రియల్టర్ల ప్రకటనలపై నిఘా!
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:44 AM
రియాలిటీ సంస్థలు, ప్రమోటర్లు ఇచ్చే ప్రకటనలపై రెరా అథారిటీ నిఘా పెట్టింది. రిజిస్ట్రేషన్ చేసుకోకముందే సామాజిక మాధ్యమాల్లో....
అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్‌తో రెరా ఒప్పందం
హైదరాబాద్, మార్చి 1 (ఆంధ్ర జ్యోతి): రియాలిటీ సంస్థలు, ప్రమోటర్లు ఇచ్చే ప్రకటనలపై రెరా అథారిటీ నిఘా పెట్టింది. రిజిస్ట్రేషన్ చేసుకోకముందే సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసినా, తప్పుడు ప్రకటనలు ఇచ్చినా వెంటనే గుర్తించేలా అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఏఎస్‌సీఐ-అస్కి)తో ఒప్పందం చేసుకుంది. అస్కి తన వద్ద ఉన్న ఏఐ, డేటా ట్రాకింగ్ విధానాన్ని ఉపయోగించి తెలంగాణలోని రియల్ ఎస్టేట్ ప్రకటనలను నిరంతరం స్కానింగ్ చేస్తుంది. రిజిస్ట్రేషన్ నంబరు లేని ప్రకటనలను గుర్తించి ఆ సమాచారాన్ని వెంటనే రెరా అథారిటీకి చేరవేస్తుంది. రెరా నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ వివరాలను పంపుతుంది. అస్కి ఇచ్చే సమాచారం ఆధారంగా సంబంధిత ప్రమోటర్లకు రెరా అథారిటీ షోకాజు నోటీసులు జారీ చేస్తోంది. ఇప్పటి వరకు 537 ఆన్‌లైన్ ప్రకటనలను గుర్తించగా.. 451 మంది ప్రమోటర్లు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు గుర్తించి నోటీసులు జారీ చేసింది. ‘‘సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలపై అస్కి వాచ్ డాగ్‌లా పని చేస్తోంది. వాట్సాప్ తప్ప ఇతర అన్ని మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలను అస్కి స్కాన్ చేస్తుంది. త్వరలోనే వాట్సాప్ ఫ్లాట్ ఫామ్ మీద వచ్చే ప్రకటనలను గుర్తించే సాప్ట్‌వేర్‌ను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. ఇందుకు క్రెడాయ్ సహకరించేందుకు ముందుకొచ్చింది. ప్రతిరోజూ 20 నుంచి 25 సంస్థల ప్రకటనల గురించి.. అస్కి వివరాలు పంపుతోంది. కొనుగోలుదారులను అప్రమత్తం చేసేందుకు ఈ విధానం దోహదపడుతోంది’’ అని రెరా చైర్మన్ ఎన్.సత్యనారాయణ తెలిపారు.