Share News

14 శాఖలు సమాచారం ఇవ్వలేదు!

ABN , Publish Date - Mar 07 , 2026 | 04:44 AM

కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా వివిధ శాఖల్లో ఉద్యోగుల వ్యవస్థలు, పనితీరును మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.

14 శాఖలు సమాచారం ఇవ్వలేదు!

  • ప్రభుత్వ శాఖల్లో సిబ్బంది కొరత, ఖాళీలు, సర్దుబాటుపై మాజీ సీఎస్‌ నేతృత్వంలో కమిటీ

  • గత జూన్‌లో ఏర్పాటు.. 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం

  • 9 నెలలు గడిచినా నివేదిక ఇవ్వలేకపోయిన కమిటీ

  • విద్యా, మునిసిపల్‌, నీటిపారుదల, సాంఘిక సంక్షేమం లాంటి కొన్ని శాఖలు సహకరించకపోవడం వల్లనే జాప్యం

హైదరాబాద్‌, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా వివిధ శాఖల్లో ఉద్యోగుల వ్యవస్థలు, పనితీరును మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇందుకోసం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నేతృత్వంలో ఏర్పడిన ఈ కమిటీలో ముగ్గురు కీలక అధికారులు.. విశ్రాంత ఐఏఎస్‌ ఎన్‌.శివశంకర్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, ఎం.రఘునందన్‌రావులను సభ్యులుగా నియమించింది. కమిటీ కేవలం ఉద్యోగుల సంఖ్యను లెక్కించడమే కాకుండా.. పలు అంశాలపై లోతైన అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 2025 జూలై 8న కమిటీ ఏర్పడగా.. 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని గడువు నిర్దేశించింది. 9 నెలలు గడిచినా నేటికీ కమిటీ నివేదికను అందించలేకపోయింది. ఇందుకు ప్రధాన కారణం.. కమిటీ కోరిన వివరాలను కొన్ని శాఖలు పంపకపోవడమే. 33 శాఖలకు కమిటీ లేఖలు రాయగా.. 14 శాఖలు వివరాలను పంపకపోవడంతో నివేదిక ఆలస్యమైనట్లు సమాచారం.


ప్రక్షాళన చేయాలనుకున్న సర్కారు

కమిటీ నివేదిక వచ్చాక.. పలు శాఖల్లో మార్పులు చేయాలని ప్రభుత్వం భావించింది. కొన్ని శాఖల్లో అవసరానికి మించి ఉద్యోగులు ఉండడం.. మరికొన్ని శాఖల్లో సిబ్బంది కొరత వల్ల పాలనలో సమతుల్యత లోపించినట్లు గుర్తించిన ప్రభుత్వం.. కమిటీ నివేదిక ఆధారంగా శాఖల్లో ఉద్యోగులను సర్దుబాటు చేసి, పోస్టుల హేతుబద్ధీకరణ చేయాలని భావించింది. ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థల్లో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారో లెక్కలు తేల్చాల్సి ఉంది. అలాగే శాఖల వారీగా మంజూరైన పోస్టులు ఎన్ని? ప్రస్తుతం పని చేస్తున్న వారు ఎంత మంది? ఎన్ని ఖాళీలు ఉన్నాయి..? అనే వివరాలపై సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉంది. ఇప్పుడు ఉన్న పోస్టులు సరిపోతాయా? లేక కొత్త పోస్టులను సృష్టించాలా? అనే దానిపై ప్రభుత్వానికి తగిన సిఫారసులు చేయాల్సి ఉంది. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ద్వారా తాత్కాలిక ఉద్యోగులుగా పని చేస్తున్న వారి సేవలు ప్రభుత్వానికి ఎంత మేర అవసరం అనే అంశాలను పరిశీలించి.. వారిని పెంచాలా? తగ్గించాలా? అనే కోణంలోనూ నివేదిక ఇవ్వాల్సి ఉంది. దీంతోపాటు కాలం చెల్లిన పోస్టులను గుర్తించి.. వాటిని రద్దు చేయడం లేదా మరో శాఖ అవసరాలకు మార్చడంపై సిఫారసు చేయాల్సి ఉంది. ఈ కమిటీ సమగ్ర వివరాలతో 2025 అక్టోబరుకే నివేదికను అందించాల్సి ఉండగా.. కొన్ని శాఖల నుంచి సకాలంలో వివరాలు అందలేదు. విద్య, వైద్య ఆరోగ్య, పురపాలక, నీటి పారుదల, సాంఘిక సంక్షేమ, వ్యవసాయ తదితర శాఖలు కమిటీకి వివరాలు అందించకపోవడంతో నివేదిక రూపొందించడంలో జాప్యం జరుగుతున్నట్లు తెలిసింది.

కమిటీ అసహనం

సకాలంలో సమాచారం పంపని శాఖలపై కమిటీ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సుమారు 14 శాఖలకు సంబంధించిన కార్యదర్శులు, హెచ్‌వోడీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి.. నివేదిక ఇవ్వాలని వారం రోజుల గడువు ఇచ్చినా అరకొర సమాచారం మాత్రమే ఇచ్చినట్లు సమాచారం. ఒకవేళ వివరాలు అందకపోతే ఆర్థిక శాఖ వద్ద ఉన్న డేటా ఆధారంగా అంచనాలు తయారు చేస్తామని కమిటీ హెచ్చరించినట్లు తెలిసింది. ఈ వివరాలన్నీ అందిన తర్వాతే కమిటీ పూర్తి స్థాయి నివేదికను ముఖ్యమంత్రికి అందించే అవకాశం ఉంది. కాగా, కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం కొత్త నియామకాలకు ప్రకటనలు ఇవ్వడంతోపాటు ఉద్యోగుల బదిలీలు, సర్దుబాట్లు చేయాలని భావించింది.

Updated Date - Mar 07 , 2026 | 04:44 AM