సర్దుబాటు మంత్రం..!
ABN , Publish Date - Mar 25 , 2026 | 04:46 AM
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం మారనుంది. నియోజకవర్గాల సంఖ్య పెరగనుండడంతో కొత్త తరం నాయకులు తెరపైకి రానున్నారు.
నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రంలో పెరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల సంఖ్య
సీట్ల కేటాయింపుపై కొత్తతరం నేతల్లో చిగురిస్తున్న ఆశలు
సర్దుబాటులో రాజకీయ పార్టీలకూ కొంత ఉపశమనం
పెరిగే సీట్లలో సగం.. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోనే పెరగనున్న మహిళా భాగస్వామ్యం
జిల్లా హద్దులు దాటకుండా అసెంబ్లీ నియోజకవర్గం
హైదరాబాద్, మార్చి 24(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం మారనుంది. నియోజకవర్గాల సంఖ్య పెరగనుండడంతో కొత్త తరం నాయకులు తెరపైకి రానున్నారు. నియోజకవర్గాల్లో పాతుకుపోయిన సీనియర్ల తర్వాత ఎన్నికల టికెట్ కోసం ఎదురుచూస్తున్న నేతల్లో కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆశలు చిగురింపజేసింది. కేంద్రం చెబుతున్న ప్రకారం రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 119 నుంచి 179కు, లోక్‌సభ సీట్ల సంఖ్య 17 నుంచి 26కు చేరనుంది. దీంతో 69 మందికి కొత్తగా చట్టసభల్లో ప్రాతినిథ్యం దక్కనుంది. పెరిగిన సీట్ల వల్ల సీట్ల సర్దుబాటు అంశంలో రాజకీయ పార్టీలకు ఉపశమనం కల్పిస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతం చాలా నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలకు చెందిన సీనియర్ నేతలు పాతుకుపోయి ఉండడం, వారిని ఆ స్థానం నుంచి కదిలించడం పెద్ద సవాలుగా మారడమే ఇందుకు కారణం. ఉదాహరణకు జగిత్యాల సీటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా దశాబ్దాలుగా ఆ పార్టీ సీనియర్ నేత జీవన్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి సంజయ్ ఆయనపై గెలిచారు. ఇప్పుడు సంజయ్ కాంగ్రెస్‌లో చేరడాన్ని సహించని జీవన్‌రెడ్డి పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే, 2023 ఎన్నికల్లో ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం స్థానాలపై కాంగ్రెస్ నేతలు భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ, పొంగులేటి శ్రీనివాస్, తుమ్మల నాగేశ్వరరావును పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్.. పాలేరు, ఖమ్మం టికెట్లను వారికి కేటాయించింది. పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటును సీపీఐకి ఇచ్చింది. దీంతో ఆ జిల్లాల్లోని కొందరు కాంగ్రెస్ నేతలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇప్పుడు పునర్విభజన పుణ్యమాని సీనియర్ల వల్ల, ఇతర కారణాల వల్ల గతంలో టికెట్ పొందలేకపోయిన నేతల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఇక, గత ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపుల సందర్భంగా అనేక మంది నేతలకు నామినేటెడ్ పదవులకు సంబంధించి కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన హామీలు ఎక్కువ, అందుబాటులో ఉన్న పదవులు తక్కువ కావడంతో.. సర్దుబాటు విషయంలో అధికార పార్టీ ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ఇప్పుడు సీట్ల సంఖ్య పెరగనుండడంతో.. అది నామినేటెడ్ పదవుల కేటాయింపు అప్పుడు కూడా అధికార పార్టీకి లబ్ధి చేకూర్చనుంది. మరో వైపు దామాషాలో మంత్రుల సంఖ్య కూడా పెరగనుంది. రాష్ట్రంలో 179 మంది ఎమ్మెల్యేలకుగాను సీఎం సహా 27 మందికి మంత్రివర్గంలో చోటు దక్కనుంది. ప్రస్తుతం క్యాబినెట్లో సీఎం సహా 18 మందికే అవకాశముంది.
