ప్రముఖ ఉర్దూ రచయిత్రి జిలానీ బానో కన్నుమూత
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:54 AM
ప్రఖ్యాత ఉర్దూ రచయిత్రి, పద్మశ్రీ అవార్డు గ్రహీత జిలానీ బానో(90) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
హైదరాబాద్ సంస్కృతి, సామాన్యుల జీవితాలే ఇతివృత్తంగా రచనలు
2001లో పద్మశ్రీతో గౌరవించిన కేంద్రం
సామాజిక కార్యకర్తగానూ కృషి
హైదరాబాద్ సిటీ, మార్చి1 (ఆంధ్రజ్యోతి): ప్రఖ్యాత ఉర్దూ రచయిత్రి, పద్మశ్రీ అవార్డు గ్రహీత జిలానీ బానో(90) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. జిలానీ అంత్యక్రియలు బంజారాహిల్స్‌లో ఆదివారం రాత్రి ముగిశాయి. హైదరాబాద్‌లోని మల్లేపల్లిలో 1936లో జన్మించిన జిలానీ బానో.. తన 14వ ఏట నుంచే కథా రచన ప్రారంభించారు.హైదరాబాద్ నగర సంస్కృతిని, సామాన్యుల జీవితాలనుతన కలంతో ప్రపంచానికి పరిచయం చేశారు. సుమారు 95పుస్తకాలను రచించిన ఆమె.. ఉర్దూ సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రవేశారు. ఆమె కథ, మాటలు స్ర్కీన్‌ప్లే అందించిన ‘నర్సయ్యకీ బౌడీ’ దూరదర్శన్‌లోధారావాహికగా ప్రసారమవడమే కాకుండా.. శ్యామ్ బెనగల్ దర్శకత్వంలో ‘వెల్‌డన్ అబ్బా’ సినిమాగా రూపుదిద్దుకుంది. ఆమె రచనలు కొన్నింటిని దాశరథి రంగాచార్య తెలుగులోకి అనువదించారు. జిలానీ బానో రచనలు కేవలం భారతీయ భాషలకే పరిమితం కాలేదు. రష్యన్, ఇంగ్లిష్, జర్మన్, నార్వేజియన్ వంటి యూరోపియన్ భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆమె సాహిత్యంపై ఉజ్బెకిస్తాన్ వర్సిటీ, ఢిల్లీ జఎన్‌యూ, అలీఘఢ్ ముస్లిం వర్సిటీ ల్లో పరిశోధనలు జరిగాయి. ‘అస్మిత’ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలిగా గ్రామీణ మహిళల సాధికారత కోసం ఆమె శ్రమించారు. సాహిత్యరంగానికి ఆమె చేసిన సేవలకు 2001లో పద్మశ్రీ అవార్డు వరించింది.