Renu Desai: వంద కుక్కల్లో నాలుగైదే కరుస్తాయ్!
ABN , Publish Date - Jan 20 , 2026 | 01:58 AM
ఎవడో ఒకడు లైంగిక దాడికి పాల్పడ్డాడని మగాళ్లందరినీ చంపేయలేం కదా? అలాగే ఏదో ఒక కుక్క కరిస్తే.. వీధి కుక్కలన్నింటినీ నిర్మూలించాలనుకోవడం దుర్మా ర్గం కాదా...
దానిమీదే ఫోకస్ చేస్తే ఎలా?.. సుప్రీంకోర్టువి తలాతోక లేని వ్యాఖ్యలు.. అసలు సెన్స్ ఉందా?
న్యాయ వ్యవస్థే పెద్ద జోక్.. కావాలంటే నన్ను జైల్లో పెట్టండి
మన దేశంలో డబ్బుంటేనే భద్రత.. లేకపోతే రక్షణే లేదు
దోమకాటు, రోడ్డు ప్రమాదాల్లో ఎంతమంది చనిపోవట్లేదు?
ప్రభుత్వాస్పత్రుల్లో లక్షల్లో మరణిస్తున్నారు
కొందరు మద్యం మత్తులో వాహనాలు నడిపి ఉసురు తీస్తున్నారు
కాలభైరవుడిగా ఆరాధిస్తూనే కుక్కలను చంపడం ఏమిటి?: రేణు దేశాయ్
హైదరాబాద్ సిటీ, జనవరి19 (ఆంధ్రజ్యోతి): ‘ఎవడో ఒకడు లైంగిక దాడికి పాల్పడ్డాడని మగాళ్లందరినీ చంపేయలేం కదా? అలాగే ఏదో ఒక కుక్క కరిస్తే.. వీధి కుక్కలన్నింటినీ నిర్మూలించాలనుకోవడం దుర్మా ర్గం కాదా?’ అని సినీనటి, ఓ జంతు సంరక్షణ కేంద్రం నిర్వాహకురాలు రేణు దేశాయ్ ప్రశ్నించారు. వంద కుక్కల్లో ఓ నాలుగైదే కరుస్తాయని, వాటిని ఎలా నియంత్రించాలన్నదానిపైనే దృష్టిపెట్టాలి తప్ప మొత్తం గా వీధి కుక్కలనే లేకుండా చేయాలనుకోవడం అమానవీయమని ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కలను కాలభైరవుడిగా ఆరాధిస్తూనే వాటిని చంపేయడం భావ్యం కాదన్నారు. మనుషుల్లో చెడ్డవాళ్లు ఉన్నట్టే కుక్కల్లోనూ కొన్నే కరుస్తాయన్న విషయాన్ని గుర్తించాలని అభ్యర్థించారు. వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా సహేతుకంగా లేవన్నారు. వీధి కుక్కల విషయమ్మీద సుప్రీంకోర్టు తలాతోక లేకుండా వ్యాఖ్యలు చేసిందని వ్యాఖ్యానించారు. ఇటీవల వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ధర్మాసనంలోని ఓ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు.. తెలంగాణ, ఏపీలో కుక్కలను చంపిన ఘటనల నేపథ్యంలో ‘తెలంగాణ జంతు పరిరక్షణ సంఘాల ఉమ్మడి కార్యాచరణ సమాఖ్య’ ప్రతినిధులు సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ‘శ్రీ ఆద్య యానిమల్ రెస్క్యూ సెంటర్’ నిర్వాహకురాలు రేణు దేశాయ్ హాజరై ఆవేశం, భావోద్వేగం మిళితమైన స్వరంతో మాట్లాడారు. మన దేశంలో కుక్కకాటు కంటే దోమ కాటు, రోడ్డు ప్రమాదాల వల్ల ఎక్కుమంది చనిపోతున్నారని.. ప్రభుత్వాస్పత్రుల్లో లక్షల మంది మరణిస్తున్నారని, కొందరు మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఎంతో మంది ఉసురుతీస్తున్నారని, ఆ ప్రాణాలకు విలువలేదా? అని ప్రశ్నించారు రోడ్డు భద్రత చర్యల మీద గానీ, మద్యం దుకాణాలను మూసివేసే విషయమ్మీద గానీ సర్కారు ఎందుకు ఆలోచించడం లేదు? అని ప్రశ్నించారు. కుక్కలు కరస్తున్నాయన్నదానిమీదే ఫోకస్ చేయొద్దని, పరిష్కారాల గురించి ఆలోచించాలని సూచించారు. మూగ జీవాల ప్రాణాలూ విలువైనవని గుర్తించాలని కోరారు. కుక్కలు ప్రమాదకరంగా ఉన్నట్లు అనిపిస్తే జంతు సంరక్షణ కోసం పనిచేస్తున్న సంస్థలకు గానీ, జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్‌కు గానీ సమాచారమివ్వాలని సూచించారు. వీధి కుక్కలకు ప్రత్యేక షెల్టర్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
కుక్కల చికిత్స కోసం లక్షల్లో ఖర్చుచేస్తున్నా