పెరగనున్న మహిళా నాయకత్వం
నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రంలో మహిళా నాయకత్వం పెద్ద ఎత్తున పెరగనుంది. అసెంబ్లీ సీట్ల సంఖ్య 179కి పెరగనుండగా.. అందులో 60 సీట్ల దాకా మహిళలకే రిజర్వ్ కానున్నాయి. అలాగే 7 పార్లమెంటు సీట్లూ రిజర్వ్ కానున్నాయి. దీంతో అనేక నియోజకవర్గాల్లో పాతుకుపోయిన సీనియర్లను మహిళా రిజర్వేషన్ల పేరుతో తప్పించే అవకాశం పార్టీలకు దక్కనుంది. మహిళా రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతుల్లో అమలు చేయనుండటం తో ఏ నియోజకవర్గమూ ఒక నాయకుని సొంతమనే పరిస్థితి కూడా ఉండదు. అయి తే నియోజకవర్గం మహిళకు రిజర్వ్ అయితే సీనియర్ నేతలు తమ కుటుంబంలోని మహిళలతో పోటీ చేయించే అవకాశాలు అధికం. కాగా దామాషాలో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు సీట్లూ పెరగనుండటంతో ఆయా వర్గాల నుంచి కొత్త నాయకత్వం రానుంది.
జిల్లా పరిధిలోనే నియోజకవర్గం
నియోజకవర్గ పునర్విభజనలో శాసనసభ నియోజకవర్గం.. స్థానిక జిల్లా హద్దులు దాటకుండా నిర్ణయిస్తారని చెబుతున్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన జిల్లాల పునర్విభజనతో అనేక శాసనసభ నియోజకవర్గాలు రెండు, మూడు జిల్లాలకు విస్తరించి ఉన్నాయి. ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపై రెండు నుంచి మూడు జిల్లాల కలెక్టర్లు, అధికారులు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితి రాకుండా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం.. స్థానిక జిల్లా సరిహద్దులు దాటకుండా నిర్ణయించనున్నట్లు చెబుతున్నారు.
నిర్ణయించేది హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డే..!
నియోజకవర్గాల పనర్విభజనతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే అత్యధికంగా సీట్లు పెరుగుతాయని అంటున్నారు. ఈ జిల్లా పరిధిలో శేరిలింగంపల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, మేడ్చల్, కూకట్‌పల్లి, మల్కాజిగిరి తదితర నియోజకవర్గాల్లో సగటున 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. శేరిలింగంపల్లిలో 7.32 లక్షలు, ఉప్పల్‌లో 4.54 లక్షలు, మల్కాజిగిరిలో 4.30లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పునర్విభజన సందర్భంగా ఓ నియోజకవర్గానికి ఓటర్ల సంఖ్య గరిష్టంగా 2.20 లక్షలు పేర్కొనే అవకాశముంది. అదే జరిగితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే 20 కొత్త నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. అలాగే సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని జూబ్లీహిల్స్, సనత్‌నగర్, అంబర్‌పేట్, ముషీరాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లోనూ పరిమతికి మించి ఓటర్లు ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలోని హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో కొత్తగా 8 నుంచి పది దాకా నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం ఓటర్లు పెద్ద ఎత్తున ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు వలస వె ళ్లిన నేపథ్యంలో పాత నగరం నియోజకవర్గాలు పెద్దగా పెరిగే అవకాశం లేదని చెబుతున్నారు. మొత్తమ్మీద హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలు కలుపుకొని 28 నుంచి 30 అసెంబ్లీ సీట్లు, 2 నుంచి 4లోక్‌సభ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ రెండు జిల్లాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 57 నుంచి 59 వరకూ చేరవచ్చు. మొత్తం 179 నియోజకవర్గాల్లో సింహభాగం.. 59 నియోజకవర్గాలు ఈ రెండు జిల్లాల్లో ఉండనుండటంతో ఇక్కడ మెజార్టీ సాధించిన పార్టీలే అధికారంలోకి వచ్చే అవకాశం అధికం. పాత నగరం(ఓల్డ్ సిటీ) సీట్లు పెద్దగా పెరిగే అవకాశం లేకపోవడంతో.. ఎంఐఎం ప్రభావం కూడా ప్రస్తుతం ఉన్న దాని కంటే పెరిగే అవకాశం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి... హైదరాబాద్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టారనే అభిప్రాయాలు ఉన్నాయి.