కౌశిక్ రెడ్డిపై హెచ్చార్సీకి ఫిర్యాదు
ABN , Publish Date - Feb 03 , 2026 | 02:57 AM
మత విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు రాష్ట్ర మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ .....
మత విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు
చర్యలు తీసుకోండి: ఫహీముద్దీన్ ఖురేషీ
హైదరాబాద్, గన్‌పార్క్, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): మత విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు రాష్ట్ర మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎంఆర్‌ఈఐఎస్) వైస్ చైర్మన్ ఫహీముద్దీన్ ఖురేషీ ఫిర్యాదు చేశారు. జనవరి 29న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీనంకలో సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా ట్రాఫిక్ విధుల్లో ఉన్న పోలీసులపై, ముఖ్యంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అవమానకరంగా, ఆధారరహితంగా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో తెలిపారు. కమిషనర్‌ను మతపరంగా దూషిస్తూ, హిందూ సంస్కృతిని నాశనం చేస్తున్నారని, మత మార్పిడులకు పాల్పడుతున్నారంటూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కోట్లాది ముస్లింల మనోభావాలను దెబ్బతీశాయని ఫిర్యాదులో వివరించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరినట్లు ఖురేషీ తెలిపారు.