పు (27), దక్షిణ (47), పశ్చిమ (53) ప్రాంతాల్లోని జలాశయాల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిజర్వాయర్లలోని నీటి నిల్వ సామర్థ్యం 257.8 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు (బీసీఎం) కాగా, అందులో 71 శాతానికి పైగా (దాదాపు 183.6 బీసీఎం) వాటా ఈ 166 డ్యామ్‌లదే కావడం గమనార్హం. రాష్ట్రాల వారీగా చూస్తే... అస్సాం, బిహార్‌, ఛత్తీ్‌సగఢ్‌, గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, నాగాలాండ్‌, ఒడిశా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ల్లోని జలాశయాల్లో గతేడాదితో పోలిస్తే మెరుగైన నిల్వలు నమోదయ్యాయి. మరోవైపు, ఏపీ, తెలంగాణ, గోవా, జార్ఖండ్‌, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మేఘాలయ, మిజోరం, రాజస్థాన్‌, తమిళనాడు, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లోని రిజర్వాయర్లలో నిల్వలు తగ్గిపోయాయి.

Updated Date - Jun 21 , 2026 | 04:54 AM