kumaram bheem asifabad- మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు ఊరట
ABN , Publish Date - Apr 22 , 2026 | 11:26 PM
జిల్లాలో మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న రోగులకు ఇక కష్టాలు తీరనున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు మంజూరు కావడంతో ఇక వారి బాధలు తీరనున్నాయి. జిల్లాలోని బెజ్జూరు, కౌటాల, తిర్యాణి, కెరమెరి, జైనూరు మండలాల్లో డయాలసిస్ కేంద్రాలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో కిడ్నీ బాధితులకు ఊరట లభించింది. గతంలో జిల్లాలోని ఆసిఫాబాద్‌లో 10బెడ్లు, ఉండగా మరో 5బెడ్లు మంజూరయ్యాయి.
- జిల్లాలో ఐదు మండలాల్లో ఏర్పాటుకు చర్యలు
బెజ్జూరు, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న రోగులకు ఇక కష్టాలు తీరనున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు మంజూరు కావడంతో ఇక వారి బాధలు తీరనున్నాయి. జిల్లాలోని బెజ్జూరు, కౌటాల, తిర్యాణి, కెరమెరి, జైనూరు మండలాల్లో డయాలసిస్ కేంద్రాలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో కిడ్నీ బాధితులకు ఊరట లభించింది. గతంలో జిల్లాలోని ఆసిఫాబాద్‌లో 10బెడ్లు, ఉండగా మరో 5బెడ్లు మంజూరయ్యాయి. కాగజ్‌నగర్‌లో 5బెడ్ల సౌకర్యం ఉండగా, మరో 5బెడ్లకు సౌకర్యం ఏర్పాటు చేశారు. బెజ్జూరు, తిర్యాణి, జైనూరు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కొత్తగా డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఒక్కో ఆసుపత్రిలో 5చొప్పున బెడ్లకు సౌకర్యం కలిగింది. కౌటాల, కెరమెరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 5చొప్పున బెడ్లకు వసతి ఏర్పాటు చేశారు. జిల్లాలో గతంలో పూర్తిస్థాయిలో డయాలసిస్ కేంద్రాలు లేక కీడ్నీ బాధితులకు సరైన సేవలు అందక కొందరు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించారు. దీంతో జిల్లాకు మంజూరు కావడంతో త్వరలోనే బాధితులకు పూర్తిస్థాయిలో సేవలు అందే అవకాశం ఉంది. గతంలో 15బెడ్లకు వసతి ఉండగా, పెరిగిన కారణంగా 40బెడ్లకు పెరగడంతో ఇక ఆరోగ్య సేవలు సులువుగా మారే అవకాశం ఉంది.
- రెండు వందలకు పైగా..
ఇప్పటికే జిల్లాలో సుమారు రెండు వందల మందికిపైగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. గతంలో కేవలం కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ పట్టణాల్లో మాత్రమే డయాలసిస్ కేంద్రాలు ఉండగా, తాజాగా మరో 5మండలాల్లో కేంద్రాలు మంజూరు చేశారు. మారుతున్న జీవన విధానం కార,ణంగా నీటి కలుషితం, ఆహార పదార్థాల్లో రసాయానాల వినియోగంతో పిల్లల్లో సైతం కిడ్నీ సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి. కిడ్నీ బాఽధితుల్లో 40ఏళ్లలోపు కావడం వైద్యశాఖను కలవరపెడుతోంది. మూత్రపిండాల పనితీరు తగ్గి ఎర్రరక్తకణాలపై ప్రభావం ఏర్పడి వాటి ఉత్పత్తి తగ్గి అలసట, మెదడుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తి కీడ్నీలు చెడిపోతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
- తగ్గనున్న దూరభారం..
జిల్లాలో ఐదు మండలాల్లో డయాలసిస్ కేంద్రాల మంజూరుతో దూరభారంతో పాటు ఆర్థిక భారం కూడా తగ్గనుంది. ఇప్పటికే వైద్యగణాంకాల మేరకు జిల్లాలో రోజురోజుకు వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. జిల్లాలోని కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ మండలాల్లో వారి సంఖ్య ఎక్కువగా ఉండగా మారుమూల గ్రామాల్లో సైతం జీవన విధానం కారణంగా వ్యాధిగ్రస్థులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో డయాలసిస్ కేంద్రంలో అయిదు పడకలతో పాటు ఆధునాతన పరికరాలు ఏర్పాటు చేయనున్నారు. నీటి శుద్ధ ప్లాంట్, శీథల యంత్రాలు, వైద్య నిపుణు లతో పాటు ముగ్గురు టెక్నీషియన్లు, ఇద్దరు స్టాష్ నర్సులు అందుబాటులో ఉండనున్నారు. ఒక్కో కేంద్రంలో 10మందికిపైగా రక్తం శుద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఉన్న కేంద్రాలకు వెళ్లాలంటే కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ లేదా మంచిర్యాలకు వెళ్లి రక్తం శుద్ది చేసుకునేవారు. కొత్తగా కేంద్రాల ఏర్పాటుతో దూరభారం తగ్గడంతో వ్యాధిగ్రస్థులు ఊపిరి పీల్చుకుంటున్నారు. దూరప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో ఆర్థిక భారం కూడా ఎక్కువగానే ఉండేది.
త్వరలోనే పరిశీలన బృందం..
- డాక్టర్ అవినాష్, డీసీహెచ్‌ఎస్, ఆసిఫాబాద్
జిల్లాలో కొత్తగా ఐదు మండలాల్లో డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు ఆదేశాలు వచ్చాయి. త్వరలోనే ఆయా మండలాల్లో పరిశీలన బృందం పరిశీలించి గదులు, స్టాఫ్ వంటి వసతులు పరిశీలించి కేంద్రాల ఏర్పాటును పర్యవేక్షిస్తారు. జిల్లాలో కొత్తగా కేంద్రాలు ఏర్పాటుతో కిడ్నీవ్యాధిగ్రస్థులకు దూరభారంతో పాటు ఆర్థిక భారం తప్పనుంది. ఆయా కేంద్రాల్లో మెరుగైన వైద్య చికిత్సలు అందేలా చర్యలు తీసుకుంటాం