సమావేశంలో రేణు దేశాయ్ మాట్లాడుతుండగా ఓ వ్యక్తి జోక్యం చేసుకున్నారు. వీధి కుక్కల గురించి ఇక్కడ మాట్లాడటం కాదు, పల్లెల్లోకి వెళ్లి వాస్తవ పరిస్థితులు చూడాలని, చిన్న పిల్లల్ని కుక్కలు కరిచి చంపుతున్నాయని, ఆ కుక్కల్ని ఇంటికి తీసుకెళతారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రతిగా రేణుదేశాయ్ ఆయనపై కేకలు వేశారు. వీధి కుక్కల కోసం తాను చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకొని మాట్లాడాలని ఆయనకు చెప్పారు. రోజూ ప్రమాదానికి గురైన ఐదారు కుక్కల చికిత్స చేయిస్తున్నానని, ఇందుకు రూ.లక్షల్లో వెచ్చిస్తున్నానని చెప్పారు. ఒక్క డిసెంబరులోనే 85కుపైగా కుక్కలను, వాటి పిల్లలను తాను కాపాడినట్లు చెప్పారు. ‘సరైన వైద్యం అందక దేశంలో లక్షలమంది చనిపోతుంటే పట్టదు గానీ వీధి కుక్కలమీద మాత్రం ఇష్టానుసారంగా మాట్లాడతారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా కొంతమంది ‘కుక్కల వల్ల నీ బిడ్డ ప్రాణాలమీదకొస్తే ఆ బాధ తెలుస్తుంది’ అంటూ దారుణంగా మాట్లాడుతున్నారని, ఇది ఎంత వరకు సబబు? అని ప్రశ్నించారు. ప్రెస్‌మీట్‌లో ఓ వ్యక్తి తనపై కేకలు వేస్తూ గొడవ చేశారని, ఆయన మీడియా వ్యక్తి కాదన్నారు. మూగజీవాల తరపున మాట్లాడుతున్న కారణంగా తన వ్యక్తిగత జీవితమ్మీద ఇష్టారీతిగా ట్రోల్ చేయడం తగదన్నారు. జాతీయ స్థాయిలో మేనకాగాంధీ లాంటి వ్యక్తుల సారఽథ్యంలో వీధికుక్కల సంరక్షణకు ఒక విధానం రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
మన వ్యవస్థలన్నీ అవినీతిమయం
సుప్రీం ధర్మాసనంలోని న్యాయమూర్తి, జస్టిస్ విక్రమ్‌నాథ్ ‘‘వీధి కుక్కలు కరిస్తే, వాటికి ఆహారం పెట్టిన వారిని కూడా బాధ్యులను చేసేలా ఆలోచిస్తున్నాం’’ అని వ్యాఖ్యానించిన నేపథ్యంలో రేణుదేశాయ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ‘‘సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో ఏమైనా తల, తోక ఉందా. ఆ ఉత్తర్వుల్లో ఏమైనా సెన్స్ ఉందా? అది అత్యున్నత న్యాయస్థానం. వంద శాతం ఆయన్ను (జస్టిస్ విక్రమ్‌నాథ్‌ను ఉద్దేశించి) కుక్క ఏదైనా చేసుంటుంది. మానవీయ కోణం నుంచి వచ్చిన ఉత్తర్వు కాదది. పూర్తిగా వ్యక్తిగతంగా ఇచ్చిన ఉత్తర్వు. ఓపెన్ చాలెంజ్ చేస్తున్నాను. కావాలంటే నన్ను జైల్లో పెట్టండి’’ అని ఆమె వ్యాఖ్యానించారు. మొత్తంగా న్యాయ వ్యవస్థే పెద్ద జోక్‌గా మారిందని, ఇది తాను అనుభవంతో చెబుతున్నానన్నారు. మన దేశంలో డబ్బుంటేనే భద్రత. లేకపోతే ప్రజలకు రక్షణ లేదన్నారు. మన వ్యవస్థలన్నీ అవినీతిమయం అయ్యాయని, ఇక్కడ ఉండలేకపోతున్నామని అసహనం వ్యక్తం చేశారు. సుప్రీకోర్టు, జీహెచ్‌ఎంసీ, నేతలు, ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలు ఇలా అంతటా అవినీతి జరుగుతోందని, దీన్నెవరూ కాదనలేరన్నారు. ఇవాళ కొన్ని లక్షలమంది మన దేశం వదిలి వెళ్లిపోతున్నారని, దీనికి దేశంలో పెరిగిపోయిన అవినీతే కారణమన్నారు. రోడ్లు బాగాలేవని, అయినా ఠంచనుగా పన్నులు కడుతున్నామన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో సరైన వైద్యం చేయించుకునే పరిస్థితులు లేవన్నారు. కాగా సంస్కృతి, ఆచారాలు అంటే స్త్రీల వస్త్రధారణ వంటి మాత్రమే కాదని, మన చుట్టూ ఉన్న జీవాలను పరిరక్షించడం భారతీయ సంస్కృతిలో భాగమని సమావేశంలో పాల్గొన్న యాంకర్ రష్మీ వ్యాఖ్యానించారు. కుక్కలను చంపిన ఘటనలపై కేసు దాఖలు చేసినట్లు స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. సమావేశంలో సినీ దర్శకుడు శశికిరణ్ తిక్క, జంతు పరిరక్షకురాలు ప్రవళిక, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.