కర్ల రాజేశ్ మృతదేహానికి రీపోస్టుమార్టం పూర్తి
ABN , Publish Date - Feb 28 , 2026 | 04:18 AM
పోలీసులు కొట్టడంతోనే కోదాడకు చెందిన దళిత యువకుడు కర్ల రాజేశ్ మృతి చెందాడన్న ఆరోపణల నేపథ్యంలో.. అతడి మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు.
వాస్తవాలను దాచిపెడితే సహించబోం: మంద కృష్ణమాదిగ
కోదాడ టౌన్, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): పోలీసులు కొట్టడంతోనే కోదాడకు చెందిన దళిత యువకుడు కర్ల రాజేశ్ మృతి చెందాడన్న ఆరోపణల నేపథ్యంలో.. అతడి మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల వ్యవహారంలో పోలీసు రిమాండ్‌లో ఉన్న సమయంలోకర్ల రాజేశ్ మరణించగా.. పోలీసులు కొట్టడంతోనే అతడు మృతి చెందాడని పలు సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే ఎస్సీ జాతీయ కమిషన్ ఆదేశాల మేరకు శుక్రవారం బీబీనగర్ ఎయిమ్స్ ఫోరెనిక్స్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ప్రగ్నేశ్ ఫార్మర్ నేతృత్వంలో రాజేశ్ మృతదేహానికి రీపోస్టుమార్టం ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ జి.రవి నేతృత్వంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజేశ్ మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించడాన్ని ఎమ్మార్పీఎస్ పక్షాన స్వాగతిస్తున్నామని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. రాజేశ్ మృతి చెందిన మొదటి వారంలోనే రీపోస్టుమార్టం చేసి ఉంటే మృతికి కారణాలు స్పష్టంగా తెలిసేవని.. కాలం గడిస్తే మృతదేహం కుళ్లి ఒంటిపై గాయాలు కనబడవనే దురుద్దేశంతోనే పోలీసులు కాలయాపన చేశారని ఆరోపించారు. దీని వెనుక నిందితులను కాపాడే కుట్ర ఉందన్నారు. రీపోస్టుమార్టం నివేదికలో వాస్తవాలను వెల్లడించకపోతే సహించబోమని చెప్పారు. రాజేశ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు, నిందితులకు శిక్ష పడేవరకు పోరాడతామని స్పష్టం చేశారు